కాలేజ్‌ టు కంటెస్ట్‌..!

ABN , First Publish Date - 2020-11-29T06:50:33+05:30 IST

ఐటీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌.. ఎంబీఏ పోస్టు గ్రాడ్యుయేట్‌.. బీబీఏ స్టూడెంట్‌, బీకాం.. ఇలా కాలేజీ నుంచి కొందరు నేరుగా గ్రేటర్‌ ఎన్నికల బరిలో దిగారు.

కాలేజ్‌ టు కంటెస్ట్‌..!
తపస్విని యాదవ్‌

గ్రేటర్‌ బరిలో విద్యార్థులు

కాంగ్రెస్‌ నుంచి తపస్వినియాదవ్‌, అభిషేక్‌ చౌంగ్లే

ఇండిపెండెంట్లుగా వరలక్ష్మి, జ్యోత్స్నప్రియ, వైష్ణవి

ఐటీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌.. ఎంబీఏ పోస్టు గ్రాడ్యుయేట్‌.. బీబీఏ స్టూడెంట్‌, బీకాం.. ఇలా కాలేజీ నుంచి కొందరు నేరుగా గ్రేటర్‌ ఎన్నికల బరిలో దిగారు. ఉన్నత చదువులు చదివిన వీరంతా ఏ అమెరికాకో వెళ్లి పోకుండా..  సాఫ్ట్‌వేర్‌, ఇతర ఉద్యోగాల కోసం చూడకుండా ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇలా పోటీ చేస్తున్న వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు  కూడా ఉండటం గమనార్హం. మొత్తంగా గ్రేటర్‌ బరిలో 21 మంది విద్యార్థులు పోటీ చేస్తున్నారు. వీరి వయస్సు 21 నుంచి 25 ఏళ్ల మధ్యనే ఉంది. కార్పొరేటర్లు  గా పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కుల్లో వీరే ఉండటం విశేషం. అయితే ఎన్నికల్లో పార్టీలు 13 మంది విద్యార్థులకు టికెట్లు ఇచ్చాయి. కాంగ్రెస్‌ 5, టీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 2, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. 

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌నగర్‌ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తపస్విని యాదవ్‌ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు కాలేజే తన ప్రపంచంగా ఉన్న ఆమె ఎన్నికల క్షేత్రంలో దిగిన తర్వాత మాటల తూటాలు పేలుస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకనవుతానంటున్నారామె. తపస్విని ఇటీవలే శ్రీనిధి ఇంజనిరంగ్‌ కాలేజ్‌లో ఐటీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 

జియాగూడ కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ చౌంగ్లే ఇటీవల బీకాం పూర్తి చేశారు. ఎంబీఏ చేయాలనే ఆలోచనతో ఐసెట్‌లో మెరుగైన ర్యాంకును సాధించాడు. రాజకీయాలపై మక్కువతో ఎన్నికల బరిలో దిగారు. ఈ డివిజన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అందరికంటే చిన్నవాడైన అభిషేక్‌ యువత ఓట్లను పట్టుకునే పనిలో ఉన్నారు.  

సికింద్రాబాద్‌ నియోజకవర్గం బౌద్దనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ఎన్‌. వరలక్ష్మి, గుండు జ్యోత్స్నప్రియ ఎదురుచూశారు. నామినేషన్‌ కూ డా దాఖలు చేసి, బీఫాం కోసం ప్రయత్నించారు. చివరికి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. ఇందులో జ్యోత్స్నప్రియ ఇటీవలే బీకాం పూర్తి చేయగా, ఎన్‌. వరలక్ష్మి బీటెక్‌ చదివారు. 

సనత్‌నగర్‌ నియోజకవర్గం సనత్‌నగర్‌ డివిజన్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పెరుమాళ్ల వైష్ణవి పోటీ చేస్తున్నారు. వైష్ణవి ప్రస్తుతం బీబీఏ ఫైనలియర్‌ చదువుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలని ఉండే వైష్ణవి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.  ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.







Updated Date - 2020-11-29T06:50:33+05:30 IST