జలాశయంలోకి గంజాయి వాహనం

ABN , First Publish Date - 2022-05-17T08:37:38+05:30 IST

జలాశయంలోకి గంజాయి వాహనం

జలాశయంలోకి గంజాయి వాహనం

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వేగం పెంచిన డ్రైవర్‌

డివైడర్‌ను ఢీకొని రిజర్వాయర్‌లోకి


రంపచోడవరం/మారేడుమిల్లి, మే 16: భారీ గంజాయి లోడుతో వెళ్తున్న ఓ వాహనం.. ప్రమాదానికి గురై.. రిజర్వాయర్‌లోకి దూసుకుపోయింది. ఈ సమయంలో వాహనంలో డ్రైవర్‌ సహా ఇద్దరు ఉన్నారు. అయితే.. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెంలో జరిగిన ఈ ఘటనపై మారేడుమిల్లి సీఐ అద్దంకి శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. ఆంధ్ర, ఒడిసా సరిహద్దు ప్రాంతం నుంచి రాజమహేంద్రవరానికి సోమవారం తెల్లవారుజామున స్కార్పియో వాహనంలో 300 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. మారేడుమిల్లిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ వాహనం వేగంగా వెళుతున్నట్టు గమనించారు. దీంతో పోలీసులు దాన్ని వెంబడించారు. పోలీసులను చూసిన డ్రైవర్‌ మరింత వేగం పెంచాడు. దీంతో భూపతిపాలెం జలాశయం మలుపు వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి జలాశయంలోకి బోల్తాపడింది. వెంటనే పోలీసులు వాహనాన్ని బయటకు తీయించి.. గంజాయితో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 



Updated Date - 2022-05-17T08:37:38+05:30 IST