లారీతో ఢీకొట్టి.. తొక్కించి!

ABN , First Publish Date - 2022-09-24T05:58:09+05:30 IST

అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గతంలో ఉన్న పాతకక్షల నేపథ్యంలో వైసీపీకి చెందిన ఒక నాయకుడు (రౌడీషీటర్‌) దారుణహత్యకు గురయ్యాడు.

లారీతో ఢీకొట్టి.. తొక్కించి!
పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు (ఇన్‌సెట్‌లో) హత్యకు గురైన రవితేజ (ఫైల్‌)

అధికార పార్టీ నేత హత్య 

పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పాతకక్షలే కారణం

గతంలో నిందితుడిపై దాడిచేసిన మృతుడు

అట్టుడికిన సింగరాయకొండ

స్టేషన్‌లో ఉన్న లారీకి నిప్పుపెట్టిన మృతుడి మద్దతుదారులు

పోలీసుల వైఫల్యంపై విమర్శలు

సింగరాయకొండ, సెప్టెంబరు 23 : అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గతంలో ఉన్న పాతకక్షల నేపథ్యంలో వైసీపీకి చెందిన ఒక నాయకుడు (రౌడీషీటర్‌) దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మృతుడి వర్గీయులు, బంధువుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఏకంగా పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. స్టేషన్‌ ఆవరణలో ఉన్న లారీకి నిప్పుపెట్టారు. దీంతో ఏక్షణాన ఏమి జరుగుతుందోనని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


హత్య జరిగింది ఇలా.. 

వైసీపీకి చెందిన పసుపులేటి రవితేజ (32), అతని స్నేహితుడు ఉమామహేశ్వరరావు చెరో బైక్‌పై గురువారం రాత్రి హైవేపై ఒంగోలు వైపు నుంచి కావలివైపు వెళ్తున్నా రు. కనుమళ్ల ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై వెనుక వైపు నుంచి వచ్చిన లారీ బలంగా రవితేజ బైక్‌ను ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన రవితేజ మీదుగా లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెం దాడు. ఉమామహేశ్వరరావు లారీని వెంబడించి అడ్డగించే ప్రయత్నం చేశారు. కొద్దిదూరం వెళ్లి లారీని ఆపిన డ్రైవర్‌ కిందకు దూకి పరారయ్యాడు. తదనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి తండ్రి, సోమరాజుపల్లి మాజీ సర్పంచ్‌ పసుపులేటి శ్రీనివాసులు.. తన కుమారుడిని  పథకం ప్రకారం లారీతో తొక్కించి హత్యచేశారని వాపోయాడు. మూలగుంటపా డు ఎంపీటీసీ సభ్యుడు అంబటి ప్రసాద్‌ కుమా రుడైన అజయ్‌ ఈ హత్యచేశాడని ఆరోపించారు. లారీలో మరోవ్యక్తి మోటుపల్లి గోపి ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న సీఐ లక్ష్మణ్‌, ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆసుపత్రికి, లారీని పోలీసుస్టేషన్‌కి తరలించారు. అనంతరం డీఎస్పీ యు.నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అంబటి ప్రసాద్‌, ఆయన కుమారులతో కలిపి 17 మందిపై కేసు నమోదు చేశారు. 


ఆధిపత్యపోరుతో మొదలు

మూలగుంటపాడు-1 ఎంపీటీసీ సభ్యుడు అంబటి ప్రసా ద్‌ గతంలో మండల పరిషత్‌కి వైస్‌ ఎంపీపీని ఎన్నుకుం టున్న తరుణంలో వైసీపీలోని ముఖ్య నాయకులను కలిసి అవకాశం కల్పించాలని కోరారు. ఆ తర్వాత బింగినపల్లి ఎంపీటీసీ సభ్యుడు సామంతుల రవికుమార్‌రెడ్డిని వైస్‌ ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ తరుణంలో వైసీపీలో బీసీల ను రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముఖ్యనాయకులు అణ గదొక్కుతున్నారని ఎంపీటీసీ ప్రసాద్‌ విలేకరుల ఎదుట విమర్శించారు. కష్టకాలంలో వైసీపీకి వెన్నుదన్నుగా ఉండి అధికారంలోకి తీసుకువస్తే బీసీలను తొక్కేస్తున్నారని వాపో యారు. జరుగుతున్న అన్యాయంపై వైసీపీకి, ఎంపీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అల్టిమేటం జారీచేశారు. ఈ ఘటన ఈ ఏడాది జనవరి 4 చోటుచేసుకుంది. ఈ నేప థ్యంలో జనవరి 7న ఎంపీటీసీ సభ్యుడి కుమారులైన పవన్‌, అజయ్‌లపై వైస్‌ ఎంపీపీ అనుచరుడిగా ఉన్న పసుపులేటి రవితేజ దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఎంపీటీసీ సభ్యుడు ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రవితేజతోపాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఇరువర్గాల మధ్య కక్షలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రవితేజ హత్య జరిగింది. 


పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని లారీకి నిప్పు

మృతుడి కుటుంబసభ్యులు, స్నేహితులు శుక్రవారం ఉదయం పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. స్టేషన్‌ ఎదుట ప్లాస్టిక్‌ డ్రమ్ములను తగులబెట్టారు. పక్కనే ఉన్న చలివేంద్రం ఫ్లెక్సీలకు నిప్పంటించారు. స్టేషన్‌ ఆవరణలో ఉన్న హత్యకు ఉపయోగించిన లారీకి కూడా నిప్పు పెట్టా రు. పోలీసులను సైతం దుర్భాషలాడారు. ఇదంతా జరుగు తున్నా ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో పోలీసులు ఉండిపోయారు. వెంటనే అదనపు బలగాలు రావడంతో ఆందోళన చేస్తున్న వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


మరోమారు నిరసన

మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సింగరాయ కొండకు తరలించారు. ఈక్రమంలో పోలీసు స్టేషన్‌ ఎదుట అంబులెన్స్‌ని ఆపి హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దర్శి డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో త్రిపురాంతకం సీఐ రాంబాబు, ఒంగోలు రూరల్‌, డీటీసీ సీఐలు ఆర్‌.రాంబాబు, సీతారామయ్య, ఆరుగురు ఎస్సైలు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. 




Updated Date - 2022-09-24T05:58:09+05:30 IST