కాలనీలు జలమయం

ABN , First Publish Date - 2020-11-27T06:14:04+05:30 IST

తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో మండలంలోని పలు కాలనీలు, దళితవాడలు జలమయమయ్యాయి.

కాలనీలు జలమయం
జలమయమైన మల్లికార్జునపురం కాలనీ

తోటపల్లి గూడూరు, నవంబరు 26: తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో మండలంలోని పలు కాలనీలు, దళితవాడలు జలమయమయ్యాయి. మల్లికార్జున పురం గిరిజన కాలనీలో మోకాటిలోతు నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గిరిజనులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రధాన మార్గంలో చెట్లు పడి విద్యుత్‌ తీగలు తెగిపడడంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొత్తపాళెం దళితకాలనీలో పూరిళ్ల వర్షం ధాటికి కూలాయి.కోడూరు సముద్రతీరంలో అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసులు సందర్శకులను అనుమతించలేదు. ఎస్‌ఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి సముద్రతీరానికి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. భారీ వర్షంతో పలుచోట్ల నారుమళ్లు ముంపునకు గురయ్యాయి.

ముంచెత్తిన వర్షం

ముత్తుకూరు: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ముత్తుకూరు మండలాన్ని వర్షం ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయంవరకు 100 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరపిలేని వర్షంతో మండలంలోని పలు గ్రామాల్లో కాలనీలు జలమయమయ్యాయి. గాలుల తాకిడికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన చెట్లను తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మండలంలో 300మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల పంటపొలాలు, నారుమళ్లు నీటమునిగాయి. 

పంటనష్టంపై వ్యవసాయ అధికారుల సర్వే

 తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లా వనరుల కేంద్ర బృందం గురువారం మండలంలో పర్యటించింది. వ్యవసాయశాఖ ఉపసంచాలకులు శివనారాయణ, సహాయ సంచాలకు రవిచంద్ర ప్రసాద్‌, వ్యవసాయాధికారి చక్రవర్తిలతో కూడిన బృందం సభ్యులు నీటమునిగిన వరి పైర్లను, నారుమళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ముత్తుకూరు, నారికేళపల్లి గ్రామాల్లో పర్యటించి అంచనా నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి హరికరుణాకర్‌ రెడ్డి, సహాయకులు జగదీష్‌, మస్తానమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T06:14:04+05:30 IST