రంగుల ఇసుకతో నేతల చిత్రాలు

ABN , First Publish Date - 2022-07-07T14:55:59+05:30 IST

ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారికి చెందిన రిటైర్డ్‌ డ్రాయింగ్‌ టీచర్‌ రంగుల ఇసుకతో రాజకీయ నాయకుల చిత్రపటాలను అందంగా రూపొందించి

రంగుల ఇసుకతో నేతల చిత్రాలు

చెన్నై, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారికి చెందిన రిటైర్డ్‌ డ్రాయింగ్‌ టీచర్‌ రంగుల ఇసుకతో రాజకీయ నాయకుల చిత్రపటాలను అందంగా రూపొందించి పర్యాటకులను అబ్బురపరుస్తున్నారు. కన్నియాకుమారి కొట్టారం వల్లలార్‌ వీథిలో నివసిస్తున్న గోపాలకృష్ణన్‌ (67) డ్రాయింగ్‌ టీచర్‌గా 32 యేళ్ళపాటు పనిచేసి రిటైర్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన అందమైన చిత్రాలను రూపొందిస్తున్నారు. స్థానిక పాఠశాలల్లో తన చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థుల్లో చిత్రలేఖనంపై ఆసక్తిని కలిగిస్తున్నారు. చిత్రలేఖనంలో గోపాలకృష్ణన్‌ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కలైమామణి బిరుదుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో కన్నియాకుమారి తీరంలో లభించే రంగురంగుల ఇసుకతో తమిళ రాజకీయ నేతల చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత, ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఎంపీ కనిమొళి, ఎమ్మెల్యే ఉదయనిధి చిత్రాలను రంగుల ఇసుకతోనే కళాత్మకంగా రూపొందించారు. ఇదే విధంగా మరికొందరు రాజకీయ నాయకుల చిత్రాలను కూడా రూపొందించి, పాళయంకోటలోని ప్రభుత్వ మ్యూజియంలో సెప్టెంబర్‌ 15, కామరాజర్‌ జయంతి రోజున తన కళాఖండాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2022-07-07T14:55:59+05:30 IST