జపాన్‌ కళకు నవ్యత మేళవించి..

ABN , First Publish Date - 2022-08-11T09:08:46+05:30 IST

‘‘నేను చదివింది ఎంఎ్‌ససీ మాస్టర్స్‌. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో. మెరిట్‌ విద్యార్థిని. గోల్డ్‌ మెడల్స్‌ కూడా తీసుకున్నా.

జపాన్‌ కళకు నవ్యత మేళవించి..

పువ్వులు... కొమ్మలను ఒక చోటకు చేర్చి... అందంగా అమర్చితే అదే ‘ఇకెబానా’. జపాన్‌లో పుట్టిన ఈ కళకు భారతీయతను జోడించి... ఇరు దేశాల సాంస్కృతిక దౌత్యాన్ని మరో ఎత్తుకు తీసుకువెళుతున్నారు గవ్వా రేఖారెడ్డి. ఆమె సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఫారిన్‌ మినిస్టర్స్‌ కమెండేషన్స్‌ అవార్డు’నిచ్చి గౌరవించింది జపాన్‌ ప్రభుత్వం. ఆ విశేషాలను రేఖారెడ్డి ‘నవ్య’తో పంచుకున్నారు... 


‘నేను చదివింది ఎంఎ్‌ససీ మాస్టర్స్‌. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో. మెరిట్‌ విద్యార్థిని. గోల్డ్‌ మెడల్స్‌ కూడా తీసుకున్నా. కానీ ఆ చదువుకు సంబంధం లేకుండా ఇప్పుడు ‘ఇకెబానా’లో మునిగితేలుతున్నా. ఈ కళతో అనుబంధం ఇవాల్టిది కాదు. కాలేజీ రోజుల్లోనే మొదలైంది. అంటే దాదాపు నలభై ఏళ్ల కిందట. చిన్నప్పుడు మా అమ్మ ‘ఇకెబానా’ చేస్తుంటే చూసేదాన్ని. బాగా నచ్చింది. తరువాత నేర్చుకోవడం మొదలుపెట్టాను. చిత్తూరు మా సొంతూరు. పుట్టింది చెన్నైలో. పెరిగింది, చదివింది, స్థిరపడింది హైదరాబాద్‌లో. పెళ్లి చేసుకున్నది తెలంగాణ వ్యక్తిని. ఇలా భిన్న ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు మా ఇల్లు. 


పాతికేళ్లుగా..

‘ఇకెబానా’ మీద ఉన్న ఇష్టంతో పెళ్లి తరువాత దానికి మరింత సమయం కేటాయించాను. ‘ఒహరా ఇకెబానా’లో ‘ఫస్ట్‌ మాస్టర్‌’ లెవెల్‌ పూర్తి చేశాను. మన సంప్రదాయ నృత్యాల్లో భరతనాట్యం, కూచిపూడి, కథక్‌ లాంటి కళారూపాలు ఎలాగో... ‘ఇకెబానా’లో ‘ఒహరా’ అనేది ఒక స్కూల్‌. పాతికేళ్లుగా ఇందులో ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నా. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, జర్మనీ, బెల్జియం, తైవాన్‌, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో కూడా వర్క్‌షా్‌పలు, ఎగ్జిబిషన్లు నిర్వహించాను. 


 


బౌద్ధం నుంచి... 

ఇది బౌద్ధం నుంచి పుట్టిన కళ. జపనీయులు పూలు, కొమ్మలు తెచ్చి బుద్ధుడి విగ్రహం ముందు పెట్టేవారు. శతాబ్ధాల క్రమంలో అదే ‘ఇకెబానా’ కళా రూపంగా మారింది. పరిసరాల్లో పువ్వులు, పచ్చందాలు పరిమళిస్తుంటే ఏ మనసైనా పరవశిస్తుంది కదా! అదే దీని ప్రత్యేకత... ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం. రకరకాలుగా పూల దండలు కట్టినట్టే... ‘ఇకెబానా’లో కూడా పువ్వులు, చిన్న చిన్న కొమ్మలను అందంగా... ఒక ఫ్లవర్‌వాజ్‌లో అమరుస్తారు. ఇందులో పచ్చదనాన్ని ప్రోత్సహించాలనే సందేశం, పర్యావరణ హితం ఇమిడి ఉన్నాయి. కళా హృదయం ఉండాలే గానీ... వయసుతో సంబంధం లేకుండా దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. 


భారతీయం

ఇది జపాన్‌ కళే అయినప్పటికీ దాన్లో నేను భారతీయతను కూడా మిళితం చేస్తాను. తద్వారా మన సంస్కృతి గొప్పదనాన్ని నలు దిశలా వ్యాప్తి చేయాలన్నది నా సంకల్పం. అలాగే మన పండుగలప్పుడు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటాను. దీని కోసం నాకో బృందం ఉంది. ఆన్‌లైన్‌లో డెమోలు ఇస్తుంటాను. ఒకసారి అమెరికాలో నిర్వహించిన ప్రదర్శనలో కలశం, అందులో ఎరుపు, పసుపు రంగుల పూలు, కొమ్మలు పెట్టాను. పసుపు, కుంకుమ భారతీయులకు శుభసూచకం కదా! కలశానికి ఉన్న ప్రత్యేకత ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. ‘ఇకెబానా’ గురించీ తెలుస్తుంది. మరోసారి జపాన్‌ నుంచి ఆహ్వానం అందింది. అక్కడ కూడా మన సంస్కృతిని జోడించి ‘ఇకెబానా’ ప్రదర్శించాను. ఒకరి సంస్కృతిని ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. ప్రజలు ఒకరితో ఒకరు మమేకమవ్వ గలుగుతారు. 


అరుదైన గౌరవం... 

ఇప్పటి వరకు నేను పధ్నాలుగు దేశాల్లో ‘ఇకెబానా’ వర్క్‌షా్‌పలు, ప్రదర్శనలు ఇచ్చాను. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ కళ వ్యాప్తికి నేను చేస్తున్న కృషిని గుర్తించి... జపాన్‌ ప్రభుత్వం ‘ఫారిన్‌ మినిస్టర్స్‌ కమెండేషన్స్‌ అవార్డు’ను ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. భారత్‌- జపాన్‌ ఆర్థిక, సామాజిక సంబంధాలు మెరుగు పరచడం, జపాన్‌ సంస్కృతిని విస్తరించడంలో విశేష కృషి చేసినవారికి అక్కడి ప్రభుత్వం ఏటా ఈ అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది. నాతోపాటు చెన్నైకి చెందిన గోవిందరాజులు చంద్రమోహన్‌కు కూడా ఈ పురస్కారం లభించింది. 


విభిన్న ‘మిశ్రణ’... 

‘ఇకెబానా’ చేసేవాళ్లందరం కలిసి ఇటీవలే ‘మిశ్రణ’ పేరుతో ఓ పుస్తకం తీసుకువచ్చాం. అందులో ‘ఇకెబానా’తో పాటు దానికి సంబంధించిన భారతీయ వంటకాన్ని కూడా పరిచయం చేశాం. మామిడి, పనస, వంగ... ఇలా కొమ్మలు పెట్టి పక్కనే వాటికి సంబంధించిన రెసిపీని ఇచ్చాం. మా ఈ ప్రయోగానికి జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ముగ్ధులయ్యారు. గతంలో మా ‘ఇకెబానా’తో పాటు ఎంఎఫ్‌ హుస్సేన్‌ గారి పెయింటింగ్స్‌ కూడా పెట్టి ఎగ్జిబిషన్‌ నిర్వహించాం. హుస్సేన్‌ గారి కోడలి ఆలోచన ఇది. రెండు రకాల కళా రూపాలు ఒకచోట కనిపించడం అరుదు కదా! తరువాత అవన్నీ కలిపి ‘పెటల్స్‌ అండ్‌ పాలెట్‌’ పేరుతో పుస్తకంగా ప్రచురించాం. 

హనుమా

Updated Date - 2022-08-11T09:08:46+05:30 IST