ఒక రోజు నాతో పాదయాత్రకు రండి

ABN , First Publish Date - 2022-10-02T09:59:39+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన అద్భుతం అని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు, వారి పాలనపై నిజంగా అంత నమ్మకం ఉంటే తనతో కలిసి ఒక రోజు పాదయాత్రకు రావాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల శనివారం సవాల్‌ విసిరారు.

ఒక రోజు నాతో పాదయాత్రకు రండి

  • మీ పాలనలో సమస్యలు లేవని నిరూపిస్తే క్షమాపణ చెబుతా!
  • సమస్యలున్నాయని తేలితే కేసీఆర్‌ దళితుడిని సీఎం చేయాలి
  • కేసీఆర్‌, కేటీఆర్‌కు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సవాల్‌

మెదక్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన అద్భుతం అని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు, వారి పాలనపై నిజంగా అంత నమ్మకం ఉంటే తనతో కలిసి ఒక రోజు పాదయాత్రకు రావాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల శనివారం సవాల్‌ విసిరారు. ఒకవేళ ప్రజలకు సమస్యలు లేవని తేలితే తన ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పి వెళ్లిపోతానని ఆమె పేర్కొన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘‘టీఆర్‌ఎస్‌ పాలనపై కేసీఆర్‌, కేటీఆర్‌లకు నమ్మకం ఉంటే, మీకు దమ్ముంటే నా సవాలును స్వీకరించండి. ఒకవేళ సమస్యలు ఉన్నట్లు తేలితే సీఎంగా కేసీఆర్‌ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిగా చేయాలి. 


కేసీఆర్‌ ఏం ఘనకార్యం చేశారని అవార్డులు తీసుకుంటున్నారు? అవార్డులు ఇవ్వాల్సింది ప్రజలేనని టీఆర్‌ఎస్‌ పాలకులు గుర్తుంచుకోవాలి. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా కేసీఆర్‌ ప్రజలను నిలువునా ముంచారు. బంగారు తెలంగాణ చేస్తామంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యోగాలు ఏమయ్యాయి? ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలు లేక ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారు. అందుకే మీకు అవార్డులు ఇస్తున్నారా? నేటికీ రాష్ట్రంలో కనిపించేది వైఎస్సార్‌ హయాంలో చేసిన అభివృద్ధే. రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ, ఆరోగ్య శ్రీ పథకాలు చేపట్టిన ఘనత ఆయనకే దక్కింది. కేసీఆర్‌ కుటుంబపాలనతో రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారు. తన కుటుంబీకులకే కాంట్రాక్టులు ఇచ్చి రూ.లక్షల కోట్లు దోచుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కింది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు. వారి అండతోనే కేసీఆర్‌ దోపిడీ సాగుతోంది. ప్రజలు వారెవరినీ దయచేసి నమ్మకండి’’ అని అన్నారు. కాగా.. శనివారంతో షర్మిల పాదయాత్ర 2,400 కిలోమీటర్లు పూర్తైంది. ఈ సందర్భంగా చిన్నఘనపూర్‌లో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వైఎ్‌సఆర్‌ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. 

Updated Date - 2022-10-02T09:59:39+05:30 IST