రండి.. చూడండి..నేర్చుకోండి!

ABN , First Publish Date - 2022-07-02T10:01:37+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష, విభజన అజెండా కాకుండా అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

రండి.. చూడండి..నేర్చుకోండి!

  • తెలంగాణలో అమలవుతున్న పథకాలను
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి
  • విద్వేషం, విభజన బీజేపీ డీఎన్‌ఏలోనే ఉంది
  • ఇకనైనా అభివృద్ధిపై మాట్లాడడం నేర్చుకోండి
  • తెలంగాణను చూసి ఆత్మవిమర్శ చేసుకోండి
  • కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి
  •  ప్రధాని మోదీకి కేటీఆర్‌ బహిరంగ లేఖ


హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష, విభజన అజెండా కాకుండా అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎనిమిదేళ్లలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి ప్రధాని మోదీ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. మోదీజీ ‘ఆవో (రండి).. దేఖో (చూడండి)... సీఖో (నేర్చుకోండి)’ అని పేర్కొంటూ తెలంగాణలో అమలవుతున్న 450కి పైగా సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకోవాలన్నారు. డబుల్‌ ఇంజన్‌తో ప్రజలకు ట్రబుల్‌గా మారిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. మూడు రోజులపాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోదీతో పాటు కేంద్రమంత్రులు, పార్టీ అగ్రనేతలంతా నగరానికి వచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌ శుక్రవారం ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. ఈ వివరాలు కేటీఆర్‌ మాటల్లోనే.. హైదరాబాద్‌కు వస్తున్న బీజేపీ నాయకులకు.. మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వం లేని శాంతియుత తెలంగాణ తరఫున స్వాగతం. 


తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా, అద్భుత అభివృద్ధితో ప్రపంచ పటంపై స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న హైదరాబాద్‌లో మీ పార్టీ సమావేశం పెట్టుకోవడం నాకేౖతే ఆశ్చర్యం అనిపించడం లేదు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు కొలువైన మీ రాష్ట్రాల్లో ఉన్న దుర్భర పరిస్థితులే మిమ్మల్ని తెలంగాణకు రప్పించి ఉంటాయని భావిస్తున్నా. కారణాలు ఏవైనా మీ పార్టీ నాయకత్వం మొత్తం హైదరాబాద్‌లో మకాం పెడుతున్న ఈ సందర్భంలోనైనా కాసింత తెలంగాణతనాన్ని నేర్చుకోవాలని, ఇక్కడి గాలి గానం చేసే గంగా జమునా తెహజీబ్‌ను గుండెల నిండా నింపుకోవాలని సలహా ఇస్తున్నా. మీ పార్టీ డీఎన్‌ఏలోనే విద్వేషాన్ని, సంకుచితత్వాన్ని నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కులం, మతం, జాతి ఆధారంగా సమాజాన్ని విభజించే మీ దుర్మార్గ రాజకీయాల చుట్టూనే మీ చర్చలు సాగుతాయనడంలో నాకెలాంటి అనుమానం లేదు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల అసలు అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికీ తెలుసు.


ఆవో.. దేఖో.. సీఖో..

ఇరిగేషన్‌- ఇన్ర్ఫాస్ట్రక్చర్‌- ఇన్నోవేషన్‌- ఇన్‌క్లూజివ్‌నెస్‌ వంటి వినూత్నమైన విధానాలతో, సమ్మిళిత అభివృద్ధి నమూనాతో చరిత్ర సృష్టిస్తున్న ఈ తెలంగాణ గడ్డ మీ రాజకీయాలు, ఆలోచనలను మార్చుకునే అవకాశం ఇస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తితో అభివృద్ధి అజెండాను చర్చించేందుకు తెలంగాణను మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదు. అయితే మీ విధానాలు, నినాదాలను మార్చుకుంటారో లేదంటే, మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుంటారో మీ ఇష్టం. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ త్యాగాలను చులకన చేసి మాట్లాడిన మీరు.. ఈ గడ్డ బాగు కోరుతారని ఎవరూ భావించడం లేదు. అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు. దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్న తెలంగాణ విజయాల అధ్యయనానికి ఈ 2 రోజులు మీకు సరిపోవని తెలుసు. కానీ, కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకున్న తెలంగాణ విజయాలను గుర్తు చేస్తున్నాను. మీరు ప్రవేశపెట్టిన పలు పథకాలకు మా కార్యక్రమాలే స్ఫూర్తి. అందుకే ఆవో.. దేఖో.. సీఖో (రండి- చూడండి- నేర్చుకోండి) అంటున్నాం. 


మా విజయగాథలు తెలుసుకోండి.. 

జీవ నదులున్న మన దేశంలో వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే... నదికే పునర్జన్మనిచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి సాగునీటి రంగాన్ని ఎలా బలోపేతం చేయాలో నేర్చుకోండి. 46 వేల చెరువులకు పునర్జన్మనిస్తూ భూగర్భ జలాల సంరక్షణలో ఐఏఎస్‌లకు శిక్షణ పాఠంగా మారిన మిషన్‌ కాకతీయ విజయ గాథను తెలుసుకోండి. మీ బూటకపు డబుల్‌ ఇంజిన్‌తో ప్రజలకు ట్రబుల్‌గా మారిన మీ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నించండి. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్రలను ఎదురించి అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సర్కారు మాది. 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలు, రైతు వేదికలతో అన్నదాత తలరాత మారుస్తున్న మా  సంకల్పాన్ని చూసైనా వ్యవసాయ రంగంపై మీ ప్రభుత్వానికి ఉన్న కక్షపూరిత వైఖరిని మార్చుకోండి. మా రైతుబంధును కాపీ కొట్టి ప్రారంభించిన మీ పీఎం-కిసాన్‌ యోజనలో మూడేళ్లుగా కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా, ఎకరానికి 6 వేలతో సరిపుచ్చుతున్న విధానాన్ని సవరించండి.  మీ  రాష్ట్రాల్లో నీళ్ల కోసం బావుల్లోకి దిగుతున్న ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు మా మిషన్‌ భగీరథను స్ఫూర్తిగా తీసుకోండి.


రాష్ట్రపతి అభ్యర్థి గ్రామంలోనే కరెంటు లేదు.. 

2018లోనే ప్రతి గ్రామానికి కరెంటు ఇచ్చామంటూ మీరు అబద్ధాలు చెప్పారు. కానీ, మీ పార్టీ తరఫున రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము సొంత గ్రామంలోనే కరెంటు లేని దుస్థితి. ఇక మీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పవర్‌ హాలిడేలు ప్రకటిస్తుంటే.. రెప్పపాటున కూడా కరెంటు పోకుండా నిత్యం ప్రకాశిస్తున్న రాష్ట్రం మాది. మీ అసమర్థ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో చీకట్లు ఎలా తొలగించాలో తెలుసుకోండి. తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క నవోదయ పాఠశాలను కేటాయించకున్నా వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నాం. మా విద్యా విధానం దేశవ్యాప్తంగా అమలకు ప్రయత్నించండి. మీరు ఒక్క మెడికల్‌ కాలేజీ మంజూరు చేయకున్నా, మేమే సొంతంగా జిల్లాకోటి ఏర్పాటు చేస్తున్నాం. పల్లెల్లో ప్రాథమిక వైద్యాన్ని పటిష్ఠం చేస్తున్నాం. హైదరాబాద్‌లో బస్తీకొక దవాఖానాతో వైద్యాన్ని పేదోడి గుమ్మం ముందుకు తెచ్చాం. 


హైదరాబాద్‌ ఆతిథ్యం స్వీకరించండి.. 

చివరగా ఒక్కమాట. ‘హైదరాబాద్‌ మెహమాన్‌ నావాజ్గీ కీ బాత్‌ హీ కుచ్‌ అలగ్‌ హై’ (హైదరాబాదీల ఆతిథ్యం గొప్పగా ఉంటుందంటారు) అందుకే హైదరాబాద్‌లో దమ్‌ బిర్యానీ రుచి చూడండి. వెజ్‌ బిర్యానీ కూడా ఉంటుంది. అడగడం మర్చిపోకండి. ఇరానీ చాయ్‌ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచలకు నాంది పలకండి. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి.


మాది స్టార్టప్‌.. మీది ప్యాకప్‌ 

గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగితను పట్టించుకోకుండా పకోడీ లేయడమూ ఉద్యోగమే అని నీతులు చెప్పే నాయకులు నిండుగా ఉన్న పార్టీ మీది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పింది మీరు. సుమారు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం మాది. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మార్చి ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం మాది. మేము స్టార్టప్‌ అంటుంటే, మీరు 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపకుండా, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలను ఊడగొడుతూ ప్యాకప్‌ అంటున్నారు. మీ పాలనలో దేశ ఆర్థిక రంగం అయోమయంలో ఉంది. ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. వాట్సాప్‌ యూనివర్సిటీ పాఠాలు తప్ప ఎకానమీ లెక్కలు తెలియని మీ నాయకత్వం, బిత్తిరి చూపులు చూస్తుంటే మా ప్రగతిశీల ప్రభుత్వం సంపద సృష్టించు-సమాజానికి పంచు అన్న ఉదాత్త లక్ష్యంతో పనిచేస్తున్నది. రేసుగుర్రంలా దూసుకుపోతున్న మా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై స్పెషల్‌ క్లాసులు చెప్పించుకోండి.  

Updated Date - 2022-07-02T10:01:37+05:30 IST