పిల్లను చూద్దాం రండి...

ABN , First Publish Date - 2021-01-06T05:30:00+05:30 IST

పెళ్లి సంబంధాలు కుదిర్చే సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంటారు ఓ యువ జంట. అందుకు కార్యాలయం కోసం ఊళ్లోనే వెతుకుతుంటారు. అదే సమయంలో వారి స్నేహితుడు రాజు కనిపిస్తాడు.

పిల్లను చూద్దాం రండి...

పెళ్లి సంబంధాలు కుదిర్చే సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంటారు ఓ యువ జంట. అందుకు కార్యాలయం కోసం ఊళ్లోనే వెతుకుతుంటారు. అదే సమయంలో వారి స్నేహితుడు రాజు కనిపిస్తాడు. ‘మీరు ఆఫీసు తరువాత పెడుదురు గాని... ముందు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి’ అని అడుగుతాడు రాజు. ‘అరై... ఇంకా ఆఫీస్‌ కూడా తెరవలేదు. నీ గోలేందిరా’ అంటూ విసుక్కుంటారు వాళ్లు. ‘ఇక మీరు వెతుకుడేమో కానీ... నాకు పిల్లను చూసే సరికి ముసలోడినయ్యేట్టున్నా’ అంటాడు రాజు. అతడి గోల పడలేక ‘సర్లే... చూద్దాంలే’ అంటుందా జంట.


‘నీ మామను అడుగుతాం. వాళ్ల బిడ్డ చిట్టమ్మను నీకు ఇవ్వమని! మామ సరేనంటే పెళ్లి చూపులు పెడతాం’ అంటారు. సీన్‌ కట్‌ చేస్తే... పొలం దగ్గరున్న రవి మామను చిట్టమ్మ గురించి ఆరా తీస్తారు ఆ యువ జంట. ‘ఊళ్లో కళ్లన్నీ దాని మీదేరా. బాగా బక్క పడింది... పుల్ల లెక్క’ అంటాడు రవి మామ. ‘అది సరే గానీ... మరి చిట్టమ్మకు పెళ్లి చేస్తావా? ఆ రాజు గాడు అడుగుతున్నాడు’ అంటూ  అసలు విషయం చెబుతారు. ‘సరేరా... చేద్దాం. పెళ్లి చూపులకు రమ్మను’ అంటాడు రవి వాళ్ల మామ. కానీ అతడిది ఇంటికి వచ్చిన వారికి కనీసం టీ కూడా ఇవ్వలేని పేదరికం. దీంతో ఆ యువ జంటే ఏర్పాట్లకు కొంత డబ్బు ఆయన చేతులో పెట్టి వెళుతుంది.


రాజుది కూడా పేద కుటుంబమే. తండ్రి లేడు. ఏదో ఉన్నదాంట్లో వాళ్లమ్మ రాజవ్వ నెట్టుకొస్తుంటుంది. రూపాయి సంపాదన కూడా లేని తన కొడుక్కి పెళ్లేంటని యువ జంటను ప్రశ్నిస్తుంది రాజు వాళ్ల అమ్మ. ‘నువ్వుండవే అమ్మ. పెళ్లయితే అన్నీ అవే కుదురుతాయి. పిల్ల ఇలియానా లాగా ఉంటుంది’ అంటాడు రాజు. కాదనలేక సరేనంటుంది రాజవ్వ. మర్నాడు కుటుంబ సమేతంగా కారు మాట్లాడుకుని రవి మామ ఇంటికి వెళతాడు రాజు. కారు దిగిన దగ్గరి నుంచి ఇల్లు, వాకిలి, గొడ్లు ఎవరివని ఆరా తీస్తుంది రాజవ్వ. ఇల్లు తనదేనంటాడు రవి మామ.


కానీ మిగిలినవి ఒకప్పుడు తనవే గానీ, పిల్లకు ఇబ్బందులొచ్చినప్పుడల్లా ఒక్కొక్కటీ అమ్మేయాల్సి వచ్చిందంటాడు. ఇంతలో అతిథుల కోసం పళ్లెంలో ఒకే ఒక్క లడ్డు తెచ్చి పెడతాడు. అది చూసి షాకవుతారు రాజు అండ్‌ కో. ఆ ఒక్కటీ ఎవరు తినాలని ఆలోచించేలోపు... పక్కింటి పిల్ల వచ్చి తీసుకు వెళ్లిపోతుంది. బిక్క ముఖం పెడతారంతా. కాసేపటికి టీ వస్తుంది. కానీ గ్లాస్‌లో ఎక్కడో అడుగున ఓ చెంచాడు టీ మాత్రమే ఉంటుంది. ఇదేంటని అడిగితే... ‘స్టవ్‌ మీద పెట్టి మర్చిపోతే... టీ అంతా ఇంకిపోయింది’ అని పక్కింటమ్మాయి బదులిస్తుంది. చేసేది లేక అంతా కలిపి ఒకడి గ్లాస్‌లోనే పోస్తారు. ‘ఇక చాల్లే గానీ అమ్మాయిని తీసుకురా’ అంటుంది రాజవ్వ. చిట్టమ్మను బయటకు రమ్మంటాడు. 


 చిట్టమ్మను చూసి మరోసారి షాకవుతారు అంతా. ఇలియానాలా ఊహించుకున్న చిట్టమ్మ కల్పనా రాయ్‌లా ఉండే సరికి రాజుకు నోట మాట రాదు. ‘ఇదేంటి... చిట్టమ్మ పుల్లలా అయిందన్నావ్‌. ఇలా ఉందేమిటి’ అని అడిగితే ‘ఈ మధ్య కొద్దిగా ఒళ్లు చేసింది’ అంటాడు రవి మామ. తరువాత ఏమైందనేది ‘క్రియేటివ్‌ థింక్స్‌ ఏ టు జడ్‌’ రూపొందించిన ‘పెళ్లి చూపులు’ లఘు చిత్రం చూడాల్సిందే. శ్రీ రచన, దర్శకత్వం వహించిన

ఈ చిత్రం ఆద్యంతం హాస్యం పండిస్తుంది. అచ్చమైన తెలంగాణ పల్లె భాషలో అలరిస్తుంది. పల్లెవాసుల్లో ఉండే అమాయకత్వాన్ని నటీనటులు చక్కగా పలికించారు. ఎక్కడా నటనలా అనిపించదు. మూడు రోజుల కింద యూట్యూబ్‌లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ను ఇప్పటికి పన్నెండు లక్షల మందికి పైగా వీక్షించారు.


పెళ్లి చూపులు 

రచన, దర్శకత్వం: శ్రీ 

విడుదల: 3 జనవరి 2021 

నిడివి: 18 నిమిషాలు 

వ్యూస్‌: 12.62 లక్షలు 


Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST