దసరా విందుకు పదండి

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

పండగంటే ఉత్సాహం, ఆనందం! ఈ దసరాకు సరదాగా..

దసరా విందుకు పదండి

పండగంటే ఉత్సాహం, ఆనందం! ఈ దసరాకు సరదాగా.. సరికొత్తగా... వేగంగా... సులువుగా వండుకుంటే  ఆ కిక్కే వేరు. అలాంటి  కొన్ని వంటలు రుచి చూద్దాం...


గుజరాతి కడి

కావాల్సిన పదార్థాలు

పెరుగు- కప్పు, శనగపిండి- పావు కప్పు, పచ్చి మిరపకాయలు-3, అల్లం- చిన్నముక్క, ఉప్పు- రుచికి తగినంత, కారం- రుచుకి తగినంత, పసుపు- చిటికెడు, ఇంగువ-చిటికెడు, ఎండు మిరపకాయలు-2, కరివేపాకు- 2 రెమ్మలు, పంచదార- టీస్పూన్‌, పోపు దినుసులు- టీస్పూన్‌, కొత్తిమీర- కొంచెం, నెయ్యి- టేబుల్‌ స్పూన్‌


తయారీ విధానం

కొన్ని నీళ్లు కలిపి అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో పేస్ట్‌ చేసుకోవాలి. దీన్ని ఓ బౌల్‌లో తీసుకోవాలి. మరో బౌల్‌లో కొంచెం పెరుగు, పంచదార, శనగపిండి కలపాలి. దీంట్లోకి సరిపడ ఉప్పు, కారెం వేయాలి. కొద్దిగా పసుపు యాడ్‌ చేయాలి. కొన్ని నీళ్లు కలిపి ఉండలుగా లేకుండా కలిపేయాలి. దీన్ని పక్కపెట్టుకోవాలి. స్టౌ ఆన్‌ చేసి ఒక ప్యాన్‌లో నెయ్యి తీసుకుని ఇందులోకి ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇందులో అల్లం,పచ్చి మిర్చి పేస్ట్‌, ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్‌ చేయాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం వేసుకోవాలి. అందులోకి కొన్ని నీళ్లు పోయాలి. బాయిల్‌ అయ్యాక పంచదార కలపాలి. బాగా ఉడికించాలి. సరిపడ నీళ్లను యాడ్‌ చేస్తూ ఉడికించాలి. కొత్తిమీర గార్ని్‌షగా చేసుకుంటే రెడీ. ఇది అన్నంలోకి బావుంటుంది.


కొబ్బరి లడ్డు

కావాల్సిన పదార్థాలు : కొబ్బరి పొడి- 2 కప్పులు, నెయ్యి- 3 టీస్పూన్లు, బెల్లం- కప్పున్నర, పంచదార- కప్పు, పాలు- కప్పు, యాలకుల పొడి- టీస్పూన్‌, బాదం, జీడిపప్పు ముక్కలు- 25 గ్రాములు

తయారీ విధానం: ప్యాన్‌ తీసుకుని రెండు టీస్పూన్ల నెయ్యి వేయాలి. చిన్నగా కట్‌ చేసిన బాదం ముక్కలను లోఫ్లేమ్‌లో వేయించాలి. ఆ తర్వాత 2 కప్పుల పొడి వేయాలి. మూడు నిమిషాలు వేయించాక కప్పు పాలు పోసుకోవాలి. గరిటె సాయంతో గట్టిగా కదపాలి. ఇందులో కప్పున్నర బెల్లం వేయాలి. మూతపెట్టి అలానే ఉడికించుకోవాలి. గరిటెతో స్మాష్‌ చేస్తూ కొబ్బరిపొడిలోకి బెల్లం కలిసేట్లు కలపాలి. ఆ తర్వాత కప్పు పంచదార కలపాలి. మిశ్రమం సరిపడటానికి వీలైతే పాలు కలపాలి. లడ్డు బాగా అవుతుంది అనేంత వరకూ ఉడికించాలి. ఇందులో యాలకుల పొడి, వీలైతే టీస్పూన్‌ నెయ్యి వేసి బాగా కలపాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత లడ్డూలు తయారు చేసుకోవాలి. 


బనానా ఆల్మండ్‌ షేక్‌

కావాల్సిన పదార్థాలు

అరటిపళ్లు- 2, ఆల్మండ్‌ మిల్క్‌- ఒక కప్పు, పచ్చి యాలకుల పొడి- టీస్పూన్‌, అవిసె గింజలు- టీస్పూన్‌, టోస్టెడ్‌ బాదం పలుకులు- గార్నిష్‌ కోసం 


తయారీ విధానం

అరటిపండ్ల తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని బౌల్‌లో వేసుకోవాలి. దాన్ని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. చల్లటి అరటిపండ్ల ముక్కలను మిక్సీ బౌల్‌లో వేయాలి. అందులో యాలకుల పొడి, అవిసె గింజలు, ఆల్మండ్‌ మిల్క్‌ వేసి మిక్సీ పట్టాలి.  చిక్కటి బనానా ఆల్మండ్‌ షేక్‌ను గ్లాస్‌లో వేయాలి. అందులోకి టోస్టెడ్‌ బాదం పలుకులను వేసి తాగితే అద్భుతమైన రుచి ఉంటుంది. 


బీట్‌ రూట్‌ టిక్కి

కావాల్సిన పదార్థాలు

మీడియం బీట్‌రూట్స్‌- 4, మీడియం పొటాటోలు- 2, ఉల్లిపాయ- 1 (సన్నగా తరగాలి), నూనె-ఫ్రైకి తగినంత, ఉప్పు- రుచికి సరిపడ, అల్లం,పచ్చిమిర్చి పేస్ట్‌- అర టీస్పూన్‌, చాట్‌ మసాలా-పించ్‌, బియ్యం పిండి- టేబుల్‌ స్పూన్‌


తయారీ విధానం:  బీట్‌రూట్‌, ఉల్లిపాయలను కుక్కర్‌లో ఉడకబెట్టాలి. తొక్క తీసేసి బీట్‌రూట్‌లను తురమాలి. పొటాటోలను స్మాష్‌ చేసుకోవాలి. మొదట ఒక బౌల్‌ తీసుకుని అందులోకి తురిమిన బీట్‌రూట్‌ పదార్థాన్ని వేయాలి. అందులోకి పొటాటో గుజ్జు వేయాలి. బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత ఉప్పు, చాట్‌మసాలా, అల్లం-మిర్చిపేస్ట్‌ వేసి కలపాలి. దాన్ని పక్కనబెట్టుకోవాలి. ఒక ప్యాన్‌ తీసుకుని సన్నగా ఉల్లిపాయముక్కలను దోరగా వేయించాలి. వాటిని బీట్‌రూట్‌ బౌల్‌లోకి వేసుకోవాలి. బాగా మిక్స్‌ చేయాలి. బియ్యంపిండిని వేసుకోవాలి. మిక్స్‌ చేసి పింక్‌ కలర్‌లో ఉండే బీట్‌రూట్‌ ముద్దను వడల్లాగా ఒత్తుకోవాలి. ప్యాన్‌మీద కొంచెం నూనె వేసి ఆ బీట్‌రూట్‌ టిక్కిలను చపాతీలాగా కాల్చుకోవాలి. బీట్‌రూట్‌ టిక్కిలు రెడీ. 


మఖన్‌ భేల్‌

కావాల్సిన పదార్థాలు

పూల్‌ మఖన్‌- 3 కప్పులు, వేయించిన పల్లీలు- పావు కప్పు, ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), టమోటా-1 (సన్నగా తరిగినది), ఆలు-1 (ఉడకబెట్టి తోలు తీసి స్మాష్‌ చేసినది), బ్లాక్‌ సాల్ట్‌- అర టీస్పూన్‌, వేయించిన జీలకర్ర పొడి- పావు టీస్పూన్‌, చాట్‌ మసాలా- పావు టీస్పూన్‌, చాట్‌ మసాలా-పావు టీస్పూన్‌, కారం- రుచికి సరిపడ, చింతపండు చట్నీ- టీస్పూన్‌, సన్న కారప్పూస- రెండు టీస్పూన్లు, కొత్తిమీర, పుదీన చట్నీ- పావు కప్పు, కొత్తిమీర చట్నీ- టీస్పూన్‌, నిమ్మ-1, దానిమ్మ విత్తనాలు- గార్ని్‌షకు, నెయ్యి- 2 టీస్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత 


తయారీ విధానం

ప్యాన్‌లో నెయ్యితో మఖన్‌ను రోస్ట్‌ చేయాలి. ఇందులోకి కారంపొడి, ఉప్పు తగినంత వేసుకున్నాక లో ఫ్లేమ్‌లో మఖన్‌ను బాగా వేయించి పక్కనపెట్టుకోవాలి. ఒక బౌల్‌లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆలు మిశ్రమం వేయాలి. ఇందులోకి జీలకర్ర, చాట్‌మసాలా, బ్లాక్‌ సాల్ట్‌ వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు, పల్లీలు వేసి మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత పక్కన ఉండే మఖన్‌ను అందులోకి వేయాలి. మిక్స్‌ చేశాక గ్రీన్‌ చట్నీ, కొత్తిమీర చట్నీ, చింతపండు చట్నీని వేయాలి. బాగా మిక్స్‌ చేయాలి. పిల్లలుంటే గ్రీన్‌ చట్నీ తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా ఆకుల్ని వేయాలి. నిమ్మరసం, సన్న కారప్పూస వేసుకోవాలి. బాగా మిక్స్‌చేయాలి. మఖన్‌ భేల్‌ రెడీ. దీన్ని దానిమ్మ విత్తనాలు, రోస్టెడ్‌ పల్లీలు, సన్న కారప్పూస వేసుకుని తింటే సరి. ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు. 

ఫొటోలు: ఆర్‌. రాజ్‌కూమార్‌

Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST