హైదరాబాద్‌ అభివృద్ధిపై చర్చకు రండి

ABN , First Publish Date - 2020-11-24T10:35:27+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అధికారంలో ఉన్న ఆరేళ్లలో బీసీల అభ్యున్నతికి కేటాయించిన నిధులు, చేసిన ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఓబీసీ రాష్ట్ర చైర్మన్‌, నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ కత్తి

హైదరాబాద్‌ అభివృద్ధిపై చర్చకు రండి

బీసీల అభ్యున్నతికి నిధుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి   

కాంగ్రెస్‌ ఓబీసీ రాష్ట్ర చైర్మన్‌ కత్తి వెంకటస్వామి 


మహబూబాబాద్‌ టౌన్‌, నవంబరు 23: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అధికారంలో ఉన్న ఆరేళ్లలో బీసీల అభ్యున్నతికి కేటాయించిన నిధులు, చేసిన ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఓబీసీ రాష్ట్ర చైర్మన్‌, నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ కత్తి వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మేలు జరుగుతుందని కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారికి చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు. గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పేరుతో కోట్లాది రూపాయల నిధులను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ హాయంలో హైదరాబాద్‌ నగరాభివృద్ధి జరిగిందని, ఈవిషయంపై బహిరంగ చర్చకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. చార్మినార్‌ లేదా ఎల్బీ స్టేడియం వద్ద జర్నలిస్టుల సమక్షంలో చర్చ పెడుదామని చెప్పారు. భాగ్యనగరంలో వర్షాలకు వరదలు వచ్చి ప్రజలు అతలాకుతలమయితే పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏ మొఖం పెట్టుకుని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. 


పెట్టబడి దారుల ప్రతినిధులుగా మోదీ, కేసీఆర్‌ 

ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం కేసీఆర్‌లు పెట్టుబడిదారులకు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు తేజావత్‌ బెల్లయ్యనాయక్‌ విమర్శించారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒక్క పైసా రావడం లేదని వాపోయారు. రాష్ట్ర పాలకులు ఆడిట్‌ లేని వాటికి ఖర్చు చేస్తూ నిధులను స్వాహా చేస్తున్నారని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో రూ.4లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఈసమావేశంలో ఓబీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్న, గణేష్‌, గుగులోతు వెంకట్‌, దండెబోయిన బుజ్జి వెంకన్న, విజయ,  సీతారాములు, రాంచంద్రు. సురేష్‌, విష్ణు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-24T10:35:27+05:30 IST