ఇక రానున్నది బిహార్ సంక్షోభం? బీజేపీ, జేడీయూ సిగపట్లు?

ABN , First Publish Date - 2022-06-29T00:47:08+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెర పడక ముందే బిహార్‌లో మరో

ఇక రానున్నది బిహార్ సంక్షోభం? బీజేపీ, జేడీయూ సిగపట్లు?

పాట్నా : మహారాష్ట్ర (Maharashtra)లో రాజకీయ సంక్షోభానికి తెర పడక ముందే బిహార్‌ (Bihar)లో మరో సంక్షోభం రాబోతున్నట్లు కనిపిస్తోంది. తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో బిహార్ శాసన సభ సమావేశాలు మంగళవారం వాయిదా పడటంతో అధికార కూటమిలోని బీజేపీ (BJP) అవాక్కయింది. ఈ కూటమిలోని జేడీయూ (JDU) ఎమ్మెల్యేలు భోజన విరామం తర్వాత సభకు గైర్హాజరవడంతో పరిస్థితిని నిశితంగా గమనించింది. దీంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ, ప్రతిపక్షంలోని ఆర్జేడీతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతుండవచ్చునని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. 


బిహార్ శాసన సభ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజులు మిగిలి ఉన్నాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం (Agnipath Scheme)పై నిరసన తెలియజేయడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (RJD Leader Tejaswi Yadav) సభాపతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన సమావేశాలను తాము బహిష్కరిస్తామని మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రకటించారు. ఆయనతోపాటు వామపక్షాలు, ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు. ఆర్జేడీతో స్నేహం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. 


మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైనపుడు జేడీయూ సభ్యులు హాజరు కాలేదు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తక్కువ మందే హాజరయ్యారు. దర్భంగ ఎమ్మెల్యే (బీజేపీ) సంజయ్ చర్చను ప్రారంభిస్తూ, శాసన సభ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను ప్రస్తావించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, సభలో కోరం లేదనే విషయాన్ని సభాపతి విజయ్ కుమార్ సిన్హా దృష్టికి తీసుకెళ్ళారు. 


ఎందరు సభ్యులు హాజరుకావాలి?

బిహార్ శాసన సభలో 243 స్థానాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం సమావేశాలు జరగాలంటే కనీసం 10 శాతం మంది సభకు హాజరుకావాలి. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, సాంకేతికంగా కోరం ఉందన్నారు. అయితే ముఖ్యమైన అంశాలపై చర్చించే సమయాల్లో సభ్యులు సభకు హాజరుకాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలను బుధవారానికి వాయిదా వేశారు. 


గైర్హాజరు వెనుక ఏముంది?

అనంతరం కొందరు జేడీయూ నేతలు, రాష్ట్ర మంత్రి లేషి సింగ్ సభా ప్రాంగణంలో కనిపించారు. వారి వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్ళి, గైర్హాజరు వెనుక ఏముందని అడిగారు. లేషి సింగ్ బదులిస్తూ, జేడీయూ సభ్యుల గైర్హాజరు వెనుక ఏదైనా ఎజెండా ఉందని భావించడం తప్పు అన్నారు. ఓ సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చేసరికి కాస్త ఆలస్యమైందని చెప్పారు. సభను బహిష్కరించాలని ప్రతిపక్షం తీసుకున్న నిర్ణయంపై స్పందించాలని కోరినపుడు లేషి మాట్లాడుతూ, సభను బహిష్కరించడం సరికాదన్నారు. సభలో ప్రతిపక్షాలు గొడవ చేస్తుండటాన్ని కూడా తాము ఆమోదించబోమని చెప్పారు. అగ్నిపథ్‌ పథకంపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశామన్నారు. ఈ అంశంపై సభలో చర్చించడం ఆమోదయోగ్యమని తాము భావించడం లేదని తెలిపారు. 


మింగుడుపడని జేడీయూ వైఖరి

బీజేపీకి జేడీయూ అతి పెద్ద మిత్రపక్షం. అగ్నిపథ్‌పై జేడీయూ వైఖరి బీజేపీకి మింగుడుపడటం లేదు. ఈ పథకాన్ని ప్రకటించిన వెంటనే బిహార్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. బీజేపీ నేతల ఆస్తులపై కూడా దాడులు జరిగాయి. ఇదంతా ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్షాల కుట్ర అని బీజేపీ ఆరోపించింది. కానీ జేడీయూ మాత్రం ఈ నిరసనలు అకస్మాత్తు ప్రతిస్పందన అని వ్యాఖ్యానించింది. 


Updated Date - 2022-06-29T00:47:08+05:30 IST