ఏటా రెండు, మూడు సార్లు శ్రీశైలానికి వస్తున్నా

ABN , First Publish Date - 2021-06-19T05:59:17+05:30 IST

శ్రీశైలానికి ప్రతి ఏటా రెండు, మూడుసార్లు వస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

ఏటా రెండు, మూడు సార్లు శ్రీశైలానికి వస్తున్నా
జ్ఞాపికను అందజేస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఈవో

  1. కర్నూలు జిల్లాతో మంచి అనుబంధం ఉంది
  2. అయ్యపురెడ్డి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా పని చేశా
  3. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
  4. ఘన స్వాగతం పలికిన మంత్రి వెల్లంపల్లి, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు


శ్రీశైలం, జూన్‌ 18: శ్రీశైలానికి ప్రతి ఏటా రెండు, మూడుసార్లు వస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. కర్నూలు జిల్లాతో తనకు మంచి అనుబంధం ఉందని, వృత్తిరీత్యా ఏరాసు అయ్యపురెడ్డి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా పదేళ్లు పని చేశానని గుర్తు చేసుకున్నారు. శుక్రవారం శ్రీశైలానికి వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా తెలుగు నేలపై తిరుగుతూ ఇక్కడి గాలి వాసన పీల్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీశైలం పర్యటనకు వచ్చిన తనకు స్వల్ప వ్యవధిలోనే ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 


జస్టిస్‌ ఎన్వీ రమణకు ఘన స్వాగతం 


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా శ్రీశైలానికి విచ్చేసిన సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణకు దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం, పాణ్యం ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయం చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి అమ్మవార్ల దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికను దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అందజేశారు. 


ఆర్కియాలజీ పుస్తకాలను ఆవిష్కరించిన సీజేఐ 


శ్రీశైల దేవస్థానం పరిధిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డీన్‌ ప్రొఫెసర్‌ పి. చెన్నారెడ్డి రచించిన హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ, కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ అనే మూడు వ్యాల్యూమ్స్‌తో కూడిన పుస్తకాలను సీజేఐ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. చెన్నారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రెండు గంటలపాటు శ్రీశైలంలో గడిపిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు అనంతరం హైదరాబాదుకు బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వెంకటరమణ, జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి, డీఐజీ వెంకటరామిరెడ్డి, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాసాగర్‌, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాస్‌, ఆత్మకూరు డీఎస్పీ శృతి ఉన్నారు. 

Updated Date - 2021-06-19T05:59:17+05:30 IST