రావత్‌ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది

ABN , First Publish Date - 2021-12-19T16:46:06+05:30 IST

మాజీ మహాదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతిపై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో కూడిన బృందం దర్యాప్తు జరుపుతోందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి

రావత్‌ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి స్పష్టీకరణ  

దుండిగల్‌లో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరు


హైదరాబాద్‌ సిటీ/అల్వాల్‌: మాజీ మహాదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతిపై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో కూడిన బృందం దర్యాప్తు జరుపుతోందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి తెలిపారు. విచారణ పూర్తయ్యేందుకు మరిన్ని వారాల సమయం పట్టవచ్చని వెల్లడించారు. దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. శిక్షణలో ప్రతిభ చూపిన ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌ శాశ్వత్‌ భరద్వాజ్‌కు ప్రెసిడెంట్‌ మెడల్‌తోపాటు స్వార్డ్‌ ఆఫ్‌ హానర్‌ను అందించారు. నేవిగేషన్‌ విభాగంలో శ్రీకాంత్‌ మిశ్రాకు, గ్రౌండ్‌ డ్యూటీ అడ్మిన్‌ విభాగంలో ఆశా కౌర్‌కు ప్రెసిడెంట్‌ స్టార్‌ అవార్డులను అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘బిపిన్‌ రావత్‌ దంపతులు, పలువురు అధికారులు హెలికాప్టర్‌  ప్రమాదంలో కన్నుమూయడం చాలా దురదృష్టకరం. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో పాటు బ్లాక్‌బాక్స్‌, హెలికాప్టర్‌ శకలాలు.. ఇలా ప్రతి అంశాన్నీ లోతుగా పరిశీలిస్తున్నాం.’’ అని వివేక్‌ స్పష్టం చేశారు. తన బాల్యం, విద్యాభ్యాసం నగరంలోనే జరిగిందంటూ నగరంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

Updated Date - 2021-12-19T16:46:06+05:30 IST