దొరికిందెంత? దాచిందెంత?

ABN , First Publish Date - 2020-11-14T06:48:25+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వెయ్యి రెడీమేడ్‌ వస్త్రాల పార్శిళ్లు.. అక్రమంగా తరలిపోతున్న ఈ పార్శిళ్లలో రూ.5 కోట్ల విలువైన రెడీమేడ్‌ వస్త్రాలున్నాయి.

దొరికిందెంత? దాచిందెంత?
రెండు రోజుల క్రితం పట్టుబడిన రెడీమేడ్‌ దుస్తుల పార్శిళ్లు

జీఎస్టీ అధికారుల వలలో రూ.5 కోట్ల రెడీమేడ్‌ వస్త్రాలు

సరుకు కోసం ముందుకు రాని యజమానులు

దొంగ సొత్తుకు ‘కమర్షియల్‌’ తప్పుడు లెక్కలు!

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వెయ్యి రెడీమేడ్‌ వస్త్రాల పార్శిళ్లు.. అక్రమంగా తరలిపోతున్న ఈ పార్శిళ్లలో రూ.5 కోట్ల విలువైన రెడీమేడ్‌ వస్త్రాలున్నాయి. జీఎస్టీ అధికారులు నిఘాపెట్టి మరీ వీటిని పట్టుకున్నారు. రూ.50 లక్షల వరకు జీఎస్టీతోపాటు పెనాల్టీ వసూలు చేయాల్సి ఉండగా, ఈ సరుకు కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడీ సరుకులో కొంత దాచేసి, తప్పుడు లెక్కలతో ప్రభుత్వాదాయాన్ని కొంత నొక్కేసేందుకు చాటుమాటున పావులు కదుపుతున్నట్టు సమాచారం. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి కోల్‌కతా నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన రెడీమేడ్‌ దుస్తులను వాణిజ్య పన్నులశాఖ విజయవాడ-2 డివిజన్‌ అధికారులు బుధవారం పట్టుకున్నారు. రెడీమేడ్‌ వస్త్ర వ్యాపారులు ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా దాదాపు వెయ్యి పార్శిళ్లను బెజవాడకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో జీఎస్టీ అధికారులు ముందుగానే నిఘా పెట్టారు. మూడు బోగీల నుంచి రైల్వేస్టేషన్‌లో దించిన పార్శిళ్లను సీజ్‌ చేశారు. ఒక్కొక్కదానిలో రూ.50 వేల విలువైన రెడీమేడ్‌ వస్త్రాలు ఉంటాయని అంచనా. ఈ లెక్కన వెయ్యి పార్శిళ్లనూ మొత్తం రూ.5 కోట్ల విలువైన సరుకు అక్రమంగా దిగుమతి అయిందని లెక్క తేల్చారు. రెడీమేడ్‌ దుస్తులపై ఐదు శాతం పన్ను చెల్లించాలి. ఈ లెక్కన రూ.5 కోట్ల విలువైన సరుకుకు రూ.50 లక్షల వరకు జీఎస్టీతోపాటు పెనాల్టీ కూడా వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ మూడు రోజులు గడిచిపోయినా ఆ సరుకు కోసం ఎవరూ రాకపోవడంతో సీజ్‌ చేసిన సరుకును శుక్రవారం జీఎస్టీ అధికారులు రైల్వేస్టేషన్‌ నుంచి ఓ ప్రైవేటు గోడౌన్‌కు తరలించారు. అసలు కథ ఇక్కడే మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన దొంగ సొత్తుకు చెల్లించాల్సిన రూ.50 లక్షలకుపైగా జీఎస్టీ, పెనాల్టీ కలిపి దాదాపు రూ.కోటి వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సి ఉండగా..  వ్యాపారులతో అధికారులు తమదైన శైలిలో ‘కమర్షియల్‌’ మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. విషయం ఎలాగూ బహిర్గతమైపోయింది కాబట్టి ప్రభుత్వానికి నామమాత్రంగా పన్ను చెల్లించి.. రెట్టింపు మొత్తంలో జీఎస్టీ అధికారులకు ముడుపులు చెల్లించుకునేలా తెరవెనుక వ్యవహారం నడుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సీజ్‌ చేసిన సొత్తును తక్కువ మొత్తంలో చూపి, ప్రభుత్వాదాయానికి గండి కొట్టేందుకు వస్త్ర వ్యాపారులు, జీఎస్టీ అధికారులు కలిసి ప్రయత్నిస్తున్నట్టు వాణిజ్య పన్నులశాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 


కిందిస్థాయిలోనూ దందా 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించకుండా విజయవాడ మీదుగా రైల్వే, రోడ్డు రవాణా ద్వారా ప్రతిరోజూ రూ.కోట్ల విలువైన సరుకు అక్రమంగా తరలిపోతూనే ఉంది. వాణిజ్య పన్నులశాఖ అధికారులు అడపా దడపా దాడులు చేసి ఒకటి.. అరా కేసులు నమోదు చేస్తున్నా ప్రభుత్వానికి సమకూరే ఆదాయం నామమాత్రమే. జిల్లాలో మొత్తం 16 జీఎస్టీ సర్కిళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్ల పరిధిలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది సరుకు రవాణా వాహనాల తనిఖీల పేరుతో అక్రమ వసూళ్ల దందా కొనసాగిస్తునారు. రోజువారీగా టార్గెట్లు పెట్టుకుని భారీగా సాగిస్తున్న అక్రమ వసూళ్లలో తమ పై అధికారులకు, ఆపైన ఉన్న ఉన్నతాధికారులకు కూడా వాటాలు వెళ్లిపోతుండటంతో ఈ దందా గురించి ప్రశ్నించేవారే లేకుండాపోయారు. ఇదే అదనుగా పన్నుల శాఖలో పనిచేస్తున్న అటెండర్లు, డ్రైవర్లు సైతం వ్యాపారుల వద్దకు వెళ్లి తనిఖీ అధికారులుగా చెలరేగిపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఈ అక్రమ వసూళ్లు మరింత ఎక్కువ వయ్యాయని, అడిగినంత చెల్లించుకోకపోతే పెనాల్టీల మీద పెనాల్టీలు వేస్తామని బెదిరిస్తున్నారని సరుకు రవాణా వాహనదారులు, వ్యాపారులు వాపోతున్నారు. 

Updated Date - 2020-11-14T06:48:25+05:30 IST