పక్కా కమర్షియల్‌

Published: Tue, 24 May 2022 00:57:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పక్కా కమర్షియల్‌

విజయవాడ రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ విభాగంలో అవినీతి లీలలు

బదిలీల పేరుతో దత్తపుత్రులకు అందలం

రైల్వేబోర్డు ఆదేశాలు సైతం బేఖాతరు

అడుగడుగునా అవినీతి, అక్రమాల కంపు

రైల్వే విజిలెన్స్‌కు భారీగా ఫిర్యాదులు 

కమర్షియల్‌తో కలిసిపోయిన విజిలెన్స్‌

కొత్త బాస్‌ అయినా దృష్టిపెట్టాలి


బెజవాడ రైల్వేలో ‘కమర్షియల్‌’ విభాగం తన పేరును సార్థకం చేసుకుంటోంది. ఇక్కడి కొందరు అధికారులు బదిలీల పేరుతో కాసుల వేట సాగిస్తున్నారు. సీనియారిటీ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. నచ్చిన వారికి అడ్డగోలుగా పోస్టులు ఇచ్చేస్తున్నారు. కమర్షియల్‌ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాలపై రైల్వే విజిలెన్స్‌ కనీస దృష్టి పెట్టట్లేదు. మందు విందుల్లో జోగుతూ ‘కమర్షియల్‌’కు వారూ అలవాటు పడిపోయారు. కొత్తగా వచ్చిన సీనియర్‌ డీసీఎం అయినా ఈ అక్రమాలపై దృష్టిపెట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ పరిధిలో పార్శిళ్లు, బుకింగ్‌, టికెట్‌ చెకింగ్‌ విభాగాల్లో అడ్డగోలుగా బదిలీలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఈ బదిలీలు చేసేశారు. టికెట్‌ చెకింగ్‌లో స్క్వాడ్‌ వర్కింగ్‌, ఎమినిటీస్‌ (స్లీపర్‌) అనే రెండు విభాగాలుంటాయి. స్క్వాడ్‌ విభాగంలోకి వెళ్లినవారు రైలు, రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫాంలలో ఏ తనిఖీలైనా చేయొచ్చు. ఎమినిటీస్‌ విభాగం అయితే కేవలం టికెట్‌ చెకింగ్‌ మాత్రమే చేయాలి. ఈ నేపథ్యంలో ఎమినిటీస్‌ విభాగంలో పనిచేసే తమకు కావాల్సిన ఇద్దరిని స్క్వాడ్‌ విభాగంలోకి బదిలీ చేశారు. స్క్వాడ్‌లో తమ వారు ఎంతమంది ఎక్కువగా ఉంటే అన్ని తనిఖీలు చేయొచ్చని, తద్వారా వచ్చే మామూళ్లతో టార్గెట్‌ త్వరగా చేరుకోవచ్చని అక్రమార్కుల ఆలోచన. విజయవాడలో స్లీపర్‌ విభాగంలో పనిచేసే వ్యక్తిని విజయవాడ-మచిలీపట్నం సెక్షన్‌లోని సమీప ప్రాంత స్క్వాడ్‌ విభాగానికి బదిలీ చేశారు. విజయవాడ లో చీఫ్‌ టికెటింగ్‌ ఆఫీసర్లు (సీటీఐ)గా పనిచేసే ముగ్గురిని సీటీఐ ఇన్‌చార్జిలుగా నియమించారు. సీనియారిటీని చూడకుండా ఈ నిర్ణయాలు తీసేసుకున్నారు.

ఆది నుంచీ అవినీతి

విజయవాడ రైల్వేస్టేషన్‌ వేదికగా కమర్షియల్‌ విభాగంలో ఇద్దరు ‘ధనా’పాటి సీటీఐలు డబ్బులే పరమావధిగా పనిచేస్తున్నారు. 2013లో చెన్నై-హౌరా వెళ్లే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ తీసుకున్న ప్రయాణికుడిని కూడా బెదిరించి డబ్బు వసూలు చేయగా, సదరు సీటీఐలపై ప్రయాణికులు తిరగబడ్డారు. ఈ ఉదంతంతో ఆ రైలు విజయవాడ రైల్వేస్టేషన్‌లోనే ఐదు గంటలు నిలిచిపోయింది. ఆ తర్వాత వీరిద్దరే 2021లో ఎర్నాకుళం-గోరఖ్‌పూర్‌ వెళ్లే రఫ్తిసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇదే రీతిన టికెట్‌ తీసుకున్న వారిని బెదిరించి డబ్బు వసూలు చేయటంతో రైలు గంటపాటు విజయవాడలో నిలిచిపోయింది. ఈ వ్యవహారంలోనూ ప్రయాణికులు వారిద్దరితో గొడవ పడ్డారు. వీరి ఆగడాలపై రైల్వేబోర్డు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెలపాటు పక్కనపెట్టారు. తాజాగా బెజవాడ కమర్షియల్‌ విభాగం అధికారులు వారికి సీటీఐ ఇన్‌చార్జులంటూ పెద్దస్థానాన్ని కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరూ.. ప్రయాణికులను బెదిరించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒకరు కావలి, సింగరాయకొండ, ఉలవపాడులో భారీగా భూములు కొన్నారని తెలుస్తోంది. 

కావాల్సినవారి కోసం..

విజయవాడ రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ విభాగం ఆఫీసులో ఒక సీటీఐ పోస్టుకు అవకాశం ఏర్పడింది. ఆ పోస్టును దక్కించుకోవటానికి అనేక మంది పోటీ పడ్డారు. అయితే, ఉన్నతాధికారుల ఆలోచన మరోలా ఉంది. తమకు ఇష్టుడైన వ్యక్తిని ఆ పోస్టులో నియమించటానికి ప్రయత్నించారు. అతనికి ఇంకా సీటీఐ హోదా రాలేదు. దీంతో ఈ పోస్టును ఏడాది పాటు ఎమినిటీస్‌ విభాగానికి సరెండర్‌ చేశారు. ఏడాది తర్వాత తమకు కావాల్సిన వ్యక్తికి పోస్టింగ్‌ ఇచ్చారు. 

స్లీపర్‌ ఇన్‌చార్జుల రగడ

స్లీపర్‌ విభాగంలో ఇన్‌చార్జుల నియామకాల్లోనూ వివాదాలు నెలకొన్నాయి.  కండక్టర్‌ విభాగం (సీటీఐ సీవోఆర్‌) నుంచి ఒక ఉద్యోగి స్లీపర్‌ విభాగంలోకి ఫస్ట్‌ ఇన్‌చార్జిగా పోస్టింగ్‌ వేయించుకున్నారు. ఆయనను కాదని జూనియర్‌ అయిన మరో ఉద్యోగిని నియమించారు. దీంతో కండక్టర్‌ విభాగం నుంచి వచ్చిన ఉద్యోగి  రైల్వేబోర్డుకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో రైల్వేబోర్డు కూడా చీవాట్లు పెట్టింది. జూనియర్‌కు ఎలా పోస్టింగ్‌ ఇస్తారని ప్రశ్నించింది. అయినా మార్పు లేదు. ఆసక్తి చూపని ఓ వ్యక్తిని సీనియర్‌ ముసుగులో బలవంతంగా కూర్చోబెట్టారు. దీంతో రెండో ఇన్‌చార్జిగా కండక్టర్‌ విభాగం నుంచి వచ్చిన ఉద్యోగి కొనసాగుతున్నారు. మూడో ఇన్‌చార్జిగా తమకు ఇష్టమైన వ్యక్తిని నియమించుకున్నారు. ఈయన ఈ విభాగంలో చేసే వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. విందు, మందు, ఆపై వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే పరిస్థితి లేదు.

మత్తులో రైల్వే విజిలెన్స్‌

రైల్వే విజిలెన్స్‌ విభాగం ‘మత్తు’కు అలవాటు పడింది. శాఖల్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడమే మానేసింది. అవినీతి పనులపై అనేక ఫిర్యాదులు వస్తున్నా స్పందన లేదు. కమర్షియల్‌ విభాగంలోని అవినీతి అధికారులు, ఉద్యోగులతో విజిలెన్స్‌  లాలూచీ పడిందన్న విమర్శలు ఉన్నాయి. కొంతకాలంగా ఓ ఉద్యోగి ఇచ్చే మందు పార్టీల్లో విజిలెన్స్‌ సిబ్బంది పాలుపంచుకున్నారని, మందు సేవిస్తున్న వీడియోలు కూడా రైల్వే ఉద్యోగులకు షేర్‌ అయ్యాయని తెలుస్తోంది. 

కొత్త బాస్‌ దృష్టిపెట్టాలి

కొత్తగా సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (సీనియర్‌ డీసీఎం)గా వచ్చిన రాంబాబుకు ఈ అవినీతి వ్యవహారాలు సవాల్‌ విసురుతున్నాయి. వీటిపై దృష్టి సారించి, లోతుగా అధ్యయనం చేయిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. 

డ్యూటీ ఇక్కడ.. చేసేది అక్కడ..!

ఎమినిటీఎస్‌ విభాగంలోనే సీటీఐ జనరల్‌గా ఉన్న ఒక ఉద్యోగి పెద్దగా కనిపంచడు. ఎందుకంటే ఆయన సార్ల సొంత పనులు చూస్తుంటాడు. వారి ఇళ్లకు వెళ్లి మరీ వారి పనులు చక్కబెడతాడు. సార్లకు డ్రైవింగ్‌ కూడా చేస్తుంటాడు. ఇలాంటి పనుల్లో బిజీగా ఉంటూ విధులే నిర్వహించడు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.