కేసీఆర్‌కు కమీషన్లు, రైతులకు కన్నీళ్లు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-10-01T02:14:36+05:30 IST

కేసీఆర్‌కు కమీషన్లు, రైతులకు కన్నీళ్లు: విజయశాంతి

కేసీఆర్‌కు కమీషన్లు, రైతులకు కన్నీళ్లు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు కమీషన్లు తెచ్చిపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంచిర్యాల జిల్లా రైతులకు కన్నీళ్లు మిగులుస్తోందని, బ్యారేజీల బ్యాక్​వాటర్​తో  ఏటా రూ.10 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాములమ్మ పోస్టు యథాతథంగా...


''సీఎం కేసీఆర్‌కు బాగా కమిషన్లు తెచ్చిపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంచిర్యాల జిల్లా రైతులకు కన్నీళ్లు మిగులుస్తోంది. బ్యారేజీల బ్యాక్​వాటర్​తో ఏటా రూ.10 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలతో చెన్నూర్​ నియోజకవర్గంలోని జైపూర్, చెన్నూర్, కోటపల్లి, బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలాల్లోని రైతులు ఏటా రూ. 50 కోట్లకు పైగా పంట నష్టపోతున్నారు. గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో మూడేండ్లుగా ఇదే పరిస్థితి దాపురించిందని స్థానిక రైతులు తమ గోడును వెళ్లబుచ్చుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన టీఆర్ఎస్ సర్కార్ ప్రజల సాధకబాధకాలపై పట్టింపులేకుండా పోయింది. కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో 2019 నుంచి పంటలు మునుగుతున్నాయి. రైతులు జులైలో పత్తి, మిర్చి, వరి పంటలు వేసుకుంటుంటే ఆగస్టు, సెప్టెంబర్​ మాసాల్లో వరదలొచ్చి పంటలను ముంచేస్తున్నాయి. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో వాటర్ స్టోర్​ చేయడం, వరదలు వచ్చినప్పుడు ఒకేసారి గేట్లు ఓపెన్​ చేయడం వల్ల బ్యారేజీల కింద పంటలు చేతికి రాకుండా పోతున్నాయి. మరోవైపు వరద నేరుగా వెళ్లక బ్యాక్​వాటర్ ​పొలాలను ముంచెత్తుతోంది. ఇటీవల ఇలాగే పొలాలు మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యారేజీలు కట్టేటప్పుడు ఇరిగేషన్​ ఆఫీసర్లు అంచనా వేసిన వరద కంటే రెండు లక్షల క్యూసెక్కులు అధికంగా వస్తున్నట్టు సమాచారం. ముంపును నివారించేందుకు గోదావరి పొడవునా కరకట్టలు నిర్మించాలని రైతులు కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. కమిషన్ల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీలు కట్టిన సర్కారు అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే కరకట్టలు ఎందుకు నిర్మించడం లేదో తెలపాలి. ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కార్ రైతుల బాధలను అర్థం చేసుకుని, హైకోర్టు తీర్పును గౌరవించి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయం.'' అని విజయశాంతి పేర్కొన్నారు.



Updated Date - 2021-10-01T02:14:36+05:30 IST