తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడానికి కమిటీ

ABN , First Publish Date - 2021-06-20T06:53:50+05:30 IST

టీటీడీలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి ఇప్పటికే కమిటీని నియమించాం. ఈ కమిటీ విధివిధానాలతో మూడు నెలల్లో నివేదిక అందజేస్తుంది’ అని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తాత్కాలిక ఉద్యోగులను   రెగ్యులర్‌ చేయడానికి కమిటీ

తిరుమల, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘టీటీడీలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి ఇప్పటికే కమిటీని నియమించాం. ఈ కమిటీ విధివిధానాలతో మూడు నెలల్లో నివేదిక అందజేస్తుంది’ అని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో శనివారం జరిగిన బోర్డు సమావేశం తర్వాత చైర్మన్‌ మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతి, తిరుచానూరులో నివసిస్తున్న అర్హత కలిగిన హెచ్‌డీపీపీ పెన్షనర్లకు (పర్యవేక్షక, నాన్‌-పర్యవేక్షక) ఇతర టీటీడీ పెన్షనర్ల తరహాలోనే పుణ్యక్షేత్ర భారభృతి భత్యం రూ.500 నుంచి రూ.700కు పెంచేందుకు తీర్మానం చేశాం. గోవిందుడికి గోఆధారిత నైవేద్యం శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించాం.తిరుమలలో అనధికా రిక దుకాణాలు, తట్టలను వారంరోజుల్లో తొలగిస్తాం. తిరుపతిలో ప్రస్తుతం ఆగిన చోట నుంచి అలిపిరి వరకు గరుడవారధి నిర్మాణానికి ఆమోదం తెలిపాం. టీటీడీ నిధులతో త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయించాం ’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలోని వరాహస్వామి ఆలయం వాకిలి, వాకిలి చట్రం, గర్భగృహ ప్రవేశ ద్వారాలకు వెండి తొడుగులు అమర్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మూడు నెలల్లో ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్ల ప్రసారాలు ప్రారంభిస్తామన్నారు. తిరుమలను గ్రీన్‌హిల్స్‌గా ప్రకటించినందున ఉచిత బస్సుల స్థానంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ కూడా ఇందుకోసం వంద ఎలక్ర్టిక్‌ బస్సుల కొనుగోలుకు సీఎం అనుమతించారని తెలిపారు. తిరుపతి-తిరుమల మధ్య నడిచే ట్యాక్సీల యజమానులు టీటీడీని సంప్రదిస్తే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి ఎలక్ర్టిక్‌ వాహనాలు కొనుగోలు చేయించాలని బోర్డులో తీర్మానించామన్నారు.


ఆంజనేయస్వామి జన్మస్థలం విషయంలో మరొకరితో, మరో రాష్ట్రంతో పోటీపడే ఉద్దేశం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులతో కలిసి ఆకాశగంగ తీర్థం వద్ద ఉన్న బాల ఆంజనేయస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంజనేయస్వామి జన్మస్థలం తిరుమలలోని ఆకాశగంగే అని తాము నమ్ముతున్నామని, దానికి అనుగుణంగానే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు.  ఈవో మాట్లాడుతూ.. ఆకాశగంగ వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శేఖర్‌రెడ్డి, గోవిందహరి, పార్థసారథి, నిశ్చిత, ప్రశాంతిరెడ్డి, రాజే్‌షశర్మ, రమే్‌షశెట్టి, శివశంకర్‌, అనంత, మల్లాది విష్ణు, చిప్పగిరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శ్రీవారి ఆలయ సన్నిధి యాదవ పద్మనాభ యాదవ్‌ కుమారుడికి ఆ పదవిని ఇచ్చేలా టీటీడీ బోర్డు తీర్మానించిందని సభ్యుడు పార్థసారథి తెలిపారు.పద్మనాభం కుమారుడికి మైనార్టీ తీరాక సన్నిధి యాదవగా సేవచేసుకునే అవకాశముంటుందన్నారు. 

Updated Date - 2021-06-20T06:53:50+05:30 IST