కథా విమర్శకు నిబద్ధుడు

ABN , First Publish Date - 2022-09-12T05:40:42+05:30 IST

సాహిత్య విమర్శ సింహభాగం కవిత్వం చుట్టూ తిరుగుతున్న, తిరిగిన సంగతి మనకు తెలుసు. కథలు ఉన్నాయి కానీ కథా విమర్శ పాళ్ళు తక్కువే....

కథా విమర్శకు నిబద్ధుడు

సాహిత్య విమర్శ సింహభాగం కవిత్వం చుట్టూ తిరుగుతున్న, తిరిగిన సంగతి మనకు తెలుసు. కథలు ఉన్నాయి కానీ కథా విమర్శ పాళ్ళు తక్కువే. ఆ కాలంలో వచ్చిన కథల్ని చదివేవాళ్ళు కూడా తక్కువే. కె.పి. అశోక్‌ కుమార్‌ మాత్రం కొన్ని లక్షల పేజీల్ని చదివారు. వేల కథల్ని పరిశీలించారు. ఆయన జీవితంలో చాలా క్షణాలు కథలు, నవలల పఠనంలో వెనక్కి వెళ్ళిపో యాయి. కె.పి. కథా విమర్శలో ఆషామాషీగా దృష్టి పెట్టలేదు. దృష్టితోపాటు మేధని, హృదయాన్ని పెట్టాడు. ఆయన విమర్శ ‘పరిపక్వత’తో ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, కుదుపు లేకుండా ఉంటుంది. 


ఆయన దృష్టిలో సూక్ష్మంగా మంచి కథకు ప్రధాన లక్షణాలు ఇలా ఉన్నాయి: కథ పాఠకునితో చదివించాలి, అతని ఆలోచనా ప్రపంచంలో, హృదయ సంస్కారంలో కదలిక తీసుకురావాలి. కె.పి. మొదట గొప్ప పాఠకుడు. ఆయన చదివిన కథ తనలో తీసుకువచ్చిన కదలిక మీద విమర్శకుడిగా స్పందిస్తాడు. విమర్శకుడి ప్రధాన లక్షణం ఏది మంచి రచన, ఎందుకు మంచి రచన, ఏ రచన బాగా లేదు, ఎందుకు బాగా లేదు... అనే అంశాలపై సాక్ష్యాలను ఇవ్వగలగటం. పై ప్రశ్నలకు సరైన జవాబులిచ్చి సంతృప్తి పరచగలగాలి. తన కథ మీద విమర్శను చదివిన రచయిత కూడా దాన్ని అంగీకరిం చగలిగే భాషలో చెప్పగలగాలి. ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి.


కథ జీవన వాస్తవికతకు భిన్నంగా ఉండాలి. కళాత్మక రూపాన్ని సంతరించుకుని అభివ్యక్తమవ్వాలి. వస్తువు కోసం శిల్పాన్ని, శిల్పం కోసం వస్తువుని త్యజించడం మంచి కథ లక్షణం కాదు. రచయిత దృక్పథం కథలో అంతర్నిహితమై ఇమిడిపోవాలి. ఇవీ కె.పి. ఆలోచనలు, అభిప్రాయాలు. ఉబుసుపోక రాసిన కథల్ని కె.పి. కథలుగా అంగీకరించరు. పాఠకుడిని ఒక్కబిగిన చదివించడం కథ ధర్మం. కథ మనసులో తిరుగాడాలి. పాత్రలు వెంటాడాలి. కథలోని సన్నివేశాలు కలవరానికి గురి చేయాలి. సంభాషణలు లోలోపల తారట్లాడాలి. ఒక దిగ్భ్రమ కలగాలి. రచయిత ఊహాశక్తికి, కల్పనా చాతు ర్యానికి మనసులోనే జోహార్లు అర్పించాలి. కదిలించిన కథ గురించి సన్నిహిత పాఠకు లతో ఉత్సాహంగా పంచు కోగలగాలి. ఇలాంటి కథలు పది కాలాలపాటు నిలబ డతాయని కె.పి. విశ్వాసం.


కె.పి. చూపు చాలా ప్రత్యేకం అని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఆలూరి బైరాగిని కవిగా గుర్తించిన సాహితీలోకం, కథకుడిగా పట్టించుకోలేదు. కానీ కె.పి. బైరాగి కథల్ని విశ్లేషించారు. కొన్ని నిర్ధారణల్ని చేశారు. బైరాగి కథల్లోని విశిష్టతను గుర్తించారు. బైరాగి చేయి తిరిగిన కథకుడని ప్రకటన చేశారు. అలాగే శ్రీశ్రీ, కాళోజి, జూకంటి జగన్నాథం లాంటి కవులు రాసిన కథల్ని ఎరుకతో చర్చిం చారు. కొనకళ్ళ వెంకటరత్నం కథల మీద వ్యాసం రాశారు. ఎవరూ పట్టించుకోని కథల్ని, కథా రచయితల్ని గుర్తించడంలో వీరిది విలక్షణమైన చూపు. 


సమకాలీన వచన సాహిత్య విమర్శకు అశోక్‌ కుమార్‌ దారి దీపం లాంటివారు. పోరంకి దక్షిణామూర్తి, పాపినేని కథా విమర్శకులు. వారు రాసిన కథల్లోని లోతుపాతుల్ని కూడా విశ్లేషించడం విమర్శకుడిగా కె.పి. సత్తాకు తార్కాణం. ఆయన విమర్శనా వ్యాసాల్లో చాలా పరిశోధకాంశాలు దొరుకుతాయి. పాఠకుల పట్ల రచయిత ఎంత బాధ్యతతో వ్యవహరించాలో, కథకుడు కథన సౌందర్యాన్ని, కథని కళాత్మకంగా ఎందుకు మలచాలో చాలాచోట్ల సూచనలు చేశారు. సృజనకు శిక్షణ ఉంటుందా? అనే ప్రశ్న వేసుకొని, కొంత శిక్షణ అవసరం అని వారు భావిస్తారు. రచయిత నిరంతరం తనని తాను చెక్కుకోవలసిన అవసరం గురించి గుర్తు చేస్తారు.


శిల్పం, శైలి, దృష్టి కోణం, ఎత్తుగడ అంటూ నాలుగు పడికట్టు మాటలతో విమర్శ రాయడం వీరి తత్త్వం కాదు. విమర్శకుడిగా గాక పాఠకుడిగా ఆయన ఏం ఆశిస్తున్నారు అనే ప్రశ్న వేసుకుంటే, కథా రచనకు కొన్ని ప్రమాణాలు స్ఫురిస్తాయి: 1. కథ చదివించాలి. 2. దాని నిర్మాణం శ్రద్ధగా జరగాలి. 3. దాన్ని కళాత్మకంగా మలచాలి. 4. ప్రజాస్వామ్య, లౌకిక భావనలు పెంపొందే కథలు రావాలి. 5. ఆదర్శవాద ధోరణులతో కథ అసహజంగా మారకూడదు. 6. ఇతివృత్తాల ఎంపికలో మూసధోరణిని బద్దలు కొట్టాలి. 7. కథకుడి దృష్టి వైశాల్యం పెరగాలి. తెలుగు నేల మీద కథా విమర్శను నిబద్ధతతో ముందుకు తీసుకెళుతున్న విమర్శకులు చాలా తక్కువ. కానీ కె.పి. కథావిమర్శను బలంగా, వేగంగా కాకుండా శ్రద్ధగా చేస్తున్నారు. వారి విమర్శ ద్వారా రచయితలు మరింత మెరుగు పడతారని ఆశిస్తున్నాను. ఇటీవల అద్దేపల్లి రామ్మోహనరావు విమర్శ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు.

సుంకర గోపాల్‌

94926 38547

Updated Date - 2022-09-12T05:40:42+05:30 IST