కొత్త జిల్లాలపై మళ్లీ కదలిక.. ఉన్నతస్థాయి కమిటీ వేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-08-08T17:43:55+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుపై మరోసారి కదలిక వచ్చింది. దీనిపై ప్రభుత్వం తాజాగా ఉన్నత స్థాయి కమిటీ వేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే... ప్రస్తుతం వున్న విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించాల్సి వుంటుంది.

కొత్త జిల్లాలపై మళ్లీ కదలిక.. ఉన్నతస్థాయి కమిటీ వేసిన ప్రభుత్వం

మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

పార్లమెంట్‌ స్థానాల లెక్కన.... మూడు ముక్కలు కానున్న విశాఖ జిల్లా

భౌగోళికంగా కొన్ని ప్రాంతాల ప్రజలు వ్యతిరేకం

విశాఖలో చేరికకు ఎస్‌.కోట ప్రాంతీయులు అభ్యంతరం

అనకాపల్లిలో చేరడంపై పెందుర్తి వాసులు విముఖత

అరకు ఎంపీ స్థానం పరిధిలో మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌

అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకోనున్న కమిటీ


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటుపై మరోసారి కదలిక వచ్చింది. దీనిపై ప్రభుత్వం తాజాగా ఉన్నత స్థాయి కమిటీ వేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే... ప్రస్తుతం వున్న విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించాల్సి వుంటుంది. విశాఖ నగరంలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు భీమిలి, విజయనగరం జిల్లా ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గాలతో విశాఖ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంది. అనకాపల్లి ఎంపీ స్థానం పరిధిలోని అనకాపల్లి, నర్సీప ట్నం, మాడుగుల, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి, ఎలమంచిలి... ఏడు సెగ్మెంట్‌లతో అనకాపల్లి కేంద్రంగా జిల్లాగా ఏర్పడవచ్చు. ఇక అరకు ఎంపీ స్థానం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తున్నందున తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఐదు సెగ్మెంట్‌లు దీని పరిధిలోకి రావాలి. కానీ భౌగోళికంగా పలు ఇబ్బందులున్న నేపథ్యంలో ఈ ఎంపీ స్థానం పరిధిలో మూడు జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం వుంది. 


కాగా ప్రభుత్వం నియమించిన కమిటీ, కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల అభిప్రా యాలు తీసకోనున్నది. ముఖ్యంగా భౌగోళిక సరిహద్దులపై ఆయా వర్గాల నుంచి ఆందోళన, అభ్యంతరాలు వస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. విశాఖ లోక్‌సభ పరిధిలో ఉన్న ఎస్‌.కోట ప్రజలు విశాఖ జిల్లాలో కలిసేందుకు అంగీకరించడంలేదు. ఎస్‌.కోటలో కొత్తవలస మండలం తప్ప మిగిలిన ప్రాంతమంతా విజయనగరానికి చేరువలో ఉంది. కాగా కొత్తగా ఏర్పాటుకానున్న అనకాపల్లి జిల్లాలో పెందుర్తి సెగ్మెంట్‌ విలీనానికి నియోజకవర్గంలో సగానికి పైగా ప్రజలు ఇష్టంగా లేరు. పెందుర్తి పరిస రాల్లో అనేక వార్డులు జీవీఎంసీ పరిధిలో... అం దునా నగరానికి ఆనుకుని ఉన్నాయి. పెదగం ట్యాడ మండలంలో గ్రామీణ ప్రాంతమంతా పెందుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తే...  పెదగంట్యాడ మండలంలో అర్బన్‌ ప్రాంతం విశాఖలో, గ్రామీణ ప్రాంతం అనకాపల్లి జిల్లా పరిధిలోకి వస్తాయి. సాంకేతికంగా, పాలనాపరంగా ఇబ్బంది ఉండడంతో అక్కడ ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు అభ్యంతరం చెబుతున్నారు. 


కాగా ప్రభుత్వ విధానం మేరకు అరకు జిల్లా ఏర్పాటుపై విశాఖ జిల్లాలో అరకు, పాడేరు సెగ్మెంట్‌ల ప్రజలు తప్ప మిగిలిన ఐదు సెగ్మెంట్‌ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరకు రావాలంటే రంపచోడవరం, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు ప్రజలు అనేక ఇబ్బందులు పడాలని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు ఉన్నతస్థాయి కమిటీకి తమ అభ్యంతరాలు నివేదించనున్నారు. 


కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మౌలిక వసతుల కల్పన కూడా ఎంతో కీలకం. విశాఖ వరకు ఇబ్బందులు లేవు. అనకాపల్లి, అరకులో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే కలెక్టరేట్‌తోపాటు అన్ని శాఖలకు కొత్తగా భవనాలు నిర్మించి, వసతులు కల్పించాల్సి వుంటుంది. అనకాపల్లి ఇప్పటికే డివిజన్‌ కేంద్రం కావడంతో దీనితో పోలిస్తే అరకులో ఎక్కువగా భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-08-08T17:43:55+05:30 IST