కరోనా కట్టడికి ఐఏఎస్‌ అధికారులతో కమిటీ

ABN , First Publish Date - 2021-04-22T06:33:22+05:30 IST

కరోనా కట్టడికి ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి, రంగాపూర్‌ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

కరోనా కట్టడికి ఐఏఎస్‌ అధికారులతో కమిటీ
కందుగులలో కరోనా వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఈటల

రాత్రి కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం

వరికోతల సమయంలో కోవిడ్‌ నిబంధనలు పాటించాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

హుజూరాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 21: కరోనా కట్టడికి ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి, రంగాపూర్‌ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాసంగి సీజన్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు. మధ్య దళారులను నమ్మి ఆశ్రయించవద్దని కోరారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావాలని కోరారు. తేమ లేకుండా నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం 24/7గంటల పాటు శ్రమిస్తుందని తెలిపారు. కరోనా కట్టడి కోసం వైద్య ఆరోగ్య శాఖ కాకుండా ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులతో కమిటీలు వేశామని, కరోనా కట్టడికి వివిధ అంశాలకు ఇన్‌చార్జీలుగా నియమించినట్లు తెలిపారు. రాత్రి కర్ఫ్యూతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. 

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, తాను ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. హైద్రాబాద్‌కు ఏపీ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స పొందేందుకు వస్తున్నారని, రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యాలు, డాక్టర్లు పెషెంట్లకు అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌ ఇవ్వాలని, పెషెంట్ల డిమాండ్‌ను బట్టి ఆక్సిజన్‌ ఇవ్వరాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం వచ్చే నెల మొదటి నుంచి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా ఉధృతి గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉందని, కేసులు పెరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని కోరా రు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వరికోతలు ప్రారంభమైన దృష్ట్యా రైతులు తప్పని సరిగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. మండలంలోని కందుగుల గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కౌరు సుగుణాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ బావ్‌సింగ్‌, సర్పంచ్‌లు గూడూరి ప్రతాప్‌రెడ్డి, బింగి కరుణాకర్‌, చెల్పూర్‌ మెడికలాఫీసర్‌ డాక్టర్‌ రమాదేవి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T06:33:22+05:30 IST