నిత్యావసరాల ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-28T05:47:49+05:30 IST

: నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో శుక్రవారం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిత్యావసరాల ధరలు తగ్గించాలి
ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వామపక్షాల నాయకులు

  వామపక్షాల ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం

గణేశ్‌నగర్‌, మే 27: నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌  ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో శుక్రవారం  ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ పబ్బం గడుకోవాలని చూస్తుందని అన్నారు. హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్‌ మతాల మధ్య ఘర్షణ పెంపొందించే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.  కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొండంత పెంచి గోరంత తగ్గించిందని ఎద్దేవా చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. 14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్‌ షాపుల ద్వారా పేద ప్రజలకు అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  తానేమి తక్కువ కాదన్నట్లుగా రిజిస్ర్టేషన్‌ చార్జీలు, బస్‌ చార్జీలు, విద్యుత్‌ చార్జీలు, మద్యం ధరలను పెంచుతూ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లుపెడుతోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నగర కార్యదర్శులు గుడికందుల సత్యం, కసిరెడ్డి సురేందర్‌ రెడ్డి, జిందం ప్రసాద్‌, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, ఎస్‌ రజనీకాంత్‌, నరేశ్‌, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు బుచ్చన్న యాదవ్‌, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కిన్నెర మల్లవ్వ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:47:49+05:30 IST