వర్సిటీల్లో ఖాళీల భర్తీకి కామన్‌ బోర్డు

ABN , First Publish Date - 2022-06-24T19:47:29+05:30 IST

యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీ విషయంలో ముందగుడు పడింది. హెల్త్‌ యూనివర్సిటీ మినహా... మిగిలిన 15 వర్సిటీల్లోని పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ‘కామన్‌ బోర్డు’ను ఏర్పాటుచేసింది. ఆయా వర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టులను..

వర్సిటీల్లో ఖాళీల భర్తీకి  కామన్‌ బోర్డు

ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ నేతృత్వం

సభ్యులుగా ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు

త్వరలో యూనివర్సిటీల చట్టానికి సవరణ

ప్రభుత్వ అనుమతుల తర్వాత నోటిఫికేషన్లు


హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీ విషయంలో ముందగుడు పడింది. హెల్త్‌ యూనివర్సిటీ(University of Health) మినహా... మిగిలిన 15 వర్సిటీల్లోని పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ‘కామన్‌ బోర్డు’ను ఏర్పాటుచేసింది. ఆయా వర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టులను ఈ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు (జీవో నంబర్‌ 16) జారీచేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో భారీగా ఖాళీలు ఉన్న విషయం తెలిసిందే. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి... అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి, మెరిట్‌ జాబితా ప్రకారం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీని కోసం కామన్‌ నియామక బోర్డును ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు, బీఆర్‌ అంబేడ్కర్‌, జేఎన్‌ఏ అండ్‌ ఎఫ్‌ఏ, జేఎన్‌టీయూ, తెలుగు యూనివర్సిటీలతోపాటు అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ వర్సిటీల్లోని ఖాళీలను కూడా ఈ బోర్డు ద్వారానే భర్తీ చేయనున్నారు. దీనికోసం బోర్డు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. పోస్టుల వారీగా నియామక పరీక్షలను నిర్వహిస్తారు. అయితే... దీనికంటే ముందు యూనివర్సిటీల చట్టాన్ని ప్రభుత్వం సవరించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతితో నియామక నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇక బోర్డు స్వరూపాన్ని పరిశీలిస్తే... ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి దీనికి కూడా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే ఆర్థిక, విద్యా శాఖల కార్యదర్శులు రామకృష్ణారావు, వాకాటి కరుణ సభ్యులుగా ఉంటారు. 


కాలేజీ విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కన్వీనర్‌ / సభ్యుడిగా వ్యవహరిస్తారు. అంతేగాక... అవసరాన్ని బట్టి  కొంతమంది నిపుణులను కో-ఆప్షన్‌ సభ్యులుగా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. బోర్డుకు అవసరమైన సిబ్బంది, సదుపాయాలను కాలేజీ విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి సమకూర్చాల్సి ఉంటుంది. బోర్డు విధివిధానాలను త్వరలో ప్రకటిస్తారు. కాగా, యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని బోర్డు ఏర్పాటుపై జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షల్లో మార్కులు, నెట్‌ లేదా స్లెట్‌, ఇంటర్వ్యూలో ప్రతిభను పరిగణనలోకి తీసుకునేవారు. అయితే ఈ విధానం ద్వారా సరైన అభ్యర్థులు ఎంపిక కావడం లేదన్న విమర్శల నేపథ్యంలో యూజీసీ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని అనుసరించి అభ్యర్థులకు నియామక పరీక్ష పెట్టాలి. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల చట్టంలో మార్పులు చేయాలి. దేశంలో ఇప్పటికే బీహార్‌, ఒడిశా వంటి రాష్ట్రాలు యూనివర్సిటీల చట్టాలను సవరించాయి. అదే విధంగా రాష్ట్రంలోనూ చట్ట సవరణ తీసుకురానున్నారు. 


ఖాళీలు 5వేలకు పైనే...

యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు 5వేలకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులున్నాయి. 11 యూనివర్సిటీల్లోనే సుమారు 4వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు గతంలో గుర్తించారు. ప్రస్తుతం మరో నాలుగు యూనివర్సిటీలను కూడా చేర్చడంతో ఇంకో 1,000 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. కాగా... వివిధ వర్సిటీల్లో 1,061 ఖాళీల భర్తీ కోసం  2017లో ఉత్తర్వులు (జీవో నంబర్‌ 34) జారీచేశారు. అయితే ఈ నియామక ప్రక్రియ పూర్తికానందున ఆయా పోస్టుల భర్తీకి మరోసారి ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-06-24T19:47:29+05:30 IST