గర్భిణుల్లో ఇవి సహజం

ABN , First Publish Date - 2022-08-23T18:13:58+05:30 IST

గర్భిణుల్లో సహజంగా కనిపించే సమస్యలు అసిడిటీ, మలబద్ధకం. అయితే ఈ సమస్యలను మందులతో

గర్భిణుల్లో ఇవి సహజం

గర్భిణుల్లో(pregnant women) సహజంగా కనిపించే సమస్యలు అసిడిటీ, మలబద్ధకం. అయితే ఈ సమస్యలను మందులతో కాకుండా, తినే ఆహారం, అనుసరించే అలవాట్ల్ల మార్పులతో సరిదిద్దవచ్చు. గర్భధారణతో గర్భకోశం పరిమాణం పెరిగి జీర్ణాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో తిన్న వెంటనే ఆహారం అన్నవాహికలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. జీర్ణాశయంలోని యాసిడ్‌ అన్నవాహికలోకి ఎగిసి పడుతుంది. దాంతో ఛాతీలో, గొంతులో మంట వేధిస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. ఒకేసారి భారీగా తినేయకుండా కొద్ది పరిమాణాల్లో ప్రతి రెండు గంటలకోసారి తింటూ ఉండాలి. ఇక మలబద్ధకం నివారణ కోసం పీచుపదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. స్వల్ప వ్యాయామం చేయాలి.


మొదటి నెలలో...

  • గర్భం దాల్చినట్టు తెలియగానే కొందరు మహిళలు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలనే అపోహలో ఉంటారు. కానీ ప్రారంభంలో అంతకుముందు ఎలాంటి జీవనశైలిని గడిపారో దాన్నే కొనసాగించవచ్చు. అదనపు విశ్రాంతి అవసరం ఉండదు. 
  • పూర్వం వరస గర్భస్రావాలు అయి ఉన్నా, గర్భాశయ ముఖద్వార సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యల ఉండి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తే తప్ప గర్భిణులు మొదటి నెలలో అవసరానికి మించి విశ్రాంతి తీసుకోనవసరం లేదు. 
  • వ్యాయామం(exercise) విషయంలో కూడా ఎలాంటి నిబంధనలూ లేవు. ఏరోబిక్స్‌ లాంటి హెవీ ఎక్సర్‌సైజ్‌లు కాకుండా వాకింగ్‌, ఇతరత్రా తేలికపాటి వ్యాయామాలన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఐరన్‌ ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. 

Updated Date - 2022-08-23T18:13:58+05:30 IST