స్వర్ణోత్సవం

ABN , First Publish Date - 2022-08-09T09:58:48+05:30 IST

మన్వెల్త్‌ గేమ్స్‌లో వరుసగా రెండోరోజూ మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు.

స్వర్ణోత్సవం

కామన్వెల్త్‌ క్రీడలకు భారత ఆటగాళ్లు అద్భుతమైన ముగింపు ఇచ్చారు.. చివరి రోజు ఏకంగా నాలుగు స్వర్ణాలతో దుమ్ము రేపారు.. తెలుగు స్టార్లు పీవీ సింధు, ఆచంట శరత్‌ కమల్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ పసిడి పతకాలతో మురిపించారు.. టీటీ సూపర్‌ స్టార్‌ శరత్‌ ఈ గేమ్స్‌లో ముచ్చటగా మూడు పసిడి, ఒక రజతంతో కలిపి నాలుగు మెడల్స్‌తో ‘కామన్వెల్త్‌’లో తన ఘనమైన రికార్డును కొనసాగించాడు.. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ బంగారంతో అలరిస్తే పురుషుల హాకీ జట్టు రజతంతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది..ఈ క్రీడల్లో భారత్‌ మొత్తం 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.



చివరిరోజు నాలుగు బంగారు పతకాలు

పసిడి పట్టేసిన సింధు, లక్ష్యసేన్‌.. డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ 

టీటీ స్టార్‌ శరత్‌ గోల్డెన్‌ ట్రిపుల్‌..పురుషుల హాకీలో రజతం

61 పతకాలతో భారత్‌కు నాలుగోస్థానం.. ఆస్ట్రేలియాకు అగ్రస్థానం


బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో వరుసగా రెండోరోజూ మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. పదోరోజు ఆరు స్వర్ణాలు పట్టేస్తే..క్రీడల ఆఖరి రోజు, సోమవారం నాలుగు పసిడి పతకాలతో సూపర్‌ అనిపించారు. పురుషుల హాకీలో మన్‌ప్రీత్‌ సేన రజత పతకంతో ప్రతిష్ఠాత్మక గేమ్స్‌కు ముగింపునిచ్చింది.


స్వర్ణ ‘సింధూ’రం..

ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు ఈసారి పసిడి పతకం సొంతం చేసుకుంది. దాంతో ఆమె పతకాల సిగలో మరో స్వర్ణం చేరింది. కిక్కిరిసిన ఫ్యాన్స్‌ మధ్య సోమవారం జరిగిన ఫైనల్లో 21-15, 21-13తో వరుసగా గేముల్లో మిచెల్లీ లీ (కెనడా)ను చిత్తు చేసిన భారత స్టార్‌ కామన్వెల్త్‌లో తొలిసారి పసిడి పతకంతో మెరిసింది. మొదటి గేమ్‌లో సింఽధు గాయంతో ఇబ్బందిపడినా..ఆ ఛాయలు దరిచేరనీయకుండా గేమ్‌లో జయకేతనం ఎగురవేసింది. రెండో గేమ్‌లో మరింత దూకుడు ప్రదర్శించిన సింధు..గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. కామన్వెల్త్‌ పీవీకిది ఓవరాల్‌గా మూడో మెడల్‌. 2014లో కాంస్యం నెగ్గిన ఆమె 2018లో రజత పతకం   గెలిచింది.  


సేన్‌ మెరిసెన్‌..

యువ ఆటగాడు లక్ష్యసేన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో పోరాడి గెలిచాడు. మలేసియా షట్లర్‌ ఎంగ్‌ జే యాంగ్‌తో జరిగిన పోరులో 19-21, 21-19, 21-16తో విజయం సాధించిన 20 ఏళ్ల సేన్‌ పసిడి పతకం ముద్దాడాడు. 


సాత్విక్‌/చిరాగ్‌ సూపర్‌

సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి జోడీ అంచనాలను నిలబెట్టుకుంటూ పురుషుల డబుల్స్‌ టైటిల్‌తో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మూడో పసిడి పతకం అందించింది. ఇంగ్లండ్‌ ద్వయం బెన్‌ లేన్‌/సీన్‌ మెండీతో జరిగిన ఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌ జంట 21-15, 21-13తో సునాయాసంగా గెలిచి స్వర్ణం సాధించింది. సాత్విక్‌ ద్వయంతోపాటు సింధు, లక్ష్యసేన్‌ పసిడి పతకాలు కైవసం చేసుకోగా.. టీం చాంపియన్‌షి్‌పలో రజతం, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌, మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జోలీ కాంస్య పతకాలు దక్కించుకున్నారు. 


సాగర్‌కు సిల్వర్‌..

ఆదివారం అర్ధరాత్రి జరిగిన బాక్సింగ్‌ 92 కి. ఫైనల్లో సాగర్‌ 0-5తో డెలీషియస్‌ ఓరీ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడాడు. దాంతో అతడు రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో మను ఐదు, రోహిత్‌ యాదవ్‌ ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచారు. 


40లో 4

టీటీ సూపర్‌స్టార్‌ శరత్‌ కమల్‌ వయస్సు మనస్సుకే తప్ప శరీరానికి కాదని చాటి చెప్పాడు. నాలుగు పదుల వయస్సులో కామన్వెల్త్‌ క్రీడల్లో తన అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తూ పురుషుల సింగిల్స్‌లో కూడా పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. తుది పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినా వెనుకంజ వేయకుండా 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ (ఇంగ్లండ్‌)ను చిత్తు చేసి చాంపియన్‌గా ఆవిర్భవించాడు. 2006లో సింగిల్స్‌ స్వర్ణం అందుకున్న శరత్‌.. ఈసారి గేమ్స్‌లో టీం, మిక్స్‌డ్‌  డబుల్స్‌లో ఇంతకుముందే రెండు పసిడి పతకాలు దక్కించుకున్నాడు.


దాంతో గోల్డెన్‌ ట్రిపుల్‌ సాధించిన కమల్‌.. సాథియన్‌ జతగా పురుషుల డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఫలితంగా ఈ క్రీడల్లో తెలుగు స్టార్‌ ఖాతాలో మొత్తం నాలుగు పతకాలు చేరాయి. కాగా..మొత్తం ఐదు కామన్వెల్త్‌ క్రీడల్లో శరత్‌ పతకాల సంఖ్య 13కి చేరడం విశేషం. ఇందులో ఏడు స్వర్ణ, మూడు రజత, మరో మూడు కాంస్య పతకాలున్నాయి. హోరాహోరీగా సాగిన పురుషుల కాంస్య పతక మ్యాచ్‌లో సాథియన్‌ 11-9, 11-3, 11-5, 8-11, 9-11, 10-12, 11-9తో స్థానిక ఫేవరెట్‌ డ్రింక్‌హాల్‌ను మట్టికరిపించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో సాథియన్‌కిది ఓవరాల్‌గా ఆరో పతకం. ఈ క్రీడల్లో ఇది రెండోది. శరత్‌  జోడీగా ఆదివారం అతడు రజతం నెగ్గిన సంగతి తెలిసిందే.


ఈ పతకం కోసం చాలా కాలం ఎదురుచూశా. మొత్తానికి సాధించా. సంతోషంగా ఉంది. అభిమానులకు ధన్యవాదాలు. వాళ్లే  ఈరోజు నేను గెలిచేలా చేశారు.

- పీవీ సింధు

అభినందనలు

కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు పసిడి పతకాన్ని గెలుచుకోవడం ద్వారా దేశం మొత్తం గర్వపడేలా చేసింది. ఆమెకు నా అభినందనలు.

- గవర్నర్‌ తమిళిసై



కామన్వెల్త్‌ క్రీడల్లో పీవీ సింధు స్వర్ణం సాధించడం సంతోషాన్ని కలిగించింది. సింధుకు అభినందనలు

- సీఎం కేసీఆర్‌


సింధుది ప్రత్యేకస్థానం

కామన్వెల్త్‌ పసిడి పతకం సాధించడానికి సింధు చాలా కృషి చేసింది. ఒక అథ్లెట్‌గా ఇప్పుడున్న ఇతర మహిళా క్రీడాకారులతో పోలిస్తే సింధు శారీరకంగా చాలా బలమైనది. గతం కంటే సింధు ఆటతీరు, స్ట్రోక్స్‌ బాగా మెరుగుపడ్డాయి. సుదీర్ఘ ర్యాలీలు ఆడే నేర్పు, వేగం, పవర్‌ స్ట్రోక్స్‌ కొట్టే సామర్థ్యం కలగలిపి సింధును ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇలాంటి లక్షణాలు అంతర్జాతీయ మహిళల బ్యాడ్మింటన్‌ సర్క్యూట్‌లో చాలా తక్కువ మందిలోనే కనిపిస్తాయి.

       - పుల్లెల గోపీచంద్‌


హాకీ ఫైనల్లో పోరాడకుండానే..

ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో మనకు ఆఖరి పతకాన్ని పురుషుల హాకీ జట్టు అందించింది. ఫైనల్లో మన జట్టు 0-7 గోల్స్‌ తేడాతో  డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో చిత్తయి రజత పతకానికే పరిమితమైంది. కళ్లు చెదిరే వేగంతో, ఊపిరి సలపని దాడులతో భారత్‌పై విరుచుకుపడిన ఆసీ్‌స..మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా చేసి స్వర్ణం ఎగరేసుకుపోయింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కిది మూడో ఓటమి. 

Updated Date - 2022-08-09T09:58:48+05:30 IST