మన రెజ్లర్లు బంగారం

ABN , First Publish Date - 2022-08-07T09:49:43+05:30 IST

అటు రెజ్లర్లు, ఇటు అథ్లెట్లు అబ్బురపరిచిన వేళ కామన్వెల్త్‌ క్రీడల తొమ్మిదో రోజు భారత్‌కు పతకాలు వెల్లువెత్తాయి.

మన రెజ్లర్లు బంగారం

తొమ్మిదో రోజు మూడు స్వర్ణాలు కైవసం

వినేశ్‌ హ్యాట్రిక్‌.. రవి, నవీన్‌ పసిడి పట్టు

లాన్‌బౌల్స్‌లో చారిత్రక రజతం

అథ్లెట్లు అవినాష్‌, ప్రియాంకకు రజతాలు

పూజ, సిహాగ్‌, దీపక్‌, హుస్సాముద్దీన్‌, జాస్మిన్‌కు కాంస్యాలు

క్రికెట్‌, పురుషుల హాకీ ఫైనల్లో భారత జట్లు


పడితే పసిడి పట్టు అన్నట్టు భారత రెజ్లర్లు చెలరేగుతున్నారు. కుస్తీ పోటీల రెండోరోజు ఏకంగా మూడు స్వర్ణాలు కొల్లగొట్టారు. స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అయితే వరుసగా మూడో బంగారంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో హ్యాట్రిక్‌ సాధించింది. రవికుమార్‌ దహియా, నవీన్‌ కుమార్‌ పసిడి పతకాలతో ఔరా అనిపించగా, మరో ముగ్గురు రెజ్లర్లు, పూజా గెహ్లాట్‌, పూజా సిహాగ్‌, దీపక్‌ నెహ్రా కాంస్యాలతో మురిపించారు.

   

అథ్లెటిక్స్‌లో అవినాష్‌ సబ్లే, ప్రియాంక గోస్వామి రజతాలతో సత్తా చాటారు.లాన్‌బౌల్స్‌ పురుషుల ఫోర్స్‌లో మన జట్టు చారిత్రక రజత పతకం  అందుకుంది. బాక్సింగ్‌లో తెలుగు కుర్రోడు హుస్సాముద్దీన్‌, జాస్మిన్‌ కాంస్యాలకు పరిమితమవగా.. నిఖత్‌ జరీన్‌, అమిత్‌ ఫైనల్‌ చేరి కనీసం రజతాలు ఖరారు చేశారు..క్రికెట్‌లో హర్మన్‌ సేన, హాకీలో పురుషుల జట్లు తుది సమరానికి సిద్ధమయ్యాయి.


బర్మింగ్‌హామ్‌: అటు రెజ్లర్లు, ఇటు అథ్లెట్లు అబ్బురపరిచిన వేళ కామన్వెల్త్‌ క్రీడల తొమ్మిదో రోజు భారత్‌కు పతకాలు వెల్లువెత్తాయి. శనివారం మన ఖాతాలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 11 పతకాలు చేరాయి. రెజ్లింగ్‌ 57కి. కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత రవికుమార్‌ దహియా టైటిల్‌ పట్టేశాడు. వెల్సన్‌ (నైజీరియా)తో జరిగిన ఫైనల్లో రవిసాంకేతిక ఆధిపత్యం (10-0)తో ఘన విజయం సాధించి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కామన్వెల్త్‌లో దహియాకిది తొలి స్వర్ణం. క్వార్టర్‌ఫైనల్లో సూరజ్‌ సింగ్‌ (న్యూజిలాండ్‌)పై 10-0 నెగ్గిన దహియా సెమీ్‌సలో అలీ అసద్‌ (పాకిస్థాన్‌)ను 14-4తో చిత్తు చేశాడు. మహిళల 53 కి. విభాగంలో వినేశ్‌ ఫొగట్‌ 4-0తో చామోదయ కేశని (శ్రీలంక)పై గెలిచి పసిడి పతకం అందుకుంది.


2014, 2018 కామన్వెల్త్‌ క్రీడల్లోనూ పసిడి సాధించిన వినేశ్‌.. ఈసారీ టైటిల్‌తో స్వర్ణాల హ్యాట్రిక్‌తో ఔరా అనిపించింది. తొలి మ్యాచ్‌లో మెర్సీ (నైజీరియా)ని 6-0తో, రెండో మ్యాచ్‌లో సమంత (కెనడా)ని 2-0తో ఓడించిన ఫొగట్‌ పసిడి పతక పోరుకు చేరింది. పురుషుల 74 కి.ల ఫైనల్లో నవీన్‌ కుమార్‌ 9-0తో పాక్‌ ప్రత్యర్థి మహ్మద్‌ షరీ్‌ఫను మట్టికరిపించి చాంపియన్‌గా ఆవిర్భవించాడు. మహిళల ఫ్రీస్టయిల్‌ 50 కి. కేటగిరీలో పూజా గెహ్లాట్‌ కాంస్యం నెగ్గింది. క్రిస్టిలీ (స్కాట్లాండ్‌)తో కాంస్య పతక మ్యాచ్‌లో పూజ 12-2తో ప్రత్యర్థిని చిత్తు చేసి మూడో స్థానం కైవసం చేసుకుంది.మహిళల 76 కిలోల కాంస్య పోరులో పూజా సిహాగ్‌ 11-0తో నవోమి (ఆస్ట్రేలియా)ను చిత్తు చేసి పతకం చేజిక్కించుకుంది.  ఇక పురుషుల ఫ్రీస్టయిల్‌ 97 కేజీల కాంస్య మ్యాచ్‌లో 10-2తో తయాబ్‌ రజా (పాకిస్థాన్‌)పై గెలిచిన దీపక్‌ నెహ్రా భారత్‌ ఖాతాలో మరో పతకం జమ చేశాడు. 


రికార్డుల అవినాష్‌, ప్రియాంక

అంచనాలను నిలబెట్టుకుంటూ అథ్లెట్లు అవినాష్‌ సబ్లే (3వేల మీ. స్టీపుల్‌ చేజ్‌) ప్రియాంక గోస్వామి (10వేల మీ. రేస్‌వాక్‌) తమతమ విభాగాల్లో వ్యక్తిగత అత్యుత్తమ సమయాలు నమోదు చేసి రజత పతకాలతో సత్తాచాటారు. తద్వారా కామన్వెల్త్‌ క్రీడల ఈ రెండు క్రీడాంశాల్లో భారత్‌కు పతకాలు అందించిన అథ్లెట్లుగా చరిత్ర సృష్టించారు. పురుషుల మూడువేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో 27 ఏళ్ల సబ్లే ఎనిమిది నిమిషాల 11.20 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాదు తన జాతీయ రికార్డు (8:12.48)ను అతడు బద్దలుగొట్టాడు. కెన్యాకు చెందిన అబ్రహం (8:11.15) స్వర్ణం, అతడి సహచరుడు అమోస్‌ (8:16.83) కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.


మహిళల 10వేల మీటర్ల రేస్‌ వాక్‌లో 43 నిమిషాల 38.83 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో గమ్యం చేరిన ప్రియాంక కూడా రెండో స్థానం దక్కించుకుంది. జెమీమా (ఆస్ట్రేలియా, 42:34.30) స్వర్ణం, ఎమిలీ ఎన్‌గి (కెన్యా, 43:50.86) కాంస్య పతకం సాధించారు. ఈ విభాగంలో తలపడిన మరో భారత అథ్లెట్‌ భావనా జాట్‌ (47:14.13) వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కాగా..ఈ రెండు పతకాలతో కలిపి ఈసారి క్రీడల అథ్లెటిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. హైజం్‌పలో తేజస్విన్‌ శంకర్‌ కాంస్యం, లాంగ్‌జం్‌పలో మురళీ శంకర్‌ రజత పతకం నెగ్గిన విషయం విదితమే. 


లాన్‌బౌల్స్‌లో చరిత్ర..

లాన్‌బౌల్స్‌ పురుషుల ఫోర్స్‌లో భారత్‌కు చారిత్రక రజత పతకం లభించింది. ఫైనల్లో ..సునీల్‌ బహదూర్‌ (లీడ్‌), నవ్‌నీత్‌ సింగ్‌ (సెకండ్‌), చందన్‌ కుమార్‌సింగ్‌ (థర్డ్‌), దినేశ్‌ కుమార్‌ (స్కిప్‌)తో కూడిన భారత జట్టు 5-18తో నార్తర్న్‌ఐర్లాండ్‌ చేతిలో ఓడి రెండో స్థానం చేజిక్కించుకుంది. లాన్‌బౌల్స్‌లో మనకిది రెండో పతకం. ఉమెన్‌ ఫోర్స్‌లో భారత్‌ పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 


హుస్సాముద్దీన్‌.. కాంస్యంతో సరి

తెలుగు బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ (57 కిలోలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. సెమీస్‌లో హుస్సామ్‌ 1-4తో జోసెఫ్‌ (ఘనా) చేతిలో ఓడాడు. మహిళల 60 కిలోల సెమీ్‌సలో జాస్మిన్‌ 2-3తో పైగ్‌ రిచర్డ్‌సన్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడి కాంస్య పతకానికి పరిమితమైంది.

బాక్సింగ్‌

పసిడికి పంచ్‌ దూరంలో..

భారత బాక్సర్ల పంచ్‌ పవర్‌కు ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం పోటీల్లో తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ (50 కి.)తో పాటు నీతు ఘంగాస్‌ (48 కి.), అమిత్‌ పంగల్‌ (51 కి.) తమ విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి స్వర్ణానికి పంచ్‌ దూరంలో నిలిచారు. సెమీఫైనల్లో నిఖత్‌ 5-0తో ఇంగ్లండ్‌ బాక్సర్‌ స్టుబ్లే అల్ఫియా సవన్నాను చిత్తుగా ఓడించగా.. కెనడాకు చెందిన ప్రియాంక థిల్లాన్‌పై నీతు గెలిచింది. అమిత్‌ 5-0తో పాట్రిక్‌ (జాంబియా)పై గెలిచాడు. 


టేబుల్‌ టెన్నిస్‌

తుదిపోరుకు శరత్‌, శ్రీజ

టీటీలో వెటరన్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ రెండు విభాగాల్లో ఫైనల్‌ చేరి రెండు పతకాలు ఖాయం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో శరత్‌/సాథియాన్‌ జోడీ 3-2తో నికోలస్‌/ఫిన్‌ లూ (ఆస్ట్రేలియా)ను ఓడించింది. ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగమ్మాయి శ్రీజతో కలిసి ఫైనల్‌ చేరాడు. సెమీస్‌లో శరత్‌/శ్రీజ జంట 3-2తో ఆసీస్‌కు చెందిన నికోలస్‌/మిన్‌యంగ్‌పై గెలిచింది. కాగా, సింగిల్స్‌ సెమీస్‌లో శ్రీజ 3-4తో తియాన్‌ ఫెంగ్‌ (సింగపూర్‌) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో శరత్‌, సాథియాన్‌ సెమీస్‌ చేరారు. గత క్రీడల్లో 2 స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యంతో కలిపి నాలుగు పతకాలు సాధించిన స్టార్‌ క్రీడాకారిణి మనికా బాత్రా ఈసారి రిక్తహస్తాలతో ఇంటికి పయనమైంది. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో సెమీస్‌కు ముందే ఓటమిపాలైంది. 


మహిళల క్రికెట్‌

స్వర్ణ పోరుకు హర్మన్‌సేన

నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్‌ చేసిన ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా (4-0-28-2).. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టును ఫైనల్‌ చేర్చింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విక్టరీని నమోదు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఇంగ్లండ్‌ విజయానికి 14 పరుగులు కావాల్సి ఉండగా..  తొలి 5 బంతుల్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చిన రాణా.. ఓ వికెట్‌తో భారత గెలుపును ఖరారు చేసింది. ఆరో బంతికి ఎకిల్‌స్టోన్‌ సిక్స్‌ బాదినా.. అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 164/5 స్కోరు చేసింది. డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) రికార్డు అర్ధ శతకం సాధించగా.. జెమీమా (44 నాటౌట్‌) రాణించింది. మంధాన 23 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి.. టీ20ల్లో భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా మంధాన నిలిచింది. తొలి ఛేదనలో ఇంగ్లండ్‌ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 160 పరుగుల మాత్రమే చేసింది. కెప్టెన్‌ నటాలి స్కివర్‌ (41), డేనియల్‌ వ్యాట్‌ (35) పోరాడారు. 


బ్యాడ్మింటన్‌

సెమీస్‌లో సింధు, శ్రీకాంత్‌

స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ సింగిల్స్‌లో  సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో సింధు 19-21, 21-14, 21-18తో గో వీ జిన్‌ (మలేసియా)పై, శ్రీకాంత్‌ 21-19, 21-17తో టోబీ పెంటీ (ఇంగ్లండ్‌)పై, లక్ష్యసేన్‌ 21-12, 21-11తో జులియన్‌ (మారిషస్‌)పై గెలిచారు. ఇక, తొలిసారి కామన్వెల్త్‌లో పోటీపడ్డ యువ షట్లర్‌ ఆకర్షి కశ్యప్‌ క్వార్టర్స్‌లో ఓడింది. 


అథ్లెటిక్స్‌

మహిళల రిలేలో జ్యోతి బృందం ఫైనల్‌కు

భారత స్టార్‌ స్ర్పింటర్‌ హిమా దాస్‌ 200 మీటర్ల రేసులో ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. సెమీ్‌స-2లో హిమ 23.42 సెకన్ల టైమింగ్‌తో మూడోస్థానంలో నిలిచింది. మూడు సెమీ్‌సలలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. కాగా.. మహిళల 4్ఠ100 మీటర్ల రిలేలో తెలుగమ్మాయి జ్యోతి, ద్యూతీచంద్‌, హిమాదాస్‌, సర్బాని నందతో కూడిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. హీట్స్‌లో 44.46 సెకన్లతో రెండోస్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. 


స్క్వాష్‌

కాంస్యం కోసం దీపికా జోడీ

స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో దీపికా పళ్లికల్‌/సౌరవ్‌ జోడీ 0-2తో న్యూజిలాండ్‌ జంట జోలీ కింగ్‌/పాల్‌ కాల్‌ చేతిలో ఓటమిపాలైంది. దీంతో పళ్లికల్‌ జోడీ ఇక కాంస్య పతకం కోసం పోరాడనుంది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సెంథిల్‌/అభయ్‌ జోడీ ఓడిపోయి ఇంటిబాట పట్టింది. 

Updated Date - 2022-08-07T09:49:43+05:30 IST