Advertisement

నల్లనేల ఎర్ర వజ్రం

Oct 15 2020 @ 00:33AM

నిస్వార్థ కమ్యూనిస్టు నేత గుండా మల్లేశ్‌‌. బడుగు జనుల బాగు కోసం నిరంతరం తపించిన వ్యక్తి ఆయన. తెలంగాణ రాష్ట్రం, ప్రధానంగా తెలంగాణ కొంగు బంగారమైన నల్లనేల స్మరణలో సదా సజీవంగా ఉంటారు.


నిస్వార్థ కమ్యూనిస్టు నేత గుండా మల్లేశ్‌‌. 73 సంవత్సరాల వయసులో మరణించిన మల్లేశ్‌ జ్ఞాపకాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పేద ప్రజలను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ప్రజల వైపు, ప్రధానంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ధిక్కరించిన ఆ స్వరం ఇక లేదు. వ్యవసాయ కూలీలు, రైతులు, అసంఘటిత కార్మికులు, సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సీపీఐ కార్యదర్శి పదవి నుంచి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా మల్లేశ్‌‌ ఎదిగారు. నిజాయితీ పరుడైన నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి శాసనసభాపక్ష నేతగా ఉన్న గుండా మల్లేశ్‌‌ 1947 జూలై 14న ఒక రైతు కుటుంబంలో జన్మించారు. బెల్లంపల్లి పట్టణంతో మల్లేశ్‌‌కు విడదీయని అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ రంగంలోకి వచ్చిన సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా మల్లేశ్‌ ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొట్టమొదటి సారి 1983లో ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం వరసగా 1985, 1994, 2009లో ఆయన విజయం సాధించారు. 2009లో బెల్లంపల్లి నుంచి శాసనసభ్యుడిగా ఎంపికై సీపీఐ శాసనసభాపక్ష నేతగా కొనసాగారు. మొత్తం 8 సార్లు పోటీ చేసి నాలుగుసార్లు విజయం సాధించగా, నాలుగుసార్లు ఓటమి పాలయ్యారు.


మల్లేశ్‌ బెల్లంపల్లిలోనే పీయూసీ వరకు చదువుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రొఫెసర్‌ జయశంకర్‌, అసదుద్దీన్‌ ఓవైసీ, సీపీఐ నాయకుడు నారాయణతో కలిసి మల్లేశ్‌‌ శ్రీకృష్ణ కమిటీతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను కలిసిన అఖిలపక్ష బృందాలలో ఆయన ఉన్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్‌, జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, సింగరేణి జేఏసీ చైర్మన్‌గా నేను, ఇతర ప్రతిపక్ష పార్టీలతో, జర్నలిస్టులతో కలిసి సింగరేణిలో నిర్వహించిన తెలంగాణ సాధన సభలు, ఉద్యమాలలో మల్లేశ్‌‌ చురుగ్గా పాల్గొనేవారు. గుండా మల్లేశ్‌‌ 1969లో ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.


నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు మల్లేశ్‌ . తన పెళ్లి రోజున, ముహూర్తం దగ్గర పడుతున్న సందర్భంలో ఆయన బెల్లంపల్లి మార్కెట్‌లోని రామా టాకీసు ఎదుట తెలంగాణ సాధన కోసం కొనసాగుతున్న నిరహారదీక్షలో పాల్గొన్నారు. అప్పుడు ఆయనను అక్కడి నుంచి దీక్ష విరమింపజేసి తీసుకువచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. మల్లేశ్‌‌ ఎంతటి నిబద్ధత ఉన్న నాయకుడో ఈ ఒక్క సంఘటన స్పష్టం చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌)కు మల్లేశ్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేమిద్దరం కలిసి పలుమార్లు ప్రజాపోరాటాలలో పని చేశాం. 1979 జనవరి ౫న నాపై, ప్రముఖ ఏఐటీయుసీ నాయకుడు వీటీ అబ్రహాంపై భూస్వాముల గూండాలు దాడులు జరిపినప్పుడు మేము ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఆ మరుసటి రోజు మల్లేశ్‌‌ నాయకత్వంలో పెద్దఎత్తున కార్మికులు సమ్మెకు దిగి, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపారు. నలుగురు కార్మికలు అక్కడికక్కడే మరణించగా ఇద్దరు ఆ తర్వాత మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కాల్పుల నుంచి మల్లేశ్‌‌ తృటిలో తప్పించుకున్నారు. నాపై నిర్బంధాలు కొనసాగిన ఎన్నో సందర్భాల్లో గుండా మల్లేశ్‌‌, గుండా వెంకటి తదితరుల ఇళ్లల్లో తలదాచుకున్న రోజులెన్నో ఉన్నాయి. మల్లేశ్‌‌ సతీమణి గుండా సరోజా కార్యకర్తలను తన సొంత కుటుంబసభ్యుల్లా చూసుకునేవారు.


ఆకలితో ఇంటికి వెళ్ళిన వారికి అన్నం పెట్టకుండా పంపేవారు కాదు. ఇప్పటికీ మల్లేశ్‌‌ ఇల్లు అలాగే ఉంటుంది. వివిధ ఉద్యమాల్లో ఆయనతో కలిసి పని చేసిన సందర్భాలను నేను ఎన్నటికీ మరువలేను. మానవత్వం ఉన్న మహా కమ్యూనిస్టు నేత మల్లేశ్‌. ఆయన నిగర్వి. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, ఒక సారి శాసనసభా పక్ష నేతగా ఉన్నప్పటికీ ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. సామాన్య ప్రజలను నిత్యం కలిసేవారు. ఏ అర్థరాత్రి వెళ్ళి పిలిచినా పలికే, వెంట వచ్చే అజాతశత్రువు ఆయన. రాజకీయాలకు, పార్టీలకు, కార్మిక సంఘాలకు అతీతంగా ఆయన వ్యవహరించేవారు. అందరి మన్ననలు పొందిన నాయకుడు మల్లేశ్‌. ఆయన కోసం ఎవరైనా చెమటోడిస్తే వారికోసం రక్తమోడ్చే గుణం మల్లేశ్‌ది అంటే అతిశయోక్తి కాదు. పార్టీ కోసం, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అనారోగ్యంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నా జనంలోనే ఉండాలని భావించిన నాయకుడు. గత ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర సిపిఐ మహాసభలలో స్వచ్ఛందంగా ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడి పదవి నుంచి వైదొలగి ఆ అవకాశాన్ని మంచిర్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి కలవేని శంకర్‌కు ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నెల రోజుల క్రితం వరకు కూడా ఆయన కాగజ్‌నగర్‌, మంచిర్యాల, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, మందమర్రి తదితర చోట్ల జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసుపత్రిలో వారం రోజుల క్రితం చేరి చికిత్స చేయించుకుంటూ చావుబతుకుల మధ్య ఉన్నప్పటికీ జనం కోసం తాను బాగానే ఉన్నానని చేయి ఊపుతూ విడియోలు తీయించి వాటిని మిత్రులకు పంపించే ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలోని కార్మికవాడ మహమ్మద్‌ కాశీం బస్తీలో ఎప్పుడో జమానాలో నిర్మించుకున్న స్వంత ఇంటిలో ఆయన నివసించేవారు.


ఈ నిస్వార్థ నాయకుడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్రం, ప్రధానంగా తెలంగాణ కొంగు బంగారమైన నల్లనేల (కోల్‌బెల్ట్‌) స్మరణలో జీవించే ఉంటారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే కాకుండా, వరంగల్‌ ఖమ్మం జిల్లాలలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలలో మల్లేశ్‌ పాల్గొన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిపుత్రులకు పట్టాలు ఇవ్వాలని, భూమి హక్కు కల్పించాలని ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీ వేదికగా డిమాండ్‌ చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కోసం, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో జలసాధన కోసం ఎన్నో పోరాటలలో ఆయన పాల్గొన్నారు. పేదోడికి పట్టెడన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉన్నట్లు అని ఆయన తరచు అనేవారు.


ఎండి. మునీర్‌

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.