ఆ కంపెనీ మాకొద్దు

ABN , First Publish Date - 2022-08-18T06:26:52+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడిలో నిర్మిస్తున్న గోదావరి బయో కెమికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని బాధిత ప్రజలు ఆందోళనకు దిగారు. ఆటోలలో సాధారణ ప్రయాణికుల మాదిరి రాజమహేంద్రవరం చేరుకున్న ఆరు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకున్నారు.

ఆ కంపెనీ మాకొద్దు
రోడ్డుపై ఆందోళనకారులు

  గోదావరి బయో కెమికల్‌  వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై పెల్లుబికిన నిరసన
  తిరగబడ్డ ఆరు గ్రామాల ప్రజలు
  రాజమహేంద్రవరంలో ఆందోళన
  ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ముట్టడి
  కలెక్టర్‌ హామీతో  విరమణ

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 17: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడిలో నిర్మిస్తున్న గోదావరి బయో కెమికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని బాధిత ప్రజలు ఆందోళనకు దిగారు. ఆటోలలో సాధారణ ప్రయాణికుల మాదిరి రాజమహేంద్రవరం చేరుకున్న ఆరు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకున్నారు. ఆ సమయంలో రాష్ట్ర అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ మాధవీలత, జిల్లా అధికారులు సమీక్ష సమావేశం జరుగుతోంది. దీంతో బాధిత ప్రజలను వారి ప్రతినిధులను అతిథిగృహంలోకి అనుమతించలేదు. సుమారు అర్ధగంట పైబడి బయట ఉన్న వారు.. తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదంటూ నిరసన చేపట్టారు. ప్రదర్శనగా సెంట్రల్‌జైలు రోడ్డు జంక్షన్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. సుమారు గంటపాటు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు లక్ష్మి, చక్రపాణి తదితరులు మాట్లాడారు. నాలుగు ఎకరాల్లో గోదావరి బయో కెమికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (మెడికల్‌ వ్యర్థాల పరిశ్రమ) నిర్మిస్తున్నారని, దీని వల్ల చుట్టుపక్కల మర్రిపూడి, పెదబ్రహ్మదేవం, ఆర్‌బీ కొత్తూరు, జి.మేడపాడు, జి.కొత్తూరు, కొండపల్లి గ్రామాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు దెబ్బతింటాయని, చెరువులు, కాలువలు, అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ పాడైపోతుందన్నారు. భవిష్యత్‌లో వ్యవసాయ పనులు ఉండవన్నారు. కూలీ పనులు చేసుకునే తామంతా రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే అనపర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని అయినా నిర్మాణాలు ఆగలేదన్నారు. గతంలో కాకినాడ కలెక్టరేట్‌లో కూడా అప్పటి కలెక్టర్‌కు విన్నవించామన్నారు.  ఆ పరిశ్రమ నిర్మించాలనుకుంటే తమ శవాలపై నిర్మించుకోవాలని అంతే తప్పా ఎట్టి పరిస్థితుల్లోను నిర్మాణానికి అనుమతించేది లేదని హెచ్చరించారు. తక్షణమే అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత స్పందించాలని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. పంట పొలాల మధ్య గోదావరి బయో కెమికల్‌  వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమకు ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందని వారు ప్రశ్నించారు. నిర్మాణం ఆపే వరకు వెనక్కి తగ్గబోమన్నారు. అనంతరం అక్కడ నుంచి ఆర్‌అండ్‌డీ అతిథిగృహానికి బాధిత ప్రజలు చేరుకున్నారు. అయితే అప్పటికీ మీటింగ్‌ అవ్వకపోవడం, కలెక్టర్‌ బయటకు రాకపోవడంతో మళ్లీ ఆందోళన చేశారు. కొందరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద, మరికొందరు సెంట్రల్‌ జైలు రోడ్డులో నిరసనలతో హోరెత్తించారు. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందిని దింపారు. అడిషనల్‌ ఎస్పీ నుంచి డీఎస్పీల వరకు అందరూ అక్కడకు చేరుకున్నారు. అయితే కలెక్టర్‌ హామీతో ప్రజలు ఆందోళన విరమించడంతో పరిస్థితి చక్కబడింది. పోలీసులు సమన్వయంతో వ్యవహరించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. గోదావరి బయో కెమికల్‌  వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌  పరిశ్రమ  (మెడికల్‌ వ్యర్థాల పరిశ్రమ) నిర్మాణం విషయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ మాధవీలత అన్నారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద బాధిత గ్రామాల ప్రజలతో కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ఈనెల 26వ తేదీ వరకు పనులు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ పరిశ్రమకు సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఈనెల 26న హియరింగ్‌ ఉందని, ఆ రోజు ఎన్‌జీటీ తీర్పును అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. గతంలో గ్రామ సభలు నిర్వహించామని, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి శాఖ అనుమతులు ఇవ్వడంతో పరిశ్రమ నిర్మాణం జరుగుతోందన్నారు. అయితే బాధిత ప్రజలు వారి గ్రామాల్లో పంటపొలాలు దెబ్బతింటాయని అక్కడ పరిశ్రమ నిర్మించ వద్దని చేసిన వినతి మేరకు పనులు నిలుపుదల చేశారని ఎన్‌జీటీ తీర్పు మేరకు చర్యలు ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2022-08-18T06:26:52+05:30 IST