పరిహారం, ధిక్కారం

ABN , First Publish Date - 2020-09-03T08:19:48+05:30 IST

వస్తు,సేవల పన్ను (జిఎస్‌టి) పరిహారం సమస్య కేంద్ర–రాష్ట్ర సంబంధాల సమస్యగా రూపం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం గత వారం చేసిన ప్రతిపాదనలకు...

పరిహారం, ధిక్కారం

వస్తు,సేవల పన్ను (జిఎస్‌టి) పరిహారం సమస్య కేంద్ర–రాష్ట్ర సంబంధాల సమస్యగా రూపం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం గత వారం చేసిన ప్రతిపాదనలకు వ్యతిరేకత ప్రధానంగా ప్రతిపక్ష ప్రభుత్వాల నుంచే వస్తున్నందున, ఇది రాజకీయ రూపం కూడా తీసుకుంటున్నది. జిఎస్‌టి బిల్లును ఆమోదించే విషయంలో, తక్కిన రాష్ట్రాల కంటె ముందుగా ఉత్సాహం ప్రదర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు, పన్ను పరిహారం విషయంలో కేంద్రం వైఖరిని, ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌, బెంగాల్‌, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే తమ వ్యతిరేకతను ప్రకటించాయి. జిఎస్‌టి పరిహారం రాష్ట్రాలకు చెల్లించవలసిందే అన్న వైఖరితో జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశానికి వెళ్లినా, మంత్రి చేసిన ప్రతిపాదనలపై మాత్రం ఇంకా స్పందించనే లేదు. కేంద్రం చెప్పిన షరతులకు అంగీకరించి, రుణసామర్థ్యాన్ని పెంచుకుంటే చాలునన్న ధోరణి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కనిపిస్తున్నది.


పాత పన్నుల వ్యవస్థ స్థానంలో వస్తు, సేవల పన్నును ప్రవేశపెట్టినప్పుడు, కొత్త వ్యవస్థలోకి మారే దశలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని భావించారు. జిఎస్‌టిలో 42 శాతం రాష్ట్రాల పన్ను ఆదాయమే. రాష్ట్రాల మొత్తం ఆదాయంలో 60 శాతం దాకా ఆ పన్నుల నుంచే లభించేది. జిఎస్‌టి వచ్చిన తరువాత, పెట్రోలియం, ఆల్కహల్‌, స్టాంప్‌ డ్యూటీ మినహా తక్కిన పన్ను విధింపు అధికారాలన్నీ పోయాయి. జిఎస్‌టి (రాష్ట్రాలకు నష్టపరిహారం) చట్టం, 2017 ప్రకారం, కొత్త పన్నుల వ్యవస్థలోకి మారే సంధికాలం ఐదేళ్లలో, అంటే 2022 దాకా, రాష్ట్రాలు తాము నష్టపోయే పన్ను ఆదాయానికి పరిహారం ఖాయంగా లభిస్తుంది. 2015–16 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని 14 శాతం వార్షిక వృద్ధి రేటును లెక్కిస్తూ, జిఎస్‌టి ఆదాయానికి, రక్షిత ఆదాయానికి మధ్య ఉన్న అంతరాన్ని పన్ను నష్టంగా పరిగణిస్తారు. ఈ నష్టం చెల్లింపుల కోసం జిఎస్‌టి పై పరిహారపు సుంకం విధిస్తారు. ఆ సుంకం కూడా 2022 దాకా కొనసాగుతుంది. ఆదాయం–నష్టం మదింపు రెండు నెలలకో సారి జరుగుతుంది.


ఇప్పుడు కేంద్రం ఈ పరిహారాన్ని చెల్లించను పొమ్మంటున్నది. ఆర్థికంగా ఇబ్బందులుంటే, రాష్ట్రాలే మార్కెట్‌ నుంచి అప్పు తీసుకోండి అంటున్నది. పరిహారాన్ని చెల్లించడంలో ఇబ్బంది ఈ కరోనా కాలంలో మొదలయిందనుకుంటే, పొరపాటు. 2019 ఆగస్టులోనే సమస్య మొదలయింది. ఆగస్టు–సెప్టెంబర్‌ మాసాలకు ఇవ్వవలసిన పరిహారం ఆలస్యమయింది. సెప్టెంబర్‌లో గోవాలో జరిగిన 37వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో ప్రభుత్వం చెల్లించలేని అశక్తతను ప్రకటించింది. ఆ రెండు నెలల బకాయిని డిసెంబర్‌లో చెల్లించారు. తరువాతి రెండు నెలల చెల్లింపులను 2020 ఫిబ్రవరిలో చెల్లించారు. డిసెంబర్‌–జనవరి నెలలది మొన్న జూన్‌లో చెల్లించారు. ఇంతలో కరోనా సన్నివేశం అవతరించి, మునుపే మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు లాక్‌డౌన్‌ను రుచిచూపింది. అనేక రాష్ట్రాలు దివాలా దశలో ఉన్నాయి. జీతాలు కూడా చెల్లించే స్థితిలో లేవు. పన్ను వసూళ్లే తగ్గిపోతున్నాయి. అంతో ఇంతో డబ్బు పోగేసుకున్న కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వకపోతే ఎట్లా? ఆగస్టు 27 నాడు జరిగిన తాజా జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో ఆ ప్రశ్న వేద్దామనే రాష్ట్రాలు వెళ్లాయి. కానీ, కరోనా ‘దైవకృత్యం’ అంటూ మంత్రి నిర్మలా సీతారామన్‌ పిడుగుపాటు లాంటి వ్యాఖ్య చేశారు. ఈ ఉపద్రవం, గత్తర దేవుడి కార్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చర్చ. ఆ వ్యక్తీకరణ పరిహారాల చెల్లింపుల విషయంలో వాడే   ఒక న్యాయపరిభాష. బీమా సేవలు అందించే కంపెనీలు పెద్ద ఉపద్రవాల సందర్భంగా పరిహారం నుంచి తప్పించుకోవడానికి చెప్పే కారణం. దైవకృత్యాలకు పరిహారం లభించదు. 


అంటే, పన్నురాబడి నష్టానికి పరిహారం ఇవ్వబోము. కావాలంటే అప్పు తీసుకోండి, ఏర్పాటు చేస్తాము. 14 శాతం వృద్ధి రేటును లెక్కించడం కుదరదు. పదిశాతమే లెక్కిస్తాము. మొత్తం లెక్కించే జిఎస్‌టి పరిహారం మొత్తం కాదు, అందులో కొంత భాగం మాత్రమే అప్పుగా తీసుకోవచ్చు. ఇంకా అవసరమైతే, షరతులు లేకుండా 0.5 శాతం అదనంగా రుణసదుపాయాన్ని అనుమతిస్తాము. 


దీనికి రాష్ట్రాలు వేయవలసిన ఎదురు ప్రశ్న– రుణం మేమెందుకు తీసుకోవాలి? కేంద్రమే ఎందుకు అప్పు తీసుకుని రాష్ట్రాల బాకీ చెల్లించదు? తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సరిగా ఆ ప్రశ్నే వేశారు. పరిహారం ఎగవేయడం కానీ, వృద్ధి రేటు ప్రాతిపదికను తగ్గించడం కానీ అంగీకారయోగ్యం కాదని ఆయన నీళ్లు నమలకుండా చెప్పేశారు. కేరళ, బెంగాల్‌ రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఇంతే స్పష్టమైన వైఖరి తీసుకున్నాయి. ఇది కేంద్ర– రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన సమస్య. రాష్ట్రాల పరిధిని, అధికారాలను తగ్గించి, దేశమంతా ఒకే ఛత్రాన్ని విస్తరింపజేయాలని ఆశిస్తున్న కేంద్రం ఉన్న చోట, ఇది అస్తిత్వానికి సంబంధించిన సమస్య కూడా. 


దేశమంతటికీ మూకుమ్మడి వ్యవస్థలను సృష్టించడంలో ఉన్న ప్రమాదం ఏమిటో జిఎస్‌టి అనుభవం తెలియజేస్తున్నది. ఒకే దేశం అయినందువల్ల కొన్ని అంశాలలో ఒకే అనుసంధాన వ్యవస్థ ఉండవచ్చు. కానీ, అనేక పాలనాంశాలలో సువిశాల దేశానికి వికేంద్రీకృత విధానమే మేలయినది. జిఎస్‌టి పరిహారం విషయంలో కేంద్రం వైఖరిని ప్రధానంగా వ్యతిరేకిస్తున్నది ప్రాంతీయ పార్టీలూ, ఒకే ప్రాంతానికి పరిమితమైన జాతీయ పార్టీలు మాత్రమే. కేంద్రంలోని అధికారపార్టీకి చెందినంత మాత్రాన, లేదా కేంద్రంతో స్నేహమో, కేసులను తిరగతోడుతుందన్న భయమో ఉన్నంత మాత్రాన రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించడం మంచిది కాదు.

Updated Date - 2020-09-03T08:19:48+05:30 IST