ప్రాణానికి.. ఏదీ బీ(ధీ)మా!

ABN , First Publish Date - 2021-05-05T05:19:46+05:30 IST

..ఇలా జిల్లావ్యాప్తంగా వేలాదిమంది రైతులు పశుబీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో చాలామంది రైతులు పాడి పరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. కానీ ప్రభుత్వపరంగా ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం అందడం లేదు.

ప్రాణానికి.. ఏదీ బీ(ధీ)మా!
మృతిచెందిన ఆవు (ఫైల్‌)


పాడి రైతులకు అందని పరిహారం

ఏడాదిన్నరగా బాధితుల ఎదురుచూపు

పట్టించుకోని అధికారులు

(కవిటి)

- కవిటి మండలం జగతి గ్రామానికి చెందిన లమ్మత ప్రభాకరరావు పాడి రైతు. రెండు ఆవులను పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దురదృష్టవశాత్తూ ఏడాది కిందట అనారోగ్యంతో రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.80 వేలు విలువచేసే పశువులకు బీమా చేసినప్పటికీ పరిహారం ఇంతవరకూ అందలేదు. ప్రభుత్వం నుంచి పరిహారం అందిన వెంటనే పశువులు కొనుగోలు చేయడానికి ఆశగా ఎదురు చూస్తున్నాడు. 

- జగతి గ్రామానికి చెందిన బావన సీతారామ్మూర్తి పాడిరైతు. ఏడాది కిందట ఉన్న ఒక్క ఆవు అనారోగ్యంతో మృత్యువాత పడడడంతో ఆయనకు ఉపాధి లేకుండా పోయింది. ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. పశువుకు బీమా చేసినా పరిహారం మంజూరు కాలేదు. స్థానికంగా పశు వైద్యాధికారి లేకపోవడంతో సమాధానం చెప్పేవారు ్జ్జకరువయ్యారు. 

..ఇలా జిల్లావ్యాప్తంగా వేలాదిమంది రైతులు పశుబీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో చాలామంది రైతులు పాడి పరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. కానీ ప్రభుత్వపరంగా ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం అందడం లేదు. గ్రామ సచివాలయాల్లో పశుసంవర్థక సహాయకులను నియమించి మెరుగైన సేవలందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. గత ప్రభుత్వాలు పశు పోషణకు ప్రోత్సాహమందించేవి. బ్యాంకులు కూడా వివిధ పథకాల్లో భాగంగా రుణ రాయితీలు ఇచ్చేవి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి దేశవాళీ మేలుజాతి ఆవులను రైతులు కొనుగోలు చేస్తున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి  జెర్సీ, ఒంగోలు వంటి మేలుజాతి ఆవులను తెప్పించి రైతులకు అందిస్తున్నారు. కానీ ఇక్కడ వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక ఎక్కువ శాతం పశువులు మృత్యువాత పడుతున్నాయి. జన్యు సంబంధమైన సమస్యలతో ఈత సమయంలో ఆవులతో పాటు దూడలు మృతి చెందుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం పశుబీమా పథకాన్ని ప్రారంభించింది. రైతులు బీమా కడితే పశువులు మృత్యువాత పడిన వెంటనే పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీమా పరిహారం చెల్లింపులు నిలిచిపోయాయి.  పశుసంవర్థక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఆవులు, గేదెలు 6,36,000 ఉన్నాయి. 2019 నవంబరు తరువాత జిల్లాలో 4,200 పశువులు మృత్యువాత పడ్డాయి. కానీ ఇప్పటివరకూ బీమా పరిహారం అందలేదు.

అందని ద్రాక్షగా పశువైద్యం... 

గ్రామ సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ సహాయకులను నియమించినా, పశువైద్యం అందని ద్రాక్షగా మిగులుతోంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో గోపాలమిత్రలే దిక్కు. కొన్ని మండలాల్లో పశువైద్యాధికారులు లేరు. అక్కడున్న దిగువ స్థాయి సిబ్బంది సేవలందిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పశువులు అనారోగ్యానికి గురైతే రైతులు పడే బాధలు వర్ణణాతీతం. గతంలో గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు సైతం నిర్వహించేవారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖలతో పశుసంవర్థక శాఖలు సైతం సీజన్ల వారీగా శిబిరాలు నిర్వహించి వైద్యసేవలందించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పశువైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పశు వైద్యం మెరుగుపరచడంతో పాటు, పరిహారం అందజేసేలా చర్యలు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు. 


పశు పోషణ భారం

ప్రస్తుతం పశు పోషణ కష్టతరంగా మారింది. గ్రాసం, దాణా ధరలు గణనీయంగా పెరిగాయి. వరి సాగులో యాంత్రీకరణతో పశుగ్రాసం దొరక్కుండా పోతోంది. యంత్రాలతో నూర్పులు చేయడంతో వరి గడ్డి ధ్వంసమవుతోంది. పశువుల తిండికి పనికి రాకుండా పోతోంది. గతంలో రైతులు చిన్న మిల్లుల్లో ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేవారు. ఏడాది పొడవునా ఈ ప్రక్రియ సాగేది. దీంతో తవుడు (దాణా) పుష్కలంగా లభించేంది. ఇప్పుడు ఎక్కువ మంది రైతులు పెద్ద మిల్లులను ఆశ్రయిస్తున్నారు. ఏడాదికి సరిపడా బియ్యం కోసం ఒకేసారి మిల్లింగ్‌ చేస్తున్నారు. పెద్ద మిల్లుల్లో తవుడు కూడా ఎక్కువగా లభించదు. దీంతో దాణా కొరత వెంటాడుతోంది. బయట మార్కెట్‌లో కొనుగోలు చేద్దామంటే ధర అధికంగా ఉంటోంది. 


 త్వరలో చెల్లిస్తాం

పశు బీమాకు సంబంధించి రూ.కోటి నిధులు విడుదలయ్యాయి. త్వరలో బాధిత రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తాం. ప్రాధాన్య క్రమంలో ప్రక్రియను పూర్తిచేస్తాం. పశు వైద్యాధికారుల లాగిన్‌లో ఉన్న పేర్లను కలెక్టర్‌కు సమర్పించి పరిహారం చెల్లిస్తాం. జిల్లా వ్యాప్తంగా 18 పశువెద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే వాటిని భర్తీచేస్తాం. 

 - డాక్టర్‌ ఈశ్వరరావు, జాయింట్‌ డైరెక్టర్‌, శ్రీకాకుళం



Updated Date - 2021-05-05T05:19:46+05:30 IST