రైతులందరికీ పరిహారం ఇవ్వాల్సిందే..!

ABN , First Publish Date - 2022-07-05T06:19:32+05:30 IST

జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం ఇవ్వాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు.

రైతులందరికీ పరిహారం ఇవ్వాల్సిందే..!
కలెక్టరేట్‌ వద్దకు పాదయాత్రగా వస్తున్న సీపీఎం నేతలు, శ్రేణులు

- వైసీపీ పాలనలో అన్నివర్గాలకు ఇబ్బందులు

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు 

అనంతపురం టౌన జూలై 4: జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం ఇవ్వాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ‘ఇంటింటికీ సీపీఎం.. జనంకోసం సీపీఎం’ కార్యక్రమం చివరి రోజు కార్యాక్రమానికి ఆయన హాజరయ్యారు. నెల రోజుల పాటు జిల్లాలో రైతు, ప్రజా సమస్యలను తెలుసుకున్న అనంతరం, సోమవారం గుత్తి రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నెల రోజుల తమ కార్యక్రమంలో కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చాయని అన్నారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టామని అన్నారు. 


- కమ్యూనిస్టులు ఎన్నికల్లో గెలవలేరని ఎర్రజెండాల ఉద్యమాన్ని ఎగతాలి చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ అన్నారు. తాము గెలవలేకపోయినా, ఓడించే సత్తా ఉన్నవాళ్లమని పాలకులకు హెచ్చరించారు. గత ఏడాది అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బీమా అందరికీ ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. బీమా అందని రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి  రూ1.50 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, ఇది ఏమాత్రం సరిపోదని, మరింత పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లను నిర్మించుకోకపోతే పట్టాలను రద్దు చేస్తామని బెదిరించడం సరికాదని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పజెప్పకనే వడ్డీ కట్టాలని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని అన్నారు.


- రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర నాయకుడు ఓబులు మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలోని 23 మండలాలలో వేరుశనగ రైతులకు బీమా పరిహారం రాలేదని అన్నారు. వారికి న్యాయం చేయాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాలరంగయ్య, నల్లప్ప, సావిత్రి, నాగేంద్రకుమార్‌, నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి తదిరులు  పాల్గొన్నారు. 




Updated Date - 2022-07-05T06:19:32+05:30 IST