సామాజిక పట్టు కోసం పోటాపోటీ

ABN , First Publish Date - 2021-10-09T04:24:51+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే పాలమూరు రాజకీయాల్లో సెగ మొదలైంది. తెలంగాణ రాష్ట్రమొచ్చాక గులాబీ పార్టీకి కంచుకోటగా మారిన ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్‌ రంగంలోకి దిగింది.

సామాజిక పట్టు కోసం పోటాపోటీ

బీసీల కోసం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

సంక్షేమం, రాజకీయ అవకాశాలతో టీఆర్‌ఎస్‌ పట్టు

పాలమూరు గత చరిత్ర నుంచి నూతన వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్‌

బలమైన వర్గాల కోసం రెండు పార్టీల కుస్తీ

బలోపేతానికి కాంగ్రెస్‌ పావులు

పాలమూరులో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు


 అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే పాలమూరు రాజకీయాల్లో సెగ మొదలైంది. తెలంగాణ రాష్ట్రమొచ్చాక గులాబీ పార్టీకి కంచుకోటగా మారిన ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్‌ రంగంలోకి దిగింది. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం టీడీపీకి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చుకోవడం ద్వారా ఉమ్మడి జిల్లాపై ఆధిపత్యం సాధించేందుకు చేతి గుర్తు పార్టీ వ్యూహం పన్నుతోంది. బీసీల్లో కీలక వర్గాలను తమవైపు తిప్పుకోవడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే దిశగా కార్యాచరణ అమల్లోకి తెస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఈ నెల 12న మహబూబ్‌నగర్‌లో జరిగే విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ సందర్భంగా కాంగ్రెస్‌లో కీలక నాయకులను చేర్చుకోవడం ద్వారా ఆయా వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నామనే సంకేతాలు పంపేందుకు ఆ పార్టీ సిద్ధమౌతుండగా, తమవెంట నడుస్తున్న వర్గాలను కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహం రచిస్తోంది.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు పాలమూరులో పార్టీలు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. ఆ మేరకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మారిన రాజకీయ సమీకరణాల్లో బలమైన, ప్రభావం చూపగలిగిన ఓటు బ్యాంకు గల సామాజిక వర్గాలు క్రమేపీ అధికార టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యాయి. ఆయా వర్గాలను ఆకర్షించేలా పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడంతో పాటు ఆయా వర్గాల ప్రతినిధులకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లుగా, జడ్పీ చైర్‌పర్సన్లుగా, మునిసిపల్‌ చైర్‌పర్సన్లుగా రాజకీయ అవకాశాలు సైతం కల్పించడం ద్వారా వారు తమవైపే ఉండేలా టీఆర్‌ఎస్‌ చూసుకుంటోంది. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరులో సైతం బలమైన ఓటు బ్యాంకు కలిగిన యాదవ, గౌడ్‌, ముదిరాజ్‌, బోయవాల్మీకి వంటి కీలక సామాజిక వర్గాలకు రాజకీయంగా టీఆర్‌ఎస్‌లో బలమైన ప్రాతినిధ్యం దక్కింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవుల్లో బోయ, ముదిరాజ్‌, లింగాయత్‌ వర్గాలకు ప్రాతినిధ్యముండేలా మూడు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను జిల్లా నాయకులకు కట్టబెట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాలో జడ్పీ చైర్‌పర్సన్‌గానూ మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలికి అవకాశం కల్పించారు. ఇలా కీలకమైన రాజకీ య పదవులను ఇవ్వడం ద్వారా ఆయా సామాజిక వర్గాలను ప్రభావితం చేసే నాయకులను తమ శిబిరంలోనే ఉండేలా టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలు అమలు చేస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తోన్న కాంగ్రెస్‌ అధిష్టానం ఆయా వర్గాల్లోకి చొచ్చుకెళ్లడం ద్వారా టీఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇవ్వాలనే రీతిలో వ్యూహం పన్నుతోంది. అందుకనుగుణంగా రాజకీయ మార్పిడులకు, పథకాల రూపకల్పనకు నడుంకడుతున్నట్లు తెలుస్తోంది.


ప్రజా కూటమి అభ్యర్థులు పరాజయం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు వరకు టీడీపీతోనే ఎక్కువ అనుసంధానమైన యాదవ, గౌడ్‌, ముదిరాజ్‌, బోయవాల్మీకి వర్గాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యాయి. 2018 ఎన్నికల సమయంలో చివరి దశలో ఈ వాస్తవాన్ని గ్రహించిన ప్రజాకూటమి, బీజేపీ ద్వారా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలను ఆయా వర్గాలకు ఇచ్చి, దగ్గరవ్వాలనే ఆలోచన చేసినా సమయం తక్కువ ఉండడం, పొత్తుల ప్రభావం, బలమైన అభ్యర్థులకు అనుకూలమైన స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వలేకపోవడం వంటి కారణాలతో టీఆర్‌ఎస్‌ని ఢీకొట్టలేక పోయారు. 


టీఆర్‌ఎస్‌ నుంచి మూడు చోట్లా విజయం

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ నుంచి మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, కల్వకుర్తి నుంచి వరుసగా రెండోసారి బీసీలకు టిక్కెట్లివ్వగా మూడుచోట్లా అభ్యర్థులు గెలిచారు. మహబూబ్‌నగర్‌ నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌గౌడ్‌కు సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగానూ అవకాశం దక్కింది. ప్రజాకూటమి నుంచి చివరి నిమిషంలో మహబూబ్‌నగర్‌ నుంచి ఎర్రశేఖర్‌(టీడీపీ), నారాయణపేట నుంచి సరాఫ్‌ కృష్ణకు అవకాశమిచ్చినా వేర్వేరు కారణాలతో వారు గెలవలేకపోయారు. బీజేపీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఆరు స్థానాల్లో బీసీలకు పోటీ అవకాశమొచ్చినా, ఒక్కచోటా విజయం సాధించలేకపోయారు. కల్వకుర్తిలో ఆచారి ఎప్పట్లానే బలమైన పోటీ ఇచ్చారే తప్ప విజయాన్ని అందుకోలేకపోయారు.


పార్టీ బలోపేతమే కాంగ్రెస్‌ వ్యూహం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమనే ఏకైక లక్ష్యంతో పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. పార్టీకి దశాబ్దాలుగా దూరంగా ఉంటోన్న కీలక సామాజిక వర్గాలను దగ్గర చేసుకోకుండా టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టడం సాధ్యం కాదనే వాస్తవాన్ని గ్రహించి బలమైన వ్యూహాన్ని తెరమీదకు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఏ పార్టీలో ఉన్నా వారిని దగ్గరకు తీయడం, ఆయా వర్గాల విద్యావంతులు, విద్యార్థులు, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారిని రాజకీయాల్లోకి ఆహ్వానించడం, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్‌ కంటే ఘనమైన పథకాలిస్తామనే హామీల ద్వారా చొచ్చుకెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో పార్టీలో కొత్త, పాత నాయకుల మధ్య వర్గవిబేధాలు రాకుండా ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. రాష్ట్రం యూనిట్‌గానే ఎమ్మెల్యే టిక్కెట్ల పంపిణీ ఉంటుందని, ఏ ఒక్కరికో, యే నాయకుడి హామీతోనే పోటీ చేసే అవకాశం రాదని స్పష్టం చేస్తోంది. పార్టీలో క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తూ, నియోజకవర్గంలో పట్టు సాధించే వారికే పోటీ అవకాశముంటుందని, పలు వడపోతల తర్వాతే అభ్యర్థి ఎంపిక జరుగుతుందనే బలమైన సందేశాన్ని హైకమాండ్‌ ఇప్పటికే కీలక నాయకులకు స్పష్టం చేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల చేరిక సందర్భంగా అప్పటికే పనిచేస్తోన్న వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని పార్టీ ముఖ్యులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమతుల్యత సాధించే క్రమంలోనే సంబంధిత వర్గాల నాయకులను పార్టీలోకి తీసుకురావడం జరుగుతుందని, దీన్ని పార్టీ బలోపేతానికి  తీసుకుంటున్న చర్యగా చూడాలే తప్ప వర్గవిబేధాలకు అవకాశమిస్తున్నట్లు కాదని అధిష్టాన ముఖ్యులు చెబుతున్నారు.


ఎర్ర శేఖర్‌నిను చేర్చుకునేందుకు రంగం సిద్ధం

తాజా ఎత్తగడల్లో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాలమూరు పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోనూ మరో కీలక బీసీ నాయకుడిని పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరితో పాటు కొల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన జగదీశ్వర్‌రావు, ఉపాధ్యాయ, నిరుద్యోగ సంఘాల నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి సైతం ఈ నెల 12న కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. మిడ్జిల్‌కు చెందిన ఎంపీపీ కాంతమ్మ జడ్చర్ల కోఆర్డినేటర్‌ అనిరుధ్‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరారు. మొత్తంగా బీసీ వర్గాలపై కన్నేసిన పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన, ఆతర్వాత పాలమూరులో కీలక రాజకీయ మార్పులకు నాంది పలకబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో కాకపుట్టిస్తుంటే, అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీలు రేవంత్‌ వ్యూహానికి తిరుగు వ్యూహం పన్నేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలమూరులో భవిష్యత్‌ రాజకీయాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే చర్చ సాగుతోంది.

Updated Date - 2021-10-09T04:24:51+05:30 IST