అవార్డులకు పోటీ

ABN , First Publish Date - 2022-09-24T05:31:43+05:30 IST

పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం ఏటా గ్రామ పంచాయతీల పనితీరు ఆధారంగా అవార్డులను ప్రకటిస్తుంది.

అవార్డులకు పోటీ
చందాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం

- పంచాయతీ రాజ్‌ అవార్డులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. 

- అక్టోబరు 31వ తేదీ వరకు చివరి గడువు 

- అభివృద్ధే ఆధారంగా ఎంపిక 

- అవార్డు సొంతమైతే కేంద్రం నుంచి  మరిన్ని నిధులు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, సెప్టెంబరు 23: పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం ఏటా గ్రామ పంచాయతీల పనితీరు ఆధారంగా అవార్డులను ప్రకటిస్తుంది. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం నిధులను మంజూరు చేస్తుంటాయి. వీటితో పాటు పన్నుల ద్వారా కూడా  పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది.  వచ్చిన నిధులను వినియోగించుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎంత మేరకు పురోగతి సాధించాయి వంటి పలు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్రం అవార్డులను ప్రకటిస్తుంది. అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి అవార్డులను గెలుచుకున్న గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. 

 సమగ్రాభివృద్ధే అవార్డుకు ఆధారం 

దేశాభివృద్ధి గ్రామాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. పల్లెల అభివృద్ధిని విస్మరించి దేశ అభివృద్ధికి బాటలు వేయడం అనేది నిరర్ధకం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించాయి. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి ప్రతీ నెలా జనాభా ఆధారంగా ప్రభుత్వం నుంచి పల్లె ప్రగతి నిధులు, కేంద్రం నుంచి మరికొన్ని నిధులు, పన్నుల రూపంలలో ఆదాయం సమకూరుతోంది. కేంద్రం అందించే పురస్కారాలకు ఎంపిక కావాలంటే గ్రామాలు తొమ్మిది అంశాల్లో అభివృద్ధిని కనబరచాల్సి ఉంటుంది.  పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి,  సామాజిక భద్రత, సుపరిపాలన, ఆరోగ్యవంతమైన గ్రామం, పిల్లల స్నేహపూర్వక పంచాయతీ, మహిళల అభ్యున్నతికి ప్రోత్సాహం, సరిపడా తాగునీటి లభ్యత, స్వచ్ఛమైన హరిత గ్రామం  స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించి ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవాలి. ఈ అంశాల్లో మెరుగైన ప్రగతిని సాధించిన గ్రామాలకు పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ దినోత్సవ వేడుకల్లో పురస్కారాలు అందజేస్తుంది.   అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే బాధ్యతను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకే అప్పజెప్పింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 31 చివరి గడువుగా నిర్దేశించింది.  ముందుగా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి పురస్కారాల కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. అనంతరం వెబ్‌సైట్‌లో వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఈ వివరాలన్నీ మండల స్థాయి అధికారుల లాగిన్‌లోకి, అక్కడి నుంచి జిల్లా స్థాయి అధికారుల లాగిన్‌లోకి వెళ్తాయి. జిల్లా స్థాయి అధికారులు పరిశీలించిన తరువాత రాష్ట్ర పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ లాగిన్‌లోకి పంపుతారు. అక్కడి నుంచి జాతీయ అవార్డులకు కేంద్రానికి సిఫారసు చేస్తారు.  


Updated Date - 2022-09-24T05:31:43+05:30 IST