తెలంగాణలోనూ పోటీ

ABN , First Publish Date - 2022-05-21T08:25:07+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

తెలంగాణలోనూ పోటీ

  • వచ్చే ఎన్నికల్లో 20% నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతాం
  • గెలవకున్నా.. గెలుపోటములను ప్రభావితం చేయగలం
  • టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీకి దీటుగా నిలిచే కార్యాచరణ
  • ఏపీలో అధికారాన్ని ఆశించలేదు: పవన్‌ కల్యాణ్‌
  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన.. కార్యకర్తలకు సాయం


చౌటుప్పల్‌, హుజూర్‌నగర్‌, కోదాడ, మన్సూరాబాద్‌, మే 20: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం నియోజకవర్గాల్లో బరిలో దిగే విషయమై పార్టీ నాయకులతో చర్చిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ బలం, బలహీనత తనకు తెలుసున్నారు. జనసేనకు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి ఆరు వేల ఓట్లు ఉన్నాయని.. తాము ఎన్నికల్లో గెలవకపోయినా, ఇతరుల గెలుపోటములను ప్రభావితం చేయగలమని వివరించారు. ఆశయం కోసం నిలిచినవారికి  ఓటమి అనేదే ఉండదని, ముందడుగే ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన పార్టీ కార్యకర్తలు.. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన కొంగరి సైదులు, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ కుటుంబాలను పవన్‌ శుక్రవారం పరామర్శించారు. సైదులు కుటుంబానికి చౌటుప్పల్‌లో, శ్రీనివాస్‌ కుటుంబానికి కోదాడలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పవన్‌ చెప్పారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా రాజకీయాల్లో మార్పు రావాలన్నారు. తెలంగాణ నుంచి ఏం ఆశిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ఏపీలోనూ తాను అధికారాన్ని ఆశించలేదని బదులిచ్చారు.


‘‘తెలంగాణలో సామాజిక మార్పును కోరుకుంటున్నా. వారసత్వ రాజకీయాలు పోయి, కొత్తతరం నాయకత్వం రావాలి. సామాజిక మార్పు తేవాలి. అట్టడుగు వర్గాల వారు అధికారం చేపట్టాలి. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సకు దీటుగా జనసేన నిలదొక్కుకునేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఏం చేయాలో తెలుసుకుంటారన్నారు. అన్ని సమస్యలపై అధ్యయనం చేసి, కార్యకర్తలతో చర్చించి జిల్లా, గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పార్టీ కోసం హైదరాబాద్‌లో కార్యాలయం తీసుకుంటామని.. అక్కడ నెలకు మూడు, నాలుగు రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు. 


జీహెచ్‌ఎంసీలో పోటీ చేయకపోవడం పొరపాటే

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీ చేయాలనుకున్నా, ప్రత్యేక పరిస్థితుల కారణంగా తన మాటను గౌరవించి తప్పుకొన్నారని పవన్‌ అన్నారు. భవిష్యత్తులో అలాంటి పొరపాటు జరుగదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెళ్తూ.. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ అల్కాపురి చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద ఆగారు. తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన పార్టీ ఉంటుందని, రాబోయే రోజుల్లో ఇక్కడ పార్టీ జెండా ఎగరాలని కార్యకర్తలనుద్దేశించి పేర్కొన్నారు. త్వరలో కార్యకర్తలందరితో మాట్లాడతానని, తన మనసులో ఉన్న విషయాలను ఆవిష్కరిస్తానని పవన్‌ పేర్కొన్నారు.


అభిమానుల ఘన స్వాగతం..

పవన్‌కు అల్కాపురి, మెట్టుగూడ, చౌటుప్పల్‌, కోదాడలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. క్రేన్లతో భారీ గజమాలలను వేశారు. అభిమానులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించేందుకు పోటీ పడ్డారు. కోదాడలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. హుజూర్‌నగర్‌- కోదాడ రోడ్డు, రంగా ఽథియేటర్‌ సెంటర్‌, సూర్యాపేట రోడ్డు జనంతో కిక్కిరిసాయి. తోపులాటతో కూచిపూడికి చెందిన నాగుల్‌మీరా, శివ గాయపడ్డారు. నాగుల్‌మీరాను పవన్‌కల్యాణ్‌ వాహనాన్ని అనుసరించే ఓ కారు ఢీకొట్టింది. అతడిని ఖమ్మం తరలించారు. పవన్‌ చుట్టూ 20 మంది బాడీగార్డులు ఉన్నప్పటికీ వారు అభిమానులను నిలువరించలేకపోయారు. డీఎస్పీ, సీఐ స్థాయి అధికారి, 10మంది ఎస్‌ఐలు, 80మంది పోలీసు సిబ్బందిని పవన్‌ భద్రతకు కేటాయించారు. కార్యక్రమాల్లో జనసేన రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగా లక్ష్మణ్‌గౌడ్‌, వీర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి శిరీష, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గోకుల రవీందర్‌రెడి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T08:25:07+05:30 IST