పోటాపోటీగా హామీలు

ABN , First Publish Date - 2021-03-07T05:47:37+05:30 IST

జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీలు హామీలు కురిపిస్తున్నాయి. ఓ పక్క పెట్రో, గ్యాస్‌ ధరలు చుక్కలు తాకాయి. నిత్యవస సరుకుల ధరలు తారాజువ్వలా దుసుకుపోతున్నాయి. వీటిని అదుపు చేయడంలో అధికార పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయి. దీంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది.

పోటాపోటీగా హామీలు

నీటి పన్ను రద్దు.. ఇంటి పన్ను తగ్గింపు

పురపోరులో టీడీపీ ప్రచార అసా్త్రలు

నవరత్నాలతో ఓటర్ల వద్దకు వైసీపీ

పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల గాలం


పురపోరులో ప్రచారం కీలకదశకు చేరుకుంది. తమ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణ ప్రజలకు ఏమి చేస్తామనేది ప్రధాన పార్టీలు వివరిస్తూ ఓట్లడుగుతున్నాయి.  ఇంటి పన్ను తగ్గింపు.. నీటి పన్ను రద్దు.. పాత బకాయిలు రద్దు.. హామీలతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రచారం ముమ్మరంగా చేస్తోంది. ఓటేసి తమవారిని గెలిపిస్తే ఐదేళ్లలో నీటి పన్ను, ఇంటి పన్ను రూపాల్లో పురవాసులకు రూ.260 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుందని ఆ పార్టీ చెబుతోంది. నవరత్నాలతో అధికార వైసీపీ ఓటర్ల వద్దకు వెళ్తోంది. ఓ పక్క ఓటు వేయకపోతే ఆ నవరత్నాలు కూడా కట్‌ చేస్తామని పరోక్షంగా ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. పురపోరు వేళ ప్రధాన పార్టీలు పట్టణ ఓటర్లకు వరాలు కురిపిస్తున్నాయి.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీలు హామీలు కురిపిస్తున్నాయి. ఓ పక్క పెట్రో, గ్యాస్‌ ధరలు చుక్కలు తాకాయి. నిత్యవస సరుకుల ధరలు తారాజువ్వలా దుసుకుపోతున్నాయి. వీటిని అదుపు చేయడంలో అధికార పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయి. దీంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ఈ తరుణంలో ఏప్రిల్‌ ఒకటో తారీఖు నుంచి ‘రిజిసే్ట్రషన ఆధారిత పన్ను విధానం’ అమలు ద్వారా ఆస్థి పన్ను పెంచుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టణాల్లో పన్ను పోటు లేకుండా.. ఉన్న పన్ను తగ్గించడం, నీటి పన్ను, పాత బకాయిలు పూర్తిగా రద్దు అసా్త్రలతో ఎన్నికల బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో ఇదే ప్రధాన చర్చ.


టీడీపీ హామీ అమలైతే..

టీడీపీ హామీ అమలైతే మున్సిపాలిటీలకు సంబంధించి ఐదేళ్లలో నీటి పన్ను రద్దు, ఇంటి పన్ను 50 శాతం తగ్గింపు రూపాల్లో సుమారుగా రూ.260 కోట్ల ఆర్థిక భారం తగ్గుందుని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇది అన్ని మున్సిపాలిటీల్లో గెలిచి పాలకవర్గం ఏర్పాటు చేస్తేనే..! ఎన్నికలు జరిగే కడప కార్పొరేషన, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, పులివెందుల, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో 2,26,411 పన్ను చెల్లించే భవనాలు ఉన్నాయి. వాటి ద్వారా ఏటా రూ.49.51 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే 50 శాతం పన్ను తగ్గిస్తామని టీడీపీ ఇస్తున్న ప్రధాన హామి. అదే జరిగితే ఏటా రూ.24.75 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.123.75 కోట్లు ఆదా అవుతుంది. అలాగే.. నీటి పన్ను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఆయా మున్సిపాలిటీల్లో నీటి పన్ను ద్వారా రూ.27.17 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు. రద్దు చేస్తే ఐదేళ్లలో రూ.135.85 కోట్ల భారం తగ్గుతుంది. నీటి పన్ను రద్దు, ఇంటి పన్ను తగ్గింపు రూపాల్లో దాదాపుగా రూ.259.62 కోట్లు పట్టణ వాసులకు భారం తగ్గే అవకాశం ఉంటుంది. 

అయితే.. ఏకగ్రీవాల కారణంగా పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలు అధికార పక్షం వశమయ్యాయి. కడప నగరం సైతం అఽధికార పార్టీయే మేయర్‌ పీఠం దక్కించుకోనుంది. దీంతో అక్కడ టీడీపీ ఇచ్చిన హామీలు అమలయ్యే పరిస్థితి ఎలాగు లేదు. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు మున్సిపాలిటీల్లో అధికార పార్టీని ప్రతిపక్ష టీడీపీ బలంగా ఢీ కొడుతోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీనే గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీని గెలిపిస్తే పన్ను పోటు తప్పుతుందని ఆ పార్టీ నాయకులు ప్రధాన అస్త్రంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే.. ఏప్రిల్‌ ఒకటో తారీఖు నుంచి రిజిసే్ట్రషన ఆధారిత పన్ను అమలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఇది అమలైనే 15 శాతం వరకు పన్ను పెరిగే అవకాశం ఉంది. ఈ పన్ను పెంచమని టీడీపీ  హామీ ఇస్తోంది.


నవరత్నాలు అజెండాగా..

అధికార వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అజెండాగా ఆ పార్టీ నేతలు మున్సిపల్‌ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీటితో పాటు స్థానిక సమస్యలను భుజానకెత్తుకున్నారు. వైసీపీ గెలిస్తే.. అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ చేయూత, విద్యాకానుక, విద్యావసతి, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందిస్తామని హామీలు ఇస్తున్నారు. అలా గెలిపించలేదంటే నవరత్నాలు దూరం చేస్తామని కూడా బెదిరిస్తున్నారని సమాచారం. జనం సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతారో.. ఐదేళ్లు పన్ను పోటు భారం లేకుండా చేస్తామంటున్న ప్రతిపక్షం టీడీపీ వైపు మొగ్గు చూపుతారో.. ఈ నెల 10వ తేది వరకు వేచి చూడల్సిందే. ఎవరి హామీలు ఎలా ఉన్నా బరిలో నిలిచిన అభ్యర్థులు, వారికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీ నాయకుల హోరా హోరీ ప్రచారాలతో పట్టణాల్లో రాజకీయం కాకపుట్టిస్తోంది.


వివిధ మున్సిపాలిటీలకు ఏటా ఆస్తి పన్ను, నీటి పన్ను ద్వారా వస్తున్న ఆదాయం రూ.కోట్లలో

-------------------------------------------------------------------

మున్సిపాలిటీ భవనాలు ఇంటి పన్ను నీటి పన్ను

------------------------------------------------------------------

కడప                     90,231 21.00 16.50

ప్రొద్దుటూరు            31,669 13.45 5.26

బద్వేలు             23,682 3.40         0.89

రాయచోటి             25,000 3.25         1.25

పులివెందుల     21,040 3.01            1.14

జమ్మలమడుగు     11,215 2.35             1.13

ఎర్రగుంట్ల             10,374 1.85             0.30

మైదుకూరు             13,200 1.20                0.70

-----------------------------------------------------------------

మొత్తం             2,26,411 49.51 27.17

----------------------------------------------------------------

Updated Date - 2021-03-07T05:47:37+05:30 IST