విద్యార్థి దశ నుంచే పోటీతత్వం అవసరం

ABN , First Publish Date - 2022-07-06T06:08:20+05:30 IST

విద్యార్థి దశ నుంచే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని, అలాగే టీచర్లు, తల్లిదండ్రులు వారిని ఉత్తములుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు.

విద్యార్థి దశ నుంచే పోటీతత్వం అవసరం
విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

జిల్లాలో 1,58,914 మందికి విద్యా కానుకలు  


పాడేరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని, అలాగే టీచర్లు, తల్లిదండ్రులు వారిని ఉత్తములుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. స్థానిక లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కొవిడ్‌ ప్రభావంతో విద్యా వ్యవస్థ కుంటుపడిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పేద విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే విద్యాకానుకలను అందిస్తున్నామన్నారు. మన బడి నాడు- నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, తొలి విడతలో రూ.104 కోట్లతో 367 పాఠశాలలను అభివృద్ధి చేశామని, రెండో విడతలో 363 పాఠశాలలు అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతం 54 శాతం మాత్రమే ఉందని, దానిని పెంచేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో లక్ష మంది మాత్రమే అమ్మఒడి పథకంలో లబ్ధిపొందారని, 75 శాతం మించి హాజరు ఉంటే మరింత మందికి లబ్ధి చేకూరేదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా పాఠశాలలకు పంపాలని కలెక్టర్‌ కోరారు. పథకాలకు లబ్ధిదారుల బయోమెట్రిక్‌ వేసేందుకు సమస్యలేర్పడితే సచివాలయాల సహాయం తీసుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ పి.రమేశ్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,716 పాఠశాలల్లో లక్షా 58, 914 మందికి విద్యాకానుకలు అందిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో రోజుకు 25 మందికి చొప్పున ఈ నెలాఖరుకు విద్యాకానుకల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిణి సీహెచ్‌ సరస్వతిదేవి, ఎంపీపీ రత్నకుమారి, ప్రధానోపాధ్యాయులు జీవీ ప్రసాద్‌, కె.కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T06:08:20+05:30 IST