ఏంటయ్యా.. నాంచారయ్యా..? ఇదేం పనయ్యా..?

ABN , First Publish Date - 2020-08-08T15:21:20+05:30 IST

ఆది నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాంచారయ్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇదే ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన యువతి శుక్రవారం

ఏంటయ్యా.. నాంచారయ్యా..? ఇదేం పనయ్యా..?

కొవిడ్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల కేసు

ఆసుపత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫిర్యాదు

దిశ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఆది నుంచి వివాదాస్పదుడే

సీఎం కార్యాలయ అధికారి అండతో అక్రమాలు


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఆది నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాంచారయ్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇదే ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన యువతి శుక్రవారం రాత్రి నగరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నాంచారయ్యపై ఫిర్యాదు చేశారు. నాంచారయ్య కొద్దిరోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నారని, ఆయన చెప్పినట్టు వినకపోవడంతో 20 రోజుల క్రితం తనను విధుల నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాంచారయ్య తనతో వ్యవహరించిన అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలను కూడా ఆమె పోలీసులకు అందజేశారు. కేసును అన్ని కోణాల్లో పరిశీలించాక చర్యలు తీసుకుంటామని దిశ పీఎస్‌ ఏసీపీ నాయుడు మీడియాకు తెలిపారు. 


సెటిల్‌మెంట్‌ కుదరక..

బాధితురాలు దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ముందు నగరంలోని ఓ వైసీపీ నాయకుడి వద్ద ఇరువర్గాల వారితో సెటిల్‌మెంట్‌ వ్యవహారం నడిపినట్లు తెలిసింది. అక్కడ వ్యవహారం బెడిసికొట్టడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తనను విధుల నుంచి తప్పించాలని కోరుతూ సూపరింటెండెంట్‌ నాంచారయ్య రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ)కు గురువారం లేఖ రాసినట్లు తెలిసింది. 


మొదటి నుంచి వివాదాలే..

సూపరింటెండెంట్‌ నాంచారయ్య వ్యవహారశైలిపై గతంలోనూ జిల్లా కలెక్టరుకు ఫిర్యాదులు అందాయి. కరోనా బారినపడి చికిత్స కోసం ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రిలో వైద్యసేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సూపరింటెండెంట్‌ నాంచారయ్య దుర్భాషలాడుతూ వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు గతంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకూ సూపరింటెండెంట్‌ నాంచారయ్యే కేంద్రబిందువుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోలేకపోయారనే విమర్శలూ వినిపించాయి. ఆ తర్వాత సూపరింటెండెంట్‌ మరింత రెచ్చిపోయారని, ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించేలా చూడాల్సిన బాధ్యతలను పక్కనబెట్టి పూర్తిగా అవినీతి కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తూ అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారని, ఆ క్రమంలోనే ఆసుపత్రిలో పనిచేసే చిరుద్యోగితో అసభ్యంగా ప్రవర్తించి చివరికి లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. తాము ఫిర్యాదు చేసినప్పుడే కలెక్టర్‌ స్పందించి నాంచారయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. 

Updated Date - 2020-08-08T15:21:20+05:30 IST