‘స్థానిక’ నిధులను ప్రభుత్వం నొక్కేసింది

ABN , First Publish Date - 2022-05-21T09:07:27+05:30 IST

‘స్థానిక’ నిధులను ప్రభుత్వం నొక్కేసింది

‘స్థానిక’ నిధులను ప్రభుత్వం నొక్కేసింది

రూ.7659.70 కోట్ల దారి మళ్లించింది

ప్రజలకు తాగునీరూ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాం

సీఎం జగన్‌తో మాట్లాడి వెనక్కి ఇప్పించండి

గవర్నర్‌కు పంచాయతీ చాంబర్‌ ఫిర్యాదు


అమరావతి, విజయవాడ, కర్నూలు, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి వినియోగించుకుంటోందని రాష్ట్ర పంచాయతీ చాంబర్‌, పంచాయతీ సర్పంచ్‌లు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. చాంబర్‌ వ్యవస్థాపకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి  బిర్రు ప్రతా్‌పరెడ్డి, పలువురు సర్పంచ్‌లు శుక్రవారం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ హరిచందన్‌ను కలిశారు. కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘం నిధులను 2018 నుంచి 2022 వరకు రూ.7659.79 కోట్లను విడుదల చేసిందన్నారు. పంచాయతీలు, సర్పంచ్‌లకు తెలియజేయకుండా, ఎలాంటి ఆమోదం లేకుండా ప్రభుత్వం ఈ నిధులను దారి మళ్లించిందని తెలిపారు. నేరుగా సీఎ్‌ఫఎంఎస్‌ అకౌంట్‌ నుంచి సొంత పథకాలకు వినియోగించుకుందని వివరించారు.  2018-19లో రూ.1729.23 కోట్లు, 2019-20లో రూ.2336.56 కోట్లు, 2020-21లో రూ.2625 కోట్లు, 2021-2022లో రూ.969 కోట్లను ప్రభుత్వం తన సొంత పథకాలకు వినియోగించుకుందని స్పష్టం చేశారు. మొత్తం 12,918 పంచాయతీల ఖాతాల్లో నిధులు ఖాళీ అయ్యాయని తెలిపారు. ఈ నిధులను పంచాయతీ ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు అన్నెపు రామకృష్ణారెడ్డి (శ్రీకాకుళం), వానపల్లి ముత్యాలరావు (విశాఖ జిల్లా), మూడే శివశంకర్‌ యాదవ్‌ (కృష్ణా  జిల్లా) తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-21T09:07:27+05:30 IST