అడుగు పెడితే ముక్కు మూసుకోవాల్సిందే!

ABN , First Publish Date - 2021-07-22T05:20:04+05:30 IST

అది పేరుకే ప్రభుత్వ కార్యాలయాల సముదాయం. చుట్టు పక్కల వారు దానిని మరుగుదొడ్డిలా వాడేస్తున్నారు. ఆ ప్రాంగణంలోకి అడుగు పెడితే ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధం. ప్రాంగణంలోనే మల, మూత్రాల విసర్జన. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మురుగు, దోమల స్వైర విహారం. నగరంలో బోసుబొమ్మ కూడలిలోని అంబేద్కర్‌ సంక్షేమ భవన సముదాయం పరిస్థితి ఇది.

అడుగు పెడితే  ముక్కు మూసుకోవాల్సిందే!
గేటు ముందు దెబ్బతిన్న కాలువ


దుర్గంధంలో అంబేద్కర్‌ భవన సముదాయం

పలు కార్యాలయాలు అక్కడే..

ప్రాంగణంలోనే మల, మూత్ర విసర్జన

ఉద్యోగులు, సందర్శకులకు తీవ్ర అసౌకర్యం


నెల్లూరు (వీఆర్సీ), జూలై 21 : అది పేరుకే ప్రభుత్వ కార్యాలయాల సముదాయం.  చుట్టు పక్కల వారు దానిని మరుగుదొడ్డిలా వాడేస్తున్నారు. ఆ ప్రాంగణంలోకి అడుగు పెడితే ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధం. ప్రాంగణంలోనే మల, మూత్రాల విసర్జన. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మురుగు, దోమల స్వైర విహారం. నగరంలో బోసుబొమ్మ కూడలిలోని అంబేద్కర్‌ సంక్షేమ భవన సముదాయం పరిస్థితి ఇది.


విశాలమైన ఆ ప్రాంగణంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్లతోపాటుగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), సంఘమిత్ర రూరల్‌ కార్యాలయం ఉన్నాయి. రోజూ వందలాది మంది ఆయా కార్యాలయాలకు పనుల నిమిత్తం వస్తుంటారు. ఈ ప్రాంగణం గేటు ముందే సంచార జాతుల వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే వారి పిల్లలు మల, మూత్ర విసర్జనకు అంబేద్కర్‌ సంక్షేమ సముదాయాన్ని వినియోగిస్తున్నారు. దీంతో అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఇది సరిపోదన్నట్లుగా ఆ కార్యాలయ గేటు ముందే నగరపాలక సంస్థ పబ్లిక్‌ టాయ్‌లెట్‌ ఏర్పాటు చేయడం, దాని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అంతేకాకుండా ప్రాంగణంలోని మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. పారుదల లేకపోవడంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయింది. కాలువ దెబ్బతిని ప్రమాదకరంగానూ మారింది. దానిపై వేసిన బండలు పగిలిపోవడంతో చెత్త చేరి మురుగు ప్రవాహానికి ఆటకం కలుగుతోంది. దీంతో దోమల బెడద తీవ్రంగా ఉంది.


నగర పాలిక పట్టించుకుంటేనే..!

కార్యాలయ ప్రాంగణంలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంతో అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సంచార జాతుల వారిని అక్కడి నుంచి పంపేందుకు వీలుకాక, దుర్గంధాన్ని అరికట్టలేక ముక్కు మూసుకుని పనులు చేసుకుంటున్నారు. కొందరు విసుగెత్తిన అధికారులు మూకుమ్మడిగా కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు చొరవ తీసుకుంటే తప్ప ఈ కార్యాలయంలో పరిస్థితి మెరుగుపడదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-07-22T05:20:04+05:30 IST