Tirupathi: టౌన్ బ్యాంక్ ఎన్నికలపై హైకోర్టు సీజేకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-07-21T18:19:21+05:30 IST

టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎప్పటిలానే అక్రమంగా నెగ్గేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.

Tirupathi: టౌన్ బ్యాంక్ ఎన్నికలపై హైకోర్టు సీజేకు ఫిర్యాదు

తిరుపతి (Tirupathi): కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ (Co Operative Town Bank) ఎన్నికల్లో కూడా అధికార వైసీపీ (YCP) ఎప్పటిలానే అక్రమంగా నెగ్గేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఎన్నికల్లో పాల్గొనకుండా పోలీసులు (Police) తమను అక్రమంగా నిర్బంధించారంటూ అభ్యర్థులు హైకోర్టు సీజే (High CJ)కు ఫిర్యాదు చేశారు. నిర్బంధాలపై ప్రశ్నిస్తే పోలీసులు జవాబు చెప్పలేదని వారు సీజే దృష్టికి తీసుకువెళ్లారు.


అధికార వైసీపీ దౌర్జన్యాలను.. బుధవారం తిరుపతి  కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగిన తీరు మరోమారు బట్టబయలు చేసింది. తిరుపతి లోక్ సభ ఎన్నిక తరహాలోనే దొంగ ఓటర్లు దండెత్తి వచ్చారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులను, అభ్యర్థులను పోలీసులు నిర్బంధించారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో ఈ తతంగమంతా జరిగింది. అంతేకాదు.. టీడీపీ అభ్యర్థులకు అండగా ఉండి, ప్రచారంలో కీలకంగా ఉన్న పులుగోరు మురళీకృష్ణారెడ్డి, బుల్లెట్ రమణ, జేబీ శ్రీనివాసులుపై మంగళవారం అర్థరాత్రి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అలాగే వైసీపీ డైరెక్టర్ అభ్యర్థి వెంకటేష్‌ను అన్నమయ్య కూడలిలో కిడ్నాప్ చేసి వాహనం ఎక్కించుకుని బెదిరించి వదిలేశారని మరోకేసు పెట్టారు.


బుధవారం వేకువజామునుంచే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్‌ వర్మ, తెలుగు యువత రవినాయుడు ఇళ్లవద్ద పెద్దఎత్తున పోలీసులు మొహరించారు. బయటకు రాకుండా నిర్బంధించారు.


ఉదయం 6 గంటల ప్రాంతంలోనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరులతో పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. 7గంటలకు ఎన్నికల అధికారులు పోలింగ్‌ ప్రారంభమైనట్టు ప్రకటించారు. 8 గంటల నుంచి పుట్టపిగిలి చెదళ్లదండు వచ్చినట్టు నకిలీ గుర్తింపు కార్డులుతో బిలబిలమంటూ  దొంగ ఓటర్లు వచ్చి పడ్డారు. వీరిని టీడీపీ నేతలు అడ్డుకోబోయారు. వారిని తప్పించుకుని పోలింగ్‌ కేంద్రం లోపలికి నకిలీ ఓటర్లు పరుగులు తీశారు. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు టీడీపీ నేతలు ఆర్సీ మునికృష్ణ, రవినాయుడు, రుద్రకోటి సదాశివం తదితరులను పోలీసులు రోడ్డుపై బలవంతంగా లాక్కెళ్లి వ్యాను ఎక్కించి ఎంఆర్‌పల్లె పోలీస్‌ స్టేషన్‌కు తరలిచారు. 9 గంటల తర్వాత దొంగ ఓటర్లను పెద్దఎత్తున లోపలికి పంపించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మహిళా నకిలీ ఓటర్లను తెలుగు మహిళలు పుష్పావతి, లత, బ్యాంకు శాంతమ్మలు అడ్డుకుని వెనక్కి పంపించేశారు. బస్సులు, ఆటోల్లో వస్తూనే వున్న దొంగ ఓటర్లును పోటీలో వున్న టీడీపీ అభ్యర్థులు నిలదీయడంతో పోలీసులు వారిని కూడా వ్యాను ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. 10 గంటల ప్రాంతంలోనే టీడీపీకి సంబంధించి గట్టిగా ప్రశ్నించేవారు పోలింగ్‌ కేంద్రం వద్ద  లేకుండా చేశారు. ఆ తర్వాత వైసీసీ శ్రేణులు రెచ్చిపోయారు. గుంపులు గుంపులుగా యువతను వేసుకొచ్చి ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌ చేయించుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అడ్డూ అదుపు లేకుండా ఒక్కొక్కరు 20 ఓట్లకు తక్కువ కాకుండా గుద్దుకున్నారు.

Updated Date - 2022-07-21T18:19:21+05:30 IST