తాత్కాలిక ఉద్యోగాలను అమ్మేశారు!

ABN , First Publish Date - 2021-10-29T06:55:02+05:30 IST

విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఉన్న డ్రగ్‌ డీ అడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ సెంటర్‌లో తాత్కాలిక ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాత్కాలిక ఉద్యోగాలను అమ్మేశారు!

డ్రగ్‌ డీ అడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌లో అవకతవకలపై ఫిర్యాదులు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఉన్న డ్రగ్‌ డీ అడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ సెంటర్‌లో తాత్కాలిక ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి కనీస అర్హతలు లేవని, నియామకాల ప్రక్రియలో కొందరు దళారులు కీలకపాత్ర పోషించడంతో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని, అనర్హులకు ఆ ఉద్యోగాలను అమ్మేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అనుసరించిన తప్పుడు విధానాల వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 

విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలోని డ్రగ్‌ డీ అడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ సెంటర్‌లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి మే 11న అప్పటి కలెక్టర్‌ ఇంతియాజ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇద్దరు సైకియాట్రిస్టులు (ఎంబీబీఎస్‌ డాక్టర్లు), ఇద్దరు నర్సులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఒక డేటా మేనేజర్‌ పోస్టులు కలిపి మొత్తం ఏడు పోస్టులను ఇటీవలే అధికారులు భర్తీ చేశారు. దాదాపు ఆరునెలల తర్వాత గత నెల రెండో తేదీన జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి, విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్లు ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు నేరుగా అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ పంపించేశారు. అయితే మెరిట్‌ ప్రకారం పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్న అధికారులు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, వారి అర్హతలను వెల్లడిస్తూ తొలుత ప్రొవిజినల్‌ లిస్టు, తర్వాత మెరిట్‌ లిస్టులను విడుదల చేయాలి. ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత ఎంపికైనవారి వివరాలతో మెరిట్‌ లిస్టును ప్రకటించాలి. అభ్యంతరాలుంటే ఫిర్యాదులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించకుండా అధికారులు తమకు నచ్చినవారికి అత్యంత గోప్యంగా పోస్టింగ్‌ ఆర్డర్లను పోస్టు ద్వారా పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టుల నియామకానికి సంబంధించిన ప్రొవిజినల్‌ లిస్టు, మెరిట్‌ లిస్టు, ఫైనల్‌ మెరిట్‌లిస్టులను ఇప్పటికైనా జిల్లా వైబ్‌సైట్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-29T06:55:02+05:30 IST