నిధుల ‘పంచాయితీ’!

ABN , First Publish Date - 2021-11-11T06:23:56+05:30 IST

గన్నవరం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొంటోంది.

నిధుల ‘పంచాయితీ’!

గన్నవరంలో ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదుల వెల్లువ

విచారణకు ఆదేశించిన డీపీవో 

డీఎల్‌పీవో నేతృత్వంలో పక్షం రోజులుగా అంతర్గత ఆడిట్‌

పలు పంచాయతీల్లో ఆర్థిక అవకతవకలపై కోర్టు కేసులు

లోకాయుక్తకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు


గన్నవరం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొంటోంది. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న గన్నవరంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు రావటంతో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జ్యోతి విచారణకు ఆదేశించారు. దీంతో విచారణ బృందాలు 15 రోజులుగా గన్నవరం పంచాయతీలో లెక్కలు తేల్చే పనిలో పడ్డాయి. ఇన్ని రోజులపాటు అంతర్గత ఆడిట్‌, రికార్డుల పరిశీలన  జరుగుతుండటంతో ఇక్కడ ఆర్థిక అవకతవకలు ఏ స్థాయిలో ఉన్నాయోననే చర్చ నడుస్తోంది. అయితే నివేదికలు వచ్చేవరకు వాస్తవాలేమిటో తెలిసే పరిస్థితి లేదు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గన్నవరం పంచాయతీలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ పట్టణానికి చెందిన ఓ అడ్వకేట్‌ నుంచి, ప్రస్తుత పంచాయతీ పాలకవర్గంలోని కొందరు సభ్యులు, స్థానిక ప్రజల నుంచి ఒకేసారి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా పంచాయతీ అఽధికారి విచారణకు ఆదేశించారు. నూజివీడు డీఎల్‌పీవోను విచారణాధికారిగా నియమించారు. ఆయనతో పాటు పలువురు గ్రామ పంచాయతీల కార్యదర్శులను తనిఖీ బృందాల్లో నియమించారు. ఈ తనిఖీ బృందాలు గత 15 రోజులుగా రాత్రింబవళ్లూ ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నాయి. రికార్డులను పరిశీలిస్తున్నాయి. నిధుల దుర్వినియోగానికి సంబంధించి వచ్చిన ఆరోపణల ప్రకారం 2015 ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం రికార్డులను పరిశీలిస్తున్నారు. నిధుల ఖర్చుకు సంబంధించిన అంశాలపై పంచాయతీ తీర్మానాలు జరిగాయా? ఏఏ పనికి నిధులను ఎంత ఖర్చు చేశారు? నిధులు సక్రమంగా వినియోగమయ్యాయా? వాటికి సంబంధించిన బిల్లులున్నాయా? వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చేసిన పనులకు సంబంధించిన పేపర్‌వర్క్‌ సక్రమంగా ఉందా? సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను కూడా విచారణ బృందం గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో బృందం ఒక్కో అంశంపై విచారణ జరుపుతుండటంతో అవకతవకలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇంకా బయటకు రాలేదు. తనిఖీ బృందాలు కూడా ఇందుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడి చేయకుండా జాగ్రత్త పడుతున్నాయి. మరో వారంలో పూర్తిస్థాయిలో తనిఖీలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే డీపీవోకు, విచారణాధికారి తుది నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.


కేసరపల్లి పంచాయతీలో నీటి, ఆస్తి పన్నుల కిరికిరి 

గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నీటి పన్ను, ఆస్తి పన్నులకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. వీటికి సంబంధించి కూడా త్వరలో తనిఖీలు జరిగే అవకాశం ఉంది. గతంలో కేసరపల్లి గ్రామ పంచాయతీతో పాటు, జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల్లో నీటి పన్ను, ఆస్తి పన్నులకు సంబంధించిన అవకతవకలు వెలుగు చూశాయి. మాన్యువల్‌ రికార్డులు నిర్వహించే క్రమంలో రెండు రకాల రిజిస్టర్లు ఉంచేవారు. అధికారిక రిజిస్టర్‌లో అసలైన నీటి కనెక్షన్ల వివరాలు పొందుపరచగా, అనధికారిక రిజిస్టర్‌లో కనెక్షన్‌ ఇచ్చి కూడా, వాటిని రికార్డుల్లో చూపని వారి వివరాలను పొందుపరిచేవారు. అనధికారిక రిజిస్టర్‌లో పేర్లు ఉన్న వారి నుంచి నీటి కనెక్షన్‌ డిపాజిట్లు స్వీకరించటంతో పాటు, నెలనెలా బిల్లులు కూడా వసూలు చేసి, స్వాహా చేస్తున్నారన్నది వెలుగుచూసింది. దీంతో కేసరపల్లి పంచాయతీతో పాటు పలు గ్రామ పంచాయతీల నుంచి అప్పటి డీపీవో అరుణ రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ సాగించారు. ఇదే సమయంలో ఆమె బదిలీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన డీపీవోలు ఈ అంశంపై దృష్టి సారించలేదు. తాజాగా డీపీవో జ్యోతి ఈ అంశంపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 


వందకు పైగా పంచాయతీలపై కేసులు 

జిల్లాలోని అనేక పంచాయతీల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కేసులు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు వందకు పైగా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. ఈ కేసులకు సంబంధించి స్థానిక పంచాయతీ అధికారులతో పాటు, జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌లను కూడా పార్టీలుగా చేర్చుతుండటం, తరచూ వారు నోటీసులను అందుకోవటం ఉన్నతాధికారులకు కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నోటీసుల దెబ్బతో ఆరోపణలు వచ్చిన ప్రతి పంచాయతీపై విచారణకు ఆదేశించాలని జిల్లా పంచాయతీ విభాగం ఆలోచన చేస్తోంది.

Updated Date - 2021-11-11T06:23:56+05:30 IST