స్మార్టుసిటీ ప్రాజెక్టులను నిర్దేశిత సమయానికి పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-01-22T05:59:35+05:30 IST

స్మార్టుసిటీ ప్రాజెక్టుల పనులు నిర్దేశిత సమయానికి పూర్తయ్యేలా అధికారులు దృష్టిపెట్టాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ జగదాంబికపాల్‌, సభ్యులు సూచించారు.

స్మార్టుసిటీ ప్రాజెక్టులను   నిర్దేశిత సమయానికి పూర్తి చేయండి
గరుడవారధి డిజైన్‌ను కమిటీకి చూపి వివరిస్తున్న అధికారులు

అధికారులకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సూచన

 

తిరుచానూరు, జనవరి 21: స్మార్టుసిటీ ప్రాజెక్టుల పనులు నిర్దేశిత సమయానికి పూర్తయ్యేలా అధికారులు దృష్టిపెట్టాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ జగదాంబికపాల్‌, సభ్యులు సూచించారు. తిరుపతిలోని గ్రాండ్‌రిడ్జ్‌లో గురువారం జరిగిన సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా స్మార్ట్‌సిటీ ఎండీ గిరీష అభివృద్ధి పనులను కమిటీ సభ్యులకు చూపించి వివరించారు. ఎనిమిది అంశాలకు సంబంధించి 85 ప్రాజెక్టుల్లో 25పూర్తికాగా, మరో 41 వివిధ దశల్లో ఉన్నాయని, మిగిలినవి టెండర్ల స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. రూ.684 కోట్ల అంచనాతో చేపట్టిన గరుడవారధి పనులను డిసెంబరుకు పూర్తి చేస్తామన్నారు. టీటీడీ అందిస్తున్న సహకారాన్ని ఈవో జవహర్‌రెడ్డి, తిరుపతి స్మార్ట్‌సిటీపై సందేహాలను కలెక్టర్‌ భరత్‌గుప్తా, రాష్ట్ర పట్టణాభివృద్ధిపై అదనపు చీఫ్‌సెక్రటరీ శ్రీలక్ష్మి, ఐఐటీ వివరాలను ఎంబీసీసీ జాయింట్‌ సెక్రెటరీ కొనాల్‌కుమార్‌ కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌ మాట్లాడుతూ.. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పచ్చదనంతో నింపాలని, తిరుపతి పరిసరాలతోపాటు కనీసం 80కిలోమీటర్ల వరకు చేపట్టాల్సిన అభివృద్ధి, రోడ్లువంటివి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు. నగరాన్ని సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు కలిపేలా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. చెన్నై రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతకుముందు తిరుమల బైపాస్‌ రోడ్డులోని ప్రకాశం పార్కును సందర్శించారు. ఫిట్‌ ఇండియా సైకిల్‌ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. లీలామహల్‌ జంక్షన్‌ వద్ద గరుడవారధి నిర్మాణం, వినాయకసాగర్‌ పనులను పరిశీలించారు. కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యులు కుమార్‌కేట్కర్‌, ఎంఎం ఆరీఫ్‌, రామ్‌చందర్‌జాంగ్రా, సుశీల్‌కుమార్‌మోదీ, సంజయ్‌సింగ్‌, డెన్నిడెహనన్‌, రాహుల్‌రమేష్‌, రామలింగం, సునీల్‌కుమార్‌సోని, మోహన్‌, సత్యనారాయణ, అయోధ్యరామిరెడ్డి, సుమేర్‌సింగ్‌సోలంకి ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, కమిషనరు గిరీష, స్మార్ట్‌సిటీ జీఎం చంద్రమౌళి, అదనపు కమిషనరు హరిత తదితరులు స్వాగతం పలికారు.

Updated Date - 2021-01-22T05:59:35+05:30 IST