నగదు చెల్లించేవారికే ప్రభుత్వ ఫీజుల వర్తింపు

ABN , First Publish Date - 2020-07-07T07:25:34+05:30 IST

కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం పడకలు సర్కారుకు ఇస్తామని తామెక్కడా చెప్పలేదని, ప్రభుత్వం నుంచి కూడా అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్దకు రాలేదని తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌(తెషా) అధ్యక్షుడు బొల్లినేని భాస్కరరావు

నగదు చెల్లించేవారికే ప్రభుత్వ ఫీజుల వర్తింపు

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో  సగం పడకలు సర్కారుకు ఇస్తామని తామెక్కడా చెప్పలేదని, ప్రభుత్వం నుంచి కూడా అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్దకు రాలేదని తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌(తెషా) అధ్యక్షుడు బొల్లినేని భాస్కరరావు తెలిపారు. అలాంటి ప్రచారం ఎలా వచ్చిందో తమకు తెలియదన్నారు. యాప్‌ ద్వారా కేటాయిస్తారని, ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేస్తారంటూ వచ్చిన ప్రచారంపై తమకు సమాచారం లేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రులలో పడకల భర్తీకి సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు ఒక నోడల్‌ అధికారిని పెట్టమని  కోరినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వంతో వేరే అంశాలపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.  ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులలో ప్రభుత్వం నిర్దేశించిన కరోనా చికిత్స ఫీజు నగదు చెల్లించే వారికి మాత్రమేనని, ఆమేరకు సర్కారు ఇచ్చిన జీవోలో సడలింపులివ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, పేదలకే జీవోలో నిర్దేశించిన ఫీజులకు చికిత్స చేసేందుకు ఒప్పుకున్నామన్నారు. నగదు చెల్లించే రోగుల నుంచే తాము నిర్దేశించిన చికిత్స ఫీజులను వసూలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా  జీవోలు ఇచ్చాయని తెలిపారు. ప్రైవేటు బీమా, సీజీహెచ్‌ఎస్‌ కవరేజి ఉన్న రోగులకు ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించవని ఆయన అన్నారు. అది కూడా కేవలం సాధారణ వార్డుల్లో ఉన్నవారికే వర్తిస్తుందన్నారు. అందరికీ ప్రభుత్వ నిర్దేశిత ఫీజులకు వైద్యం చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశామన్నారు. అయితే ఫీజులు ఏస్థాయిలో ఖరారు చేయాలన్న అంశంపై తాము ప్రభుత్వంతో చర్చించలేదన్నారు. వాస్తవానికి ఉత్తర్వుల జారీకి ముందు జనరల్‌ వార్డుల్లో ఉన్నవారికే నిర్దేశించిన ఫీజులు వర్తిస్తాయన్న విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. ‘‘ఇప్పటికే వివిధ వ్యాధులకు వర్తించేలా ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి ప్రజలు పాలసీలు తీసుకున్నారు. వాటి ప్రకారం చికిత్సలు చేస్తామే తప్ప ఈ ప్యాకేజీ ప్రకారం కరోనా రోగులకు ఫీజులను వర్తింప చేయలేము’’అని భాస్కరరావు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-07T07:25:34+05:30 IST