Ram gopal varmaపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-06-24T22:06:25+05:30 IST

Ram gopal varmaపై పోలీసులకు ఫిర్యాదు

Ram gopal varmaపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్:రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram gopal varma) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘‘రాష్ట్రపతి ద్రౌపతి అయితే.. కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు?’’ అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు రాంగోపాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీని వేస్ట్ ఫెలోతో పోల్చారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమన్నారు. కాగా వర్మ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.  ‘‘మహాభారతంలోని ద్రౌపది నాకు చాలా ఇష్టమైన పాత్ర, అలాంటి పేరు చాలా అరుదు కాబట్టి కొన్ని సంబంధిత పాత్రలు గుర్తుకు వచ్చాయి. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం’’ లేదని  వివరణ ఇచ్చారు రాంగోపాల్ వర్మ. 


బీజేపీ రాష్ట్రపతి ఎన్నికలకు తమ అభ్యర్థిని ప్రకటించింది. ద్రౌపతి ముర్ముని రంగంలోకి దింపింది. కాగా విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ద్రౌపతి ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. దాదాపు 20 మంది పేర్లను పరిశీలించాక చివరకు గిరిజన మహిళకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ద్రౌపది ముర్ము గురించి...

1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జన్మించారు. శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే భర్త, కుమారులు ఇద్దరూ చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు.


1997లో రాయ్‌రంగాపూర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.. రాయ్‌రంగాపూర్ నియోజకవర్గం నుంచే 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలో బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య, రవాణా శాఖలతోపాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు. 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె.. 2015లో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.


బీజేపీ వ్యూహం ఇదే..

ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆ పార్టీకి జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు లభించే అవకాశం ఉంది. వివాద రహితురాలిగా పేరున్న ద్రౌపదికి.. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు.  ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీకి ఆదివాసీల ఓట్ల షేర్ పెరగడమే కాకుండా.. ఒడిశాలో పార్టీకి మద్దతు పెరుగుతుందని ఆ పార్టీ సీనియర్ల అభిప్రాయం. 

Updated Date - 2022-06-24T22:06:25+05:30 IST