‘చెత్త’తో చిక్కులు!

ABN , First Publish Date - 2022-08-08T07:58:52+05:30 IST

‘చెత్త’తో చిక్కులు!

‘చెత్త’తో చిక్కులు!

మున్సిపాలిటీలపై ఆటో ఈఎంఐల భారం

ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేసి

ప్రతి నెలా కచ్చితంగా చెల్లించాల్సిందే 

లేదంటే సాధారణ నిధుల నుంచి జమ 

ఏ నెల చెల్లించకున్నా పైనుంచి తాఖీదులు

తలలు పట్టుకుంటున్న మున్సిపల్‌ అధికారులు

కమీషన్ల కోసమే ఆటోలు కొన్నారన్న ఆరోపణలు

ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ముడుపులు? 

చెత్త పన్ను కడితేనే ప్రజారోగ్య సిబ్బందికి జీతం 

విజయవాడ కార్పొరేషన్‌ అధికారుల నోటీసులు 

ఆగస్టు వరకు రశీదులు చూపించాలని హుకుం 

విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తర్వులపై వెనక్కి 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం వేసిన ‘చెత్త’ పన్ను ప్రజలకు భారం కాగా.. మున్సిపల్‌ అధికారులకు చిక్కులు తెచ్చి పెట్టింది. చెత్తను తరలించేందుకు కొనుగోలు చేసిన ఆటోల ఈఎంఐలు చెల్లించడం అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రతి నెలా పట్టణ ప్రజల నుంచి చెత్తపన్నును ముక్కుపిండి వసూలు చేసి, ఈఎంఐల కోసం ప్రభుత్వానికి జమ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. జనాల నుంచి వసూలు చేయలేకపోతే మున్సిపాలిటీల సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఏ నెల చెల్లించకపోయినా ఉన్నతాధికారుల నుంచి ఆయా మున్సిపల్‌ కమిషనర్లకు తాఖీదులు అందుతున్నాయంటున్నారు. పుర పాలకవర్గాల అభిప్రాయాలకు భిన్నంగా ప్రభుత్వం పేదలపై భారం వేస్తోందని చెబుతున్నారు. కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చెత్త పన్ను వసూలును వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్కడ అధికారులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా మున్సిపాలిటీలపై చెత్త ఆటోల భారం వేయడం, మరోవైపు చెత్త పన్ను చెల్లించేందుకు కొన్ని చోట్ల ప్రజలు తిరస్కరిస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు. 


స్వచ్ఛ సంకల్పం పేరుతో కొనుగోళ్లు

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో పథకం ప్రారంభించి 2675 వాహనాలను ఓ ప్రైవేటు ఏజెన్సీతో కొనుగోలు చేయించింది. వాటిలో 2048 వాహనాలను రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పంపిణీ చేసింది. ప్రతి వార్డు సచివాలయ పరిధిలో ఒక వాహనాన్ని వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి వాహనానికి డ్రైవర్‌ను ఏజెన్సీ సరఫరా చేస్తుంది. అందులో పనిచేసే ఇద్దరు పారిశుధ్య కార్మికులను ఆయా మున్సిపాలిటీలు అందిస్తాయి. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించినందుకు ప్రతి నెలా యూజర్‌ చార్జీల కింద రూ.60 నుంచి  రూ.90 వరకు వసూలు చేస్తారు. అపార్ట్‌మెంట్ల నుంచి రూ.200, దుకాణాలు, హోటళ్ల నుంచి రూ.300 నుంచి రూ.1000 వరకు వసూలు చేయాలని మున్సిపల్‌ శాఖ ఆదేశాలిచ్చింది. ప్రతి నెలా ఒక్కో వాహనానికి రూ.51 వేల నుంచి రూ.63 వేల వరకు మున్సిపల్‌ శాఖ డైరెక్టరేట్‌ సూచించిన అకౌంట్‌లో ఈఎంఐ జమ చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రతి నెలా జనం నుంచి చెత్తపన్ను వసూలు చేసి ఈఎంఐలు చెల్లించాలి. లేకపోతే ఆ నెల ఈఎంఐలను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సాధారణ నిధుల నుంచి చెల్లించాలని మున్సిపల్‌ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో అసలే నిర్వహణ భారంతో ఇబ్బందులు పడుతున్న మున్సిపాలిటీలకు చెత్త ఆటోలు మరింత భారంగా మారాయని చెబుతున్నారు. 


బెదిరించి చెత్త పన్ను వసూలు

చెత్తను తొలగించడానికి కూడా మున్సిపాలిటీలు ప్రత్యేకంగా డబ్బు వసూలు చేస్తే, ఇక పన్నులు దేనికి వసూలు చేస్తున్నట్టని పలువురు విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పన్ను కట్టేదిలేదంటూ ఎదురు తిరుగుతున్నారు. కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ ప్రాంతాల్లో చెత్తపన్ను వసూలు చేయవద్దంటూ అడ్డుకుంటున్నారు. యూజర్‌ చార్జీల వసూళ్లతోనే ఆటోల ఈఎంఐలు చెల్లించాల్సి ఉన్నందున అధికారులు నయానో, భయానో జనాల నుంచి చెత్త పన్నును వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల చెత్త పన్ను చెల్లించలేదనే కారణంతో వారి ఇంటి ముందు చెత్త పోసి మున్సిపల్‌ అధికారులు బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల సంక్షేమ పథకాలకు అనర్హులను చేస్తామని భయపెట్టి సచివాలయ ఉద్యోగులు  ప్రజల నుంచి  యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. 


వీఎంసీలో జీతాలతో లింకు 

విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ప్రధాన వైద్యాధికారి ఈ నెల 5న ‘అతి జరూరు’ పేరుతో సిబ్బందికి ఉత్తర్వులు ఇచ్చారు. వీఎంసీ ప్రజారోగ్య విభాగంలో పనిచేసే పర్మినెంట్‌ ఉద్యోగులు మొదలు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, వర్కర్లు, మేస్త్రీలు, ఇతర పారిశుధ్య సిబ్బంది, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్‌, శానిటరీ సెక్రటరీలు, అడ్మిన్లు తప్పనిసరిగా చెత్తపన్ను చెల్లించాలని, రశీదుల వివరాలను సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సమర్పించాలని, అప్పుడే ఆగస్టు వేతనాలు చెల్లిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గిన అధికారులు చివరకు ఆ సర్య్కులర్‌ను నిలుపుదల చేశారు. 


కమీషన్ల కోసమే చెత్త ఆటోలు!

చెత్త తరలించే ఆటోల కొనుగోళ్లలో వైసీపీ పెద్దలు, మున్సిపల్‌ అధికారులు భారీగా సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్కో వార్డు సచివాలయానికి ఒక్కొక్కటి చొప్పున 2675 చెత్త తరలించే ఆటోలను ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేయించారు.  ఆ ఏజెన్సీ నుంచి వైసీపీ పెద్దలు, మున్సిపల్‌ అధికారులు భారీగా ముడుపులు దక్కించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ ప్రైవేటు ఏజెన్సీ  భారీ ఎత్తున సమర్పించుకోవడం వల్లే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రజలపై రుద్దిందనే విమర్శలు వస్తున్నాయి. కొందరి స్వప్రయోజనాల కోసమే  ఏకపక్షంగా ఆటోలను కొనుగోలు చేసిందని, ఉన్న పాత వాహనాలను వదిలేసి మున్సిపాలిటీలపై కొత్త భారం వేసిందనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర పేరుతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిని బట్టి భారీగా వాహనాలను కొనుగోలు చేసింది. ఆ వాహనాలతోనే చెత్తను తరలించేవారు. ఇప్పుడు చెత్తను తరలించేందుకు ఆటోలను కొనుగోలు చేయడంతో ఆ వాహనాలన్నీ నిరుపయోగంగా మారాయి. పలు చోట్ల ఈ వాహనాలు తుక్కు కింద మారిపోయాయి. 

Updated Date - 2022-08-08T07:58:52+05:30 IST