గ్రామీణ ఆర్థికాభివృద్ధికి సమగ్ర విధానం

Sep 20 2021 @ 02:25AM

లాభసాటి వ్యవసాయం.. రైతులకు ఆదాయ భద్రత

ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సమగ్రమైన విధానం అమలు చేయాల్సిన అవసరముందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇందుకోసం వ్యవసాయాన్ని అధునాతన పద్ధతులతో లాభసాటిగా మార్చాలని, తద్వారా రైతన్నలకు ఆదాయ భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడి గురుగ్రామ్‌లో గల హరియాణ అకాడమీ ఆఫ్‌ హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆధ్వర్యంలో ‘సర్‌ చోటురామ్‌’ పై రూపొందించిన ఐదు సంపుటాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు, వడ్డీవ్యాపారుల దోపిడీ నుంచి రైతులను విముక్తి చేయానికి సర్‌ చోటురామ్‌ నిరంతరం శ్రమించారని తెలిపారు.


ఎంతో విలువైన ఈ సంపుటాల ప్రతులను ప్రభుత్వ గ్రంథాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని, సర్‌ చోటురామ్‌ వంటి విప్లవాత్మక దార్శనికులకు ఇదే నిజమైన నివాళి అని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఇక, కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ అన్నదాతలు ఆహారోత్పత్తుల  ఉత్పాదకలో దేశాన్ని నిరాశ పరచలేదంటూ రైతన్నలను ప్రశంసించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలని వెంకయ్య అన్నారు. కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్‌లాల్‌, మాజీ కేంద్ర మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్‌, మాజీ సీఎం ఓం ప్రకాశ్‌చౌతాలా, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం విజయ్‌ బహుగుణ, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:

తెలంగాణ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.