రక్షణ వ్యవస్థలో రాజీ తగదు

ABN , First Publish Date - 2022-06-22T10:19:32+05:30 IST

బ్రిటిష్ ఇండియాలోనే ప్రాథమికంగా రూపుదిద్దుకున్న త్రివిధ దళాలను స్వతంత్ర భారత పరిపాలకులు నెహ్రు నాయకత్వంలో రక్షణ వ్యవస్థ నిర్మాణానికి బలమైన పునాదులు...

రక్షణ వ్యవస్థలో రాజీ తగదు

బ్రిటిష్ ఇండియాలోనే ప్రాథమికంగా రూపుదిద్దుకున్న త్రివిధ దళాలను స్వతంత్ర భారత పరిపాలకులు నెహ్రు నాయకత్వంలో రక్షణ వ్యవస్థ నిర్మాణానికి బలమైన పునాదులు వేసి విస్తరింపజేశారు. రక్షణ వ్యవస్థకు సొంత ప్రతిపత్తి ఉండాలని స్వయంసమృద్ధిగా ఎదగాలని, అందుకోసం వందలాది శిక్షణ సంస్థలను, రక్షణరంగ పరిశ్రమలను నెహ్రూ స్థాపించారు. రష్యాతో గౌరవప్రదమైన రక్షణ మైత్రి ఒప్పందం కుదుర్చుకుని త్రివిధ దళాలను పటిష్టంగా తీర్చిదిద్దారు. శతాబ్దాలుగా వలస పాలనలో మగ్గిన భారతదేశానికి ఒక పటిష్టమైన రాజకీయ భౌగోళిక స్వరూపాన్ని ప్రజల ప్రగతికి, రక్షణకు కావాల్సిన మౌలిక రంగాలను తీర్చిదిద్దిన ఘనత జవహర్ లాల్ నెహ్రూకు చెందుతుంది.


భారత రక్షణ వ్యవస్థ నిర్మాణంలోనూ, పురోగతిలోనూ కనీస భాగస్వామ్యం లేని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తీసుకున్న చర్యలు రక్షణ వ్యవస్థ ప్రాభవాన్ని క్షీణింపజేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదం పచ్చి బూటకం. రక్షణరంగ కాంట్రాక్టులను ప్రభుత్వ సంస్థలకు కాకుండా నాటో దేశాలకు కట్టపెడుతున్నారు. ఉపగ్రహ రాకెట్లను, హెలికాప్టర్లను, విమానాలను రూపొందించడానికి ఉన్న హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి అనేక కంపెనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అమెరికాతో 5 బిలియన్ డాలర్లతో అపాచీ హెలికాప్టర్లను, ఇతర యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం. ఫ్రాన్స్‌తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, రష్యాతో జలాంతర్గాములు కొనుగోలు ఒప్పందం, ఇజ్రాయిల్‌తో లైట్ మిషన్ గన్స్, ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టమ్స్, డ్రోన్ల కొనుగోలు ఒప్పందాన్ని కూడా చేసుకుంది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష నిధులకు అనుమతి ఇవ్వడం, దేశీయ కార్పొరేట్ అనిల్ అంబానీకి కొన్ని రక్షణ కాంట్రాక్ట్‌లు ఇవ్వడం వంటి అనేక అనైతిక చర్యలను మోదీ ప్రభుత్వం తీసుకుంది.


భారత రక్షణ వ్యవస్థ తాత్వికత, నిర్వహించిన మహత్తరమైన పాత్ర పట్ల అవగాహన లేని మోదీ ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్ట్ సైనిక వ్యవస్థను తీసుకొచ్చారు. అగ్నివీరులకు ఇచ్చే ఆరు నెలల శిక్షణ, మూడున్నర సంవత్సరాల ఉద్యోగం కాలంలో అభద్రత, భయం, భావోద్వేగంతో వారు తమ పరిపూర్ణమైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించలేరు. నాలుగేళ్ల తరువాత 1/4 వంతు మందిని మాత్రమే కొనసాగిస్తామనే నియమం వల్ల అగ్నివీరులలో అనేక అనైతిక ధోరణులు తలెత్తే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రక్షణ సిబ్బంది, ఉద్యోగ భద్రత ఉన్న రక్షణ సిబ్బంది అనే తేడాలు ఉండడం వల్ల రక్షణ వ్యవస్థలో తలెత్తే అవాంఛనీయ ధోరణులతో దేశ రక్షణకు, అంతర్గత భద్రతకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది.


ప్రధాని మోదీ జాతి సంపదను, వనరులను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెట్టారు. వ్యయం తగ్గించుకోవడం అనే నెపంతో ప్రభుత్వరంగ సంస్థలను వదిలించుకుంటున్నారు. ఇప్పుడు అనూహ్యంగా దేశ గౌరవానికి ప్రతీక అయిన రక్షణ వ్యవస్థలో ప్రతిఘాతుక సంస్కరణలు చేపడుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు ప్రాతిపదికగా కాకుండా వైషమ్యాలను రెచ్చగొట్టి అధికారంలో కొనసాగిన హిట్లర్, ముస్సోలినిలను చరిత్ర ఈసడించుకుంది. అటువంటి స్థితి దాపురించక ముందే మన పాలకులు మేల్కొని రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి.

అస్నాల శ్రీనివాస్

Updated Date - 2022-06-22T10:19:32+05:30 IST