మహిళల ఉసురు పోసుకుంటున్న సీఎం కేసీఆర్‌ కొత్తగూడెం చేరుకున్న సైకిల్‌ యాత్రలో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఆరోపణ

ABN , First Publish Date - 2021-03-09T05:18:10+05:30 IST

: గద్దెనెక్కే ముందు అనేక హామీలిచ్చి.. నిత్యావసరాలైన వంట గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలను రోజురోజుకు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

మహిళల ఉసురు పోసుకుంటున్న సీఎం కేసీఆర్‌   కొత్తగూడెం చేరుకున్న సైకిల్‌ యాత్రలో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఆరోపణ

కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు అండగా నిలుస్తుంది 

ఖాళీ సిలీండర్లతో మహిళల వినూత్న నిరసన 

స్వాగతం పలికిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్‌ మహిళా నాయకులు : 

కొత్తగూడెం/కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌/పాల్వంచ, మార్చి 8 : గద్దెనెక్కే ముందు అనేక హామీలిచ్చి.. నిత్యావసరాలైన వంట గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలను రోజురోజుకు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.  పెట్రో, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ ఆయన భద్రాచలం నుంచి ఖమ్మం వరకు చేపట్టిన సైకిల్‌యాత్ర రెండోరోజైన సోమవారం భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, పాల్వంచల్లో సాగింది. తొలుత కొత్తగూడెంలో సీఎల్పీ నేతకు మహిళా కాంగ్రెస్‌ భద్రాద్రి జిల్లా నాయకులు, మహిళలు ఖాళీ గ్యాస్‌ సిలిండర్లతో వినూత్న స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలతో, అనంతరం కొత్తగూడెం కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వంట గ్యాస్‌ధరలను పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఉసురుపోసుకుంటున్నాయని, ఆడపడుచులు కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారి ఉసురు ఊరికే పోదన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ దేశానికి ఒక మహిళను ప్రధాన మంత్రిగా అందించిన ఘనత కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. మహిళలను గౌరవించేది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. జనం ముఖ్యంగా మహిళలు కళ్లు తెరిస్తే.. రెండు ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. ధరల పెరుగుదలతో అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి పోయిందని, ధరల భారంతో సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదముందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జనం నలిగిపోతున్నారన్నారని, భవిష్యత్‌లో పీల్చే గాలికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేసే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పాల్వంచ చేరుకున్న ఆయన పాల్వంచలో టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దల సభలో ప్రశ్నించే గొంతుకగా ఉండే రాములునాయక్‌ను గెలిపించి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు బుద్ధిచెప్పాటని పిలుపునిచ్చారు. భట్టి యాత్ర జరుగుతున్న సమయంలో పాతపాల్వంచ వద్ద ఆటో నుంచి ఓ వ్యక్తి కిందపడ్డాడు. వెంటనే భట్టి తన సైకిల్‌ యాత్రను ఆపి.. ఆ బాధితుడి వద్దకు వెళ్లి పరామర్శించారు. కాంగ్రెస్‌ కార్యకర్తల సాయంతో ప్రథమ చికిత్సకు ఏర్పాట్లు చేశారు. భట్టి వెంట టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ, ఉమ్మడి జిల్లా మహిళ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు తోటదేవిప్రసన్న, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు ఎస్‌ఎ జలీల్‌, మహిళా నాయకులు ధరావత్‌ వాలీ, చంద్రకళ, రాజ్యలక్ష్మీ, జరీనా, నాయకులు జేబీ.శౌరీ, నాగా సీతారాములు, ఆంతోటి పాల్‌, బాలూనాయక్‌, షేక్‌ దస్తగిరి, పూనెం అనుదీప్‌, చాంద్‌పాషా, సూర్య కిరణ్‌, రవి, కోళ్ళపూడి కిరణ్‌, గొల్లపల్లి దయానంద్‌, బాలశౌరి, మోత్కూరి ధర్మారావు, ఏనుగుల అర్జున్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-09T05:18:10+05:30 IST