ఏయూలో దళిత సంఘాల ఆందోళన

ABN , First Publish Date - 2022-01-22T04:53:43+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దళిత, గిరిజనులు కులవివక్షతకు గురవుతున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఏయూలో ఆందోళన చేపట్టారు.

ఏయూలో దళిత సంఘాల ఆందోళన
ఆందోళన చేస్తున్న దళిత సంఘాల జేఏసీ ప్రతినిధులు

ఏయూ క్యాంపస్‌, జనవరి21: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దళిత, గిరిజనులు కులవివక్షతకు గురవుతున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఏయూలో ఆందోళన చేపట్టారు. పలు దళిత సంఘాల నేతలు జాక్‌ ఆధ్వర్యంలో వర్సిటీలోని రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే నిరసన తెలిపారు. వర్సిటీలో కులవివక్షతను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని, దళితులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి వర్సిటీ రెక్టార్‌ సమతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్‌ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దళితులు వివక్షతకు గురికావడం సిగ్గుచేటన్నారు. దళిత సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ మాటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జాన్‌కు తిరిగి వర్సిటీలో గది కేటాయించాలని, జాన్‌కు సహాయంగా ఉన్న విద్యార్థిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ నేత బొడ్డు కల్యాణరావు ప్రసంగిస్తూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జాన్‌ ఉంటున్న గదిని బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమన్నారు. ఏయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.జాన్‌ మాట్లాడుతూ ప్రొఫెసర్‌ ఎవరైన రిటైర్డ్‌ అయిన తరువాత పరిశోధక విద్యార్థులకు బోధన చేసే నిమిత్తం రెండేళ్లపాటు తన గదిలో ఉండే అవకాశం యూజీసీ కల్పించిందన్నారు. తాను పదవీ విరమణ చేసి రెండేళ్లు కూడా కాకముందే వర్సిటీలోని తన గదినుంచి బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ యునైటెడ్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆరేటి మహేష్‌, దళిత సంఘాల నేతలు చింతాడ సూర్యం, మల్లారపు సూర్యనారాయణ, గుడాల రాంబాబు, జి. అప్పారావు, గండి రాజేశ్వరి, పుచ్చకాయ కామేశ్వరరావు, రాజాన పార్వతి, భూషికోటిబాబు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T04:53:43+05:30 IST